Meruga Nagarjuna: పేదలకు భూమి ఇస్తే తట్టుకోలేని వ్యక్తి.. సంక్షేమ పథకాలు ఇస్తారా?
ABN, First Publish Date - 2023-05-29T14:21:35+05:30
టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి మేరుగ నాగార్జున (Minister Meruga Nagarjuna) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... పేదలకు సెంటు భూమి ఇస్తే తట్టుకోలేని వ్యక్తి ఇప్పుడు సంక్షేమ పథకాలను ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు రెండు రూపాయల కిలో బియ్యం, వైఎస్‌కు ఆరోగ్య శ్రీ లాంటి పేటెంట్ పథకాలు ఉన్నాయని.. మరి చంద్రబాబుకు అలాంటి పేటెంట్ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలకు ఏమీ గుర్తు ఉండదు, అన్ని మర్చిపోతారు అన్న ఫిలాసఫీతో మహానాడులో మేనిఫెస్టో ప్రకటించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) 98 శాతం మేనిఫెస్టో అమలు చేసిందని చెప్పుకొచ్చారు. మహానాడులో ప్రకటించిన అన్ని హామీలు అమలు చేయగలరా అని నిలదీశారు. పూర్ టూ రిచ్ పథకం ఏమిటి అని నిలదీశారు. తాము తప్పిదాలు చేసినా ప్రజలు గమనిస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 2.10 లక్షల కోట్ల డీబీటీలో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా అని అడిగారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో నాలుగు రోజుల తర్వాత ఎక్కడ ఉంటుందో తెలియదన్నారు. ఇళ్ళ పట్టాలు ఇచ్చిన 17 వేల కాలనీలు సాధ్యమైనంత పూర్తి చేస్తామని మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.
Updated Date - 2023-05-29T14:21:35+05:30 IST