శిలాఫలకం ధ్వంసానికి వైసీపీ కుయుక్తి
ABN , First Publish Date - 2023-11-28T22:51:29+05:30 IST
తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెంలో మంగళవారం వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పార్టీ జెండా దిమ్మె ఏర్పాటు కోసం టీడీపీ పాలనలో ఏర్పాటు చేసిన అభివృద్ధి శిలాఫలకాన్ని ధ్వంసం చేశాయి. వైసీపీ వర్గీయులు శిలాఫలకాన్ని పగులగొడుతుండగా టీడీపీ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పరిశుద్ధరావు, తిమోతి, నరసయ్య, ఆది సుబ్బారెడ్డి తదితరులు అడ్డుకున్నారు.

కూల్చివేత పనులను అడ్డుకున్న టీడీపీ నాయకులు
సర్పంచ్ చొరవతో వెనక్కి
తాళ్లూరు, నవంబరు 28 : మండలంలోని నాగంబొట్లపాలెంలో మంగళవారం వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పార్టీ జెండా దిమ్మె ఏర్పాటు కోసం టీడీపీ పాలనలో ఏర్పాటు చేసిన అభివృద్ధి శిలాఫలకాన్ని ధ్వంసం చేశాయి. వైసీపీ వర్గీయులు శిలాఫలకాన్ని పగులగొడుతుండగా టీడీపీ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పరిశుద్ధరావు, తిమోతి, నరసయ్య, ఆది సుబ్బారెడ్డి తదితరులు అడ్డుకున్నారు. గ్రామంలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరించాల్సి ఉంది. దీంతో ఎస్సీ కాలనీకి వెళ్లే మలుపు వద్ద సీసీ రోడ్డు కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకాన్ని తొలగించాలని పంచాయతీ కార్మికులకు వైసీపీ నాయకులు చెప్పడంతో వారు శిలాఫలకాన్ని పగులగొట్టేందుకు సిద్ధమయ్యారు. పరిశుద్ధరావు ఆధ్వర్యంలో నాయకులు కూల్చివేతను అడ్డుకున్నారు. ఎందుకు దీనిని తొలగిస్తున్నారని ప్రశ్నించగా ఇక్కడ వైసీపీ జెండా దిమ్మెను ఏర్పాటు చేస్తామని కూలీలు చెప్పారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ చిమటా సుబ్బారావు దృష్టికి టీడీపీ నాయకులు తీసుకెళ్లారు. శిలాఫలకాన్ని కూల్చవద్దని, జెండా దిమ్మెను మరోచోట ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ కూలీలకు సూచించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.