Kotla Suryaprakash: అసలు బుగ్గనకు ఇరిగేషన్‌పై అవగాహన ఉందా?
ABN, First Publish Date - 2023-08-24T12:08:39+05:30
ఆర్థిక మంత్రి బుగ్గనకు ఇరిగేషన్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
కర్నూలు: ఆర్థిక మంత్రి బుగ్గనకు (Minister Buggana Rajendranath Reddy) ఇరిగేషన్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి (TDP Leader Kotla Suryaprakash Reddy) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంతసేపు దోచుకోవడం.. వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనే ద్యాసలో ఉన్నారు తప్ప.. రైతులు సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రాజెక్టులకు వద్దకు రండి ఎవరు ఏమి చేశారో చర్చిద్దామని సవాల్ విసిరారు. డోన్‌లో రోడ్లు వేస్తేనే అంతా అభివృద్ధి జరిగినట్లా అని ఆయన నిలదీశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తీసుకెళ్తుంటే వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని అడిగారు. గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. వర్షాలు పడక రైతులు అల్లాడుతున్నారని.. ఆర్ధిక మంత్రి బుగ్గన, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు కనపడటం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యామ్‌లో ఏపీ వాటా నాలుగు టీఎంసీలు ఉందని.. ఆ నీటి వాటాను తెప్పించాలన్నారు. కర్నూలులో హైకోర్టును ఏ రోజున ఏర్పాటు చేస్తారో ఆర్ధిక మంత్రి బుగ్గనకు చెప్పే ధైర్యం ఉందా అని అన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని కర్నూలు ప్రజలను మభ్యపెడుతున్నారని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-08-24T12:08:39+05:30 IST