Share News

Chandrababu : వైసీపీ ఆటలు సాగనివ్వను

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:05 AM

వైసీపీ నేతల గురించి మాట్లాడి సమయం వృథా చేసుకోవడం తనకిష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘వారితో ఎవరూ లాలూచీపడొద్దు.

Chandrababu : వైసీపీ ఆటలు సాగనివ్వను

  • వారి గురించి మాట్లాడడం టైం వేస్ట్‌: చంద్రబాబు

  • రాజకీయాలను కలుషితం చేశారు

  • మనవాళ్లకూ లంచాలిచ్చి పబ్బం గడుపుకొనే యత్నం

  • వారితో లాలూచీ పడొద్దు

  • రాజధాని పేరుతో 3 ముక్కలాట

  • అమరావతిని శ్మశానమన్నారు

  • రాజధానిని సర్వనాశనం చేశారు

  • మనం తిరిగి గాడిన పెడుతున్నాం

  • విశాఖ స్టీల్‌ప్లాంటుకు ప్యాకేజీ, రైల్వే జోన్‌ సాధించాం

  • 3 పార్టీల ఐక్యత శాశ్వతం కావాలి

  • విజయోత్సవ సభలో చంద్రబాబు

  • రెడ్‌ బుక్‌ తన పని తాను చేసుకుపోతోంది: లోకేశ్‌

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల గురించి మాట్లాడి సమయం వృథా చేసుకోవడం తనకిష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘వారితో ఎవరూ లాలూచీపడొద్దు. వారు రాజకీయాలను కలుషితం చేశారు. మన వాళ్లకూ లంచాలిచ్చి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వను’ అని తేల్చిచెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపు సంబరాలను మంగళవారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కొందరు టీడీపీ, ఎన్డీయే నాయకులు.. వైసీపీ నాయకుల కోసం పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎన్డీయే నాయకులు పనిచేయాల్సింది ఎన్డీయే కార్యకర్తలకు మాత్రమేనని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ‘రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడారు. అమరావతిని శ్మశానం అన్నారు. రాజధానిని అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రపంచబ్యాంకు నిధులు తీసుకొచ్చి తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి 72 శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ దానిని నిర్వీర్యం చేసింది. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2020కే పూర్తి చేసి జాతికి అంకితం చేసే వాళ్లం. వైసీపీ నిర్వాకం కారణంగా డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది. అది చూసి బాధపడినవారిలో నేను మొదటివాడిని. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పనైపోయిందని అనుకున్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను నిర్వీర్యం చేయొద్దని కేంద్రాన్ని కోరాను. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి గాడిలో పెట్టేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది.’ అని వివరించారు. ఇంకా ఏమన్నారంటే..


హామీలన్నీ ఒక్కటొక్కటిగా.. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఆర్థిక ఆరాచకానికి పాల్పడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలా అన్న ఆలోచనతో నిద్ర కూడా పట్టలేదు. కేంద్రాన్ని ఏమడగాలో తెలియని పరిస్థితి నుంచి నెమ్మదిగా రాష్ట్రాన్ని గాడిన పెడుతూ వచ్చాం. ఇచ్చిన హామీలన్నీ ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం.

పట్టభద్రుల స్థానాల్లో భారీ మెజారిటీ..

కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరోసారి పొందగలిగాం. 2024 ఎన్నికలు చరిత్ర సృష్టిస్తే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ చరిత్రను సుస్థిరం చేశాయి. మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఇద్దరు ఎమ్మెల్సీలు గెలవడం గొప్ప విషయం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి బలపరచిన ఇద్దరు అభ్యర్థులు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. పట్టభద్రుల స్థానాల్లో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి.

పార్టీని గౌరవించేవారిని పార్టీ గౌరవిస్తుంది

సీటు కోల్పోతే ధైర్యం కోల్పోకుండా పనిచేయడం ముఖ్యం. పార్టీపరంగా తీసుకునే నిర్ణయాలను గౌరవించినవారిని.. తిరిగి గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వాల్సి వస్తోందని చెప్పగానే ఆలపాటి త్యాగం చేశారు. ఆలపాటి గెలుపు కోసం మనోహర్‌ కూడా తీవ్రంగా శ్రమించారు.

ఎవరికీ దక్కని అదృష్టం నాది: ఆలపాటి

టీడీపీలో ఎవరికీ దక్కని అదృష్టం తనకు దక్కిందని నూతన ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పేర్కొన్నారు. ఈ గెలుపు తన బాధ్యతను మరింత పెంచిందని పేరాబత్తుల రాజశేఖరం తెలిపారు.

Updated Date - Mar 05 , 2025 | 08:48 AM