Rammohan Naidu : అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-09-28T13:50:52+05:30
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ మేరకు రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించారని హోం మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్త మాదిరిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజయ్, సీఎం వైఎస్ జగన్ కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రతిపక్షనేత చంద్రబాబుని అరెస్టు చేసి విచారణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచారణ జరపకుండానే, సర్వీసు నిబంధనలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టులకి నివేదించాల్సిన బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి ఫక్తు వైసీపీ నేతలాగ ఢిల్లీ, హైదరాబాద్, అమరావతిలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిపక్ష నేతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అలాగే దర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకి విడుదల చేస్తున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ ఉల్లంఘించిన సర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధనలు, అడ్డగోలు ప్రవర్తనపై అన్ని ఆధారాలను హోం మంత్రికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పంపించారని సమాచారం.
Updated Date - 2023-09-28T13:50:52+05:30 IST