MLC Election Results: నిరాశగా సజ్జల!

ABN , First Publish Date - 2023-03-24T04:15:04+05:30 IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపునకు హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అనూహ్యంగా గెలిచి.. తమ అభ్యర్థి కోలా గురువులు ఓడిపోవడంతో లెక్కింపు కేంద్రం నుంచి నిరాశగా వెళ్లిపోయారు.

MLC Election Results: నిరాశగా సజ్జల!

అనూహ్య ఫలితంతో మౌనంగా నిష్క్రమణ

అనూరాధకు 20 ఓట్లు పడగానే

పయ్యావుల విజయ సంకేతం

ఎలా చెప్పగలిగారని వైసీపీ నేతల ప్రశ్న

తన లెక్కలు తనకున్నాయన్న కేశవ్‌

రీకౌంటింగ్‌పై వైసీపీ-టీడీపీ వాదులాట

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపునకు హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అనూహ్యంగా గెలిచి.. తమ అభ్యర్థి కోలా గురువులు ఓడిపోవడంతో లెక్కింపు కేంద్రం నుంచి నిరాశగా వెళ్లిపోయారు. తమకున్న సంఖ్యాబలంతో మొత్తం ఏడు సీట్లనూ గెలుచుకోవాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి పట్టుదల ప్రదర్శించడంతో సజ్జల వైసీపీ అభ్యర్థుల్లో ఒకరి తరఫున పోలింగ్‌ ఏజెంటుగా వచ్చి కూర్చున్నారు. ఆయన ఎదురుగా ఉంటే ఎమ్మెల్యేలు గీత దాటరని వైసీపీ అధిష్ఠానం భావించింది. ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఆయన ఉంటే అధికారులు ‘జాగ్రత్త’గా ఉంటారన్న వ్యూహంతో కౌంటింగ్‌కు కూడా ఆయన్ను పంపారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అధికార పక్ష ఎమ్మెల్యేలు కొందరు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడడంతో వైసీపీ ఒక స్థానాన్ని కోల్పోయింది. తీవ్ర నిరాశకు లోనైన సజ్జల మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించారు.

లెక్కింపు కేంద్రంలో ప్రారంభం నుంచీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ ఓటు ఒక్కటి కూడా జారిపోదని, తమ అభ్యర్థులంతా ఖాయంగా గెలుస్తారని వైసీపీ ఏజెంట్ల బృందం గట్టి ధీమాతో కనిపించింది. టీడీపీ తరఫు ఏజెంట్ల మనసులోనూ అదే ధీమా ఉన్నా.. బయటకు వ్యక్తం చేయకుండా మౌనంగా కూర్చున్నారు. తమ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ ట్రేలో 20 ఓట్లు పడగానే లెక్క చూసుకున్న టీడీపీ తరఫు ఏజెంట్‌ పయ్యావుల కేశవ్‌.. విజయం తమదేనని సంకేతాలిచ్చారు. వైసీపీ ఏజెంట్లు ఆయన వైపు కొంత ఆశ్చర్యంగా చూశారు. ప్రథమ ప్రాధాన్యం ఓట్లు 22 వస్తే అనూరాధ మొదటి లెక్కింపులోనే గెలుస్తారు. కానీ ఆమెకు ఏకంగా 23 వచ్చాయి. అంతే.. వైసీపీ ఏజెంట్లు దిగ్ర్భాంతి చెందారు.

అంత ముందుగా ఎలా అంచనా వేశారని పయ్యావులను పాలకపక్ష నేతలు ప్రశ్నించగా.. తన లెక్కలో తనకు ముందుగానే అర్థమైపోయిందని ఆయన బదులిచ్చారు. వైసీపీ అభ్యర్థుల్లో జయమంగళ వెంకటరమణ, కోలా గురువులు తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో గెలవలేకపోయారు. వారిద్దరికి చెరి 21 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థికి తొలి ప్రాధాన్య ఓటు వేసిన వారిలో ఒకరు రెండో ప్రాధాన్య ఓటును జయమంగళ వెంకటరమణకు వేయడంతో ఆయన గెలిచారు. గురువులు ఓడిపోయారు. లెక్కింపు పూర్తయ్యాక మరోసారి పరిశీలన, రీకౌంటింగ్‌ జరపాలని వైసీపీ నేతలు రిటర్నింగ్‌ అధికారిని డిమాండ్‌ చేశారు. దానికి టీడీపీ నేతలు అంగీకరించలేదు. ఈ దశలో ఉభయ వర్గాల నడుమ వాగ్వాదం జరిగింది. రీకౌంటింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనూరాధ లిఖితపూర్వకంగా లేఖ కూడా సమర్పించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులతో దీనిపై మాట్లాడారు. తమకు పడిన ఓట్లలో కొన్ని చెల్లకుండా ప్రకటింపజేసే కుట్రతోనే పునఃపరిశీలన, రీకౌంటింగ్‌ అడుగుతున్నారని టీడీపీ నేతలు అనుమానించారు. అయితే తమ ఎమ్మెల్యేలకు ఇచ్చిన కోడ్‌ను సరిగా చూసుకోలేకపోయామని, అది చూసుకోవడం కోసమే పునఃపరిశీలన అడుగుతున్నామని లెక్కింపు కేంద్రం లోపల వైసీపీ నేతలు వారికి చెప్పారు. చివరకు అధికారులు మరోసారి ఓట్లను లెక్కించారు. అందులో కూడా ఫలితం మొదటిసారి మాదిరిగానే వచ్చింది. దీంతో వైసీపీ నేతలు అవమానభారంతో వెనుదిరిగారు. టీడీపీ అభ్యర్థికి తొలి ప్రాధాన్యం ఓటు వేసిన ఒక ఎమ్మెల్యే.. రెండో ఓటును జయమంగళ వెంకటరమణకు వేయడం వల్లే ఆయన గెలిచారని, అదే కీలకమైందని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-03-24T04:15:48+05:30 IST