మౌనమే అంగీకారమా?
ABN , First Publish Date - 2023-04-27T01:58:47+05:30 IST
మంత్రి ఆదిమూలపు సురేష్ రాజకీయ ప్రతిష్ట మంటగలిసింది. గత 15 ఏళ్లుగా ఆయన అటు నియోజకవర్గంలోనూ, ఇటు జిల్లాలోనూ రాజకీయంగా తెచ్చుకున్న గుర్తింపు ఒక్కసారిగా మాసకబారింది.

రాజకీయంగా బలైన మంత్రి సురేష్
ఇంటాబయటా మద్దతు లేక నిరాశ
స్పందించని ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు
ఆశించిన స్థాయిలో ముందుకు రాని దళిత సంఘాలు
పట్టు సాధించడం ఎలాగో తెలియక మల్లగుల్లాలు
మంత్రి ఆదిమూలపు సురేష్ రాజకీయ ప్రతిష్ట మంటగలిసింది. గత 15 ఏళ్లుగా ఆయన అటు నియోజకవర్గంలోనూ, ఇటు జిల్లాలోనూ రాజకీయంగా తెచ్చుకున్న గుర్తింపు ఒక్కసారిగా మాసకబారింది. గతంలో వృత్తిపరమైన అంశాలకు సంబంధించి సీబీఐ కేసుల సమయంలో కూడా ఎదురుకాని పరాభవం ఇప్పుడు ఎదురైంది. అందుకు ఆయన విపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడమే కారణమైంది. అనంతరం జిల్లాస్థాయిలో వైసీపీకి చెందిన ఒక్క నాయకుడు కూడా ఆయనకు మద్దతుగా నిలవకపోవడం, కనీసం నియోజకవర్గంలో పార్టీశ్రేణులు ముందుకు రాకపోవడం ఆలోచించాల్సిన విషయం. చివరకు దళితసంఘాలు కూడా స్పందించ లేదు. ఈ మొత్తం పరిస్థితిని విశ్లేషిస్తే మంత్రి సురేష్ చర్యను అందరూ తప్పుబడుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. తప్పొప్పులకు అతీతంగా అండగా నిలవాల్సిన జిల్లాలోని ఆ పార్టీశ్రేణులు ఆయనకు మద్దతుగా ఎందుకు స్పందించలేద నేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
నిజానికి రాజకీయపార్టీలోని ఒక నాయకుడు మరీ ముఖ్యంగా మంత్రి స్థాయిలో ఉన్న నేతలకు ఆయా సందర్భాల్లో తప్పొప్పులకతీతంగా ఆపార్టీలోని నాయకులంతా మద్దతు ఇస్తారు. కానీ ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సురేష్‌కు జిల్లాలోని వైసీపీలో ఉన్న దళిత నాయకులు కూడా మద్దతుగా మాట్లాడ లేదు. దాడిని ప్రేరేపించింది చంద్రబాబు అని, టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడికి దిగారని అందుకే మా పార్టీశ్రేణులు ముగ్గురు గాయపడ్డారని సంఘటన జరిగిన మరుసటి రోజు మంత్రి సురేష్ మొరపెట్టుకున్నారు. అయితే ఆయన వాదనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ తర్వాత కూడా ఆయనకు జిల్లాలోని వైసీపీ నాయకుల నుంచి మద్దతు లభించలేదు. బహిరంగంగా ఒక్క నాయకుడైనా ఆయన్ను పరామర్శించి సానుభూతి చెప్పలేదు. కారణం ఏదైనా చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే ముందు సురేష్ అలాంటి కార్యక్రమం నిర్వహించాల్సి ఉండకూడదనేది ఆ పార్టీశ్రేణుల అభిప్రాయం. ఈ విషయంలో పోలీసులు, ప్రత్యేకించి మొత్తం చంద్రబాబు నాయుడు పర్యటనను పర్యవేక్షించిన ఏఎస్పీ శ్రీధర్ పాత్రను కొందరు ఆక్షేపిస్తున్నారు. ఆ కోణంలో అది నిజమైనప్పటికీ రాజకీయ కోణంలో వైసీపీ నుంచి మంత్రి సురేష్‌కు మద్దతు లభించకపోవటం ఇక్కడ చర్చనీయాంశమైంది.
గత అనుభవాల దృష్ట్యా...
మంత్రివర్గ విస్తరణలో తనను తొలగించి సురేష్‌ను కొనసాగించడంపై బాలినేని అసంతృప్తితో ఉన్నారనేది జగమెరిగిన సత్యం. మార్కాపురంలో సభ సందర్భంగా బాలినేనికి ఎదురైన ప్రొటోకాల్ చేదుఅనుభవం గురించి తెలుసుకుని సీఎం జగన్ వెంటనే పిలిచి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనతోనే బటన్ నొక్కించడం, మంత్రి అయిన సురేష్‌కు కనీసం ఒక్క నిమిషం అయినా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అగౌరవపర్చడం తెలిసిందే. ఆ తర్వాత మంత్రి సురేష్ ప్రతిపక్ష నేత కాన్వాయ్ ఎదుట కేవలం నిరసన తెలిపితేనే తమపై దాడి చేశారని, చంద్రబాబు దీనికి కారణమని చెప్పడంతోపాటు తమ శ్రేణులకు దెబ్బలు తగిలాయని కూడా వివరించారు. అయినా ఏ ఒక్కరూ కనీసం సానుభూతి కూడా చూపలేదు.
బాలినేని సరే మిగతా వారు..
బాలినేని మాట్లాడకపోవడానికి ఆయన అక్కసుతో ఉన్నారని అనుకున్నా మిగిలిన వారు స్పందించకపోవడంలోని ఆంతర్యం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకు కారణం సురేష్ చేసింది తప్పు అని వైసీపీ నాయకులు అనుకోవడమేనా, లేక సీఎం వైఖరి కూడా బాలినేనికి మద్దతుగా ఉండటంతో మిగిలిన వారు గప్‌చుప్‌గా ఉన్నారా.. ఈ రెండు ప్రశ్నలు ఆ పార్టీశ్రేణుల్లో ప్రస్తుతం చర్చనీయాంశమ య్యాయి. చివరకు ఇలాంటి ఏ ఘటనలు జరిగినా దాన్ని భుజాన వేసుకొని మోస్తూ బహిరంగంగా మాట్లా డే ముఖ్య సలహాదారుడు సజ్జల నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అందులో కారణం ఏదైనా మంత్రి సురేష్ బలిపశువయ్యారనే విషయాన్ని ఆ పార్టీలోని అంతర్గత వ్యవహారాలు తెలియజేస్తున్నాయి.
పార్టీ వైఖరి అదేనా?
ఎర్రగొండపాలెం ఘటన ద్వారా వైసీపీలో ఉన్నత పదవుల్లో ఉన్న దళిత నేతలను కూడా ఆ పార్టీ విస్మరిస్తున్నదన్న విషయం తేటతెల్లమవుతోంది. ఈ అన్ని అంశాలను పక్కనపెడితే ఆ రోజు మంత్రి సురేష్ వ్యవహారశైలి రాజకీయంగా సరైంది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక మంత్రి సురేష్ స్వయంగా నిరసనలో పాల్గొని రండి..రండి అని పిలిచినా నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల నుంచి పెద్దగా కదలిక రాలేదు. చివరకు సంఘటన తర్వాత కూడా మంత్రికి మద్దతుగా ఆ పార్టీ కేడర్ ముందుకు వచ్చి ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించలేదు. ఒకవైపు టీడీపీ ఈ విషయాన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నా దీటైన సమాధానం కూడా వైసీపీ నుంచి లేదు. దీంతో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం ద్వారా మంత్రి సురేష్ తప్పుచేశారనే భావనతోపాటు ఆయనకు పార్టీలో మద్దతులేదన్న విషయాన్ని వైసీపీ నాయకత్వమే తేటతెల్లం చేసింది. ఈ నేపఽథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది, మంత్రి సురేష్ ఈ అప్రతిష్ట నుంచి బయటపడేందుకు ఏం చేస్తారనేది వేచి చూడాలి.