Somu Veerraju: ఆర్థిక దిగ్బంధంలో రాష్ట్ర ప్రభుత్వం: సోము వీర్రాజు
ABN, First Publish Date - 2023-03-24T20:56:04+05:30
రాష్ట్రంలోని వనరులన్నింటినీ ప్రభుత్వంలోని పెద్దలు దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు.
సత్తెనపల్లి: రాష్ట్రంలోని వనరులన్నింటినీ ప్రభుత్వంలోని పెద్దలు దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. ఇసుక, గ్రావెల్ తదితర వనరులను ప్రభుత్వ పెద్దలు దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారన్నారు. ఇసుక రీచ్‌లలో అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దిగ్బంధంలో ఉందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వంపై చార్జ్‌షీటు (Charge sheet) దాఖలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని కింది స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఏప్రిల్ 17 నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశామన్నారు. ప్రధానమంత్రి మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకు సూరత్ కోర్టు శిక్ష విధించిందన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరిగిందన్నారు. ఓటు శాతాన్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. జనసేన, బీజేపీ కలిసే ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
దివ్వెలను సత్కరించిన వీర్రాజు
బీజేపీ కార్యాలయంలో వీర్రాజు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించి దివ్వెల శ్రీనివాసరావును సన్మానించారు. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరత్‌మాత అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టిన సత్తెనపల్లి పట్టణ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దివ్వెల శ్రీనివాసరావును వీర్రాజు సత్కరించారు. ఐదు వందల రోజులుగా ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగించటం అభినందనీయమన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వీర్రాజు కొనసాగించారు.
Updated Date - 2023-03-24T20:56:04+05:30 IST