Lokesh: నా 153 రోజుల పాదయాత్రలో అందరూ జగన్ ప్రభుత్వ బాధితులే
ABN, First Publish Date - 2023-07-11T12:03:47+05:30
153 రోజుల్లో 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం ఆనందంగా ఉందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు.
నెల్లూరు: 153 రోజుల్లో 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం ఆనందంగా ఉందని టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) అన్నారు. మంగళవారం ఉదయం జిల్లాలోని సిరిపురం క్యాంపు సైటు నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా కొత్తపల్లి బ్రహ్మంగారి ఆలయంలో గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీ చీఫ్ చంద్రబాబు (TDP Chief Chandrababu) అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని.. ఏపీకి 40వేల పరిశ్రమలు తెచ్చి, ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. జగన్ కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారన్నారు. నిత్యవసారాలు, పెట్రోలు, గ్యాస్ ధరలు సెంచిరీలు దాటుతున్నాయని ఆయన విమర్శించారు.
‘‘నా 153 రోజుల పాదయాత్రలో అందరూ జగన్ ప్రభుత్వ బాధితులేనని తెలుసుకున్నా. నేను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నా. పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా... మైకు, స్టూలు లాక్కొన్నారు... ప్రజలు భయపడి మాట్లాడటం లేదు. ఆ భయం పోవాలని మీ మధ్యకి వచ్చా. మనమంతా బటన్ జనరేషన్‌గా మారిపోతున్నాం. పైకి రావాలంటే కష్టపడాలి. మనం నమ్ముకున్న దానికి పాటుపడాలి’’ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంట పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపు అయ్యాయన్నారు. మంత్రి కాకాణికి కల్తీ మద్యంపై ఉన్న అవగాహన వ్యవసాయం మీద లేదని... ఆయనో కోర్టు దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏపీ.. రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉందన్నారు. అన్ని రంగాలని సమానంగా ముందుకు తీసుకువెళుతామని లోకేశ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-07-11T12:03:47+05:30 IST