Purandeshwari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు.. ఆ వెంటనే జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు..
ABN, First Publish Date - 2023-07-13T12:03:09+05:30
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు.
విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeshwari) బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran kumar Reddy), మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somuveerraju) ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గజమాలతో బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ చీఫ్ బీజేపీ పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద కూడా బాణాసంచాతో పురంధేశ్వరికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలికి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరిగింది. అనంతరం పురంధేశ్వరికి బీజేపీ నేతలు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు.
అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. తనను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ.. అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ అని.. అవినీతిని వ్యతిరేకించే పార్టీ అని అన్నారు. ఏపీలో బీజేపీ అన్ని విధాలా సహకారం అందించిందని చెప్పుకొచ్చారు. బీజేపీ అందించిన సహకారం ఎలాంటిదో చూడాలన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. కేంద్రం చలవతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయన్నారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ సర్కార్‌పై ధ్వజం..
బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జగన్ సర్కార్‌పై పురంధేశ్వరి మండిపడ్డారు. జాతీయ రహదారులు 8623 కిలో మీటర్ల నిర్మాణాలకు రూ.1 లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్ధితి ప్రజలందరికీ తెలుసన్నారు. ఏపీ డివిజన్ యాక్ట్ ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యాసంస్ధలన్నీ కేంద్రం ఏపీలో నిర్మించిందన్నారు. ఎయిర్ పోర్టుల విస్తరణను కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరిగిందన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ, పలు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని.. ఉన్నవి తరలిపోతున్నాయని పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని నిమ్స్‌ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్‌ఆర్‌జీపీ కింద 2022 - 23 వరకు 8 వేలకు కోట్లకు పైగా వచ్చాయన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మందికి ఉచిత బియ్యం అందుతోందన్నారు. ఈ ఏడాది బియ్యం ద్వారా 10 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి అందిందని తెలిపారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రూ.12 వేలు ఇస్తామన్నారని.. దానిపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైతులను సీఎం మోసం చేయడం కాదా అంటూ మండిపడ్డారు. రైల్వేలో 72 స్టేషన్‌ల అభివృద్ధికి కేంద్రమే సహాయ సహకారాలు అందించిందన్నారు. ఏపీ ప్రభుత్వం సహకరిస్తే అన్ని అభివృద్ధి చెందుతాయని... లేకుంటే పెండింగ్‌లో ఉన్నవి పెండింగ్‌లోనే ఉండిపోతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.46,836 కోట్లు గ్రాంట్లు ద్వారా రాష్ట్రానికి అందిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నెరుగా సర్పంచ్‌ల అకౌంట్‌లలోకి నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరంపై కీలక వ్యాఖ్యలు...
పోలవరంపై కేంద్రం ఎక్కడా జాప్యం చేయలేదని స్పష్టం చేశారు. ఇటీవల రూ.12 వేల కోట్లు పోలవరంకి కేంద్రం ఇచ్చిందన్నారు. పోలవరం మీరు కట్టకుంటే కేంద్రానికి అప్పచెప్పాలన్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. మహిళలు మొబైల్ ఊపడానికే తప్ప దిశా ఎందుకు పనికిరావడం లేదని విమర్శించారు. విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదన్నారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని మండిపడ్డారు.
నాణ్యత లేని బ్రాండ్లను విక్రయిస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లడం లేదా అంటూ నిలదీశారు. మద్యం బ్రాండ్ల ద్వారా 20 శాతం ఓనర్‌కు వెళితే 80 శాతం ప్రభుత్వానికి వస్తుందరి.. అందులో 25 శాతం బిల్లులే లేవని అన్నారు. మైనింగ్ వ్యాపారులపై దాడులు చేయించి తనకు అనుకూలంగా ఉన్నవారికి ఇప్పించుకుంటూ దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక లోడ్ కొనాలంటే రూ.40 వేలని.. ఇసుక ద్వారా జరుగుతున్న అవినీతిని ఒక సంస్ధకు కేటాయిస్తూ దోచుకున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో నడుస్తోందన్నారు. విశాఖలో ఒక వ్యక్తి ల్యాండ్ కబ్జా చేస్తే.. కడప నుంచి వచ్చిన వారు బెదిరిస్తే.. కోర్టుకు వెళ్లి గెలిచి తన ల్యాండ్ గెలుచుకున్నారని తెలిపారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ విమర్శించారు.
Updated Date - 2023-07-13T12:41:49+05:30 IST