AP News: భక్తులు లేకుండానే ముగిసిన రాజశ్యామల యాగం
ABN, First Publish Date - 2023-05-17T20:14:54+05:30
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం..
విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. యజ్ఞం ముగింపు సందర్భంగా నిర్వహించిన మహాపూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) హాజరయ్యారు. ఆరు రోజులపాటు జరిగిన ఈ గాయానికి పెద్దగా భక్తులు హాజరుకాలేదు. చివరి రెండు రోజులలో భక్తులను తరలించారు. చివరి రోజున ఇదే తంతును కొనసాగించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మనందేంద్ర సరస్వతి, అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి సీఎం జగన్‌తో పూర్ణాహుతిని చేయించారు. తొలుత పాంచరాత్ర యాగశాలలో నిర్వహించిన సుదర్శన యాగానికి పూర్ణాహుతి చేశారు. తర్వాత వైదిక స్మార్తం, వైఖానస యాగశాలలో పూర్ణాహుతి చేసిన తర్వాత చివరిగా శైవం ఆగమ యాగశాలలలో పూర్ణాహుతి చేశారు. తదుపరి శ్రీలక్ష్మీ దేవి స్వర్ణ ప్రతిమకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ తంతును మొత్తం స్వరూపనందేంద్ర సరస్వతి దగ్గరుండి చేయించారు. మొదటి యాగశాల పాంచరాత్రకు వెళ్తుండగా మార్గమధ్యలోనే సీఎం జగన్... స్వరూపనందేంద్ర సరస్వతి పాదాలకు నమస్కరించారు. జగన్ వెంట దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) దంపతులు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-05-17T20:37:04+05:30 IST