Suspension on 4 MLAs : నమ్మిన బంటుగా ఉన్న మేకపాటి ఫ్యామిలీని వైఎస్ జగన్ టచ్ చేయడంతో...!
ABN, First Publish Date - 2023-03-24T19:56:29+05:30
నెల్లూరు పెద్దా రెడ్లపై వైసీపీ అధిష్టానం పగబట్టింది. ముగ్గురు రెడ్డి సామాజిక ఎమ్మెల్యేలు, ఒక దళిత ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేశారు.
అమరావతి: నెల్లూరు పెద్దా రెడ్లపై వైసీపీ అధిష్టానం పగబట్టింది. ముగ్గురు రెడ్డి సామాజిక ఎమ్మెల్యేలు, ఒక దళిత ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi)పై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. చాలాకాలంగా ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు వైసీపీపై తిరుగుబాటు చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం కూడా అంతే వీరి తిరుగుబాటును మొగ్గలోనే తుంచివేయాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లే ఆనం, కోటంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వీళ్ల కోరలు పీకేశారు. వీళ్ల స్థానంలో కొత్త బాస్‌లను అధిష్టానం నియమించింది. దీంతో ఈ ఇద్దరు మరింతగా ప్రభుత్వంపై విమర్శలు సంధించడం మొదలు పెట్టారు. ఆనం కాస్త ఎనుకా ముందు చూస్తూ వస్తున్నారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం ప్రభుత్వంపై సై అంటూ సవాల్ విసురుతున్నారు. కోటంరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతి వేదికను ఉపయోగించుకుంటున్నారు. అది అసెంబ్లీ కావచ్చు మీడియా సమావేశం కావచ్చు.. సందర్భం ఏదైనా సరే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ తరుణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) వచ్చాయి. ముందు అనుకున్నట్లే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ ఎప్పుడో ఆశలు వదులుకుంది. మిగిలిన ఓట్లన్నీ పడతాయనే అంచనాతోనే ఏడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కానీ వారిలో మరో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేసేశారు.
క్రాస్ ఓటింగ్‌తో తొలి ఫలితం టీడీపీ (TDP)కి అనుకూలంగా వచ్చింది. గెలవడానికి 22 ఓట్లు అవసరం కాగా.. 23 ఓట్లతో టీడీపీ పంచుమర్తి అనూరాధ తొలి కౌంట్‌లోనే విజయం సాధించారు. వైసీపీ నుంచి మర్రి రాజశేఖర్, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణరాజుకు 22 చొప్పున ఓట్లు పడ్డాయి. దీంతో వీరి విజయం కూడా ఖరారైంది. వైసీపీ నుంచి బరిలో నిలిచిన మరో ఇద్దరు సభ్యులు కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు చెరో 21 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అవసరమైంది. చివరికి జయమంగళ వెంకట రమణ రెండో ప్రాధాన్యంతో గట్టెక్కారు. కోల గురువులు ఓటమిపాలయ్యారు. ‘మావి కాదు’ అనుకున్న రెండు ఓట్లను పక్కన పెట్టి.. హోటళ్లలో క్యాంపులు పెట్టి.. మళ్లీమళ్లీ మాక్ పోలింగ్ పెట్టి.. కట్టుదిట్టంగా వ్యూహం రచించినా వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ‘ఏడింటికి ఏడూ’ కొట్టేయాలనుకున్న వైసీపీ (YCP)కి నిరాశే ఎదురైంది. ఓటమిని తిరుగుబాటును వైసీపీ అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఆగమేఘాల మీద స్వంత ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ వేటుతో దెబ్బకొట్టాలని భావించిన వైసీపీ అధిష్టానానికి నిరాశ ఎదురవుతోంది. ఈ ఎమ్మెల్యేలు ఏ మాత్రం బెదరక పోవడం గమనార్హం.
సస్పెండ్ చేశారు నాకు హ్యాపీనే..
సస్పెన్షన్‌పై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. వైసీపీలో తనను తీవ్రంగా అవమానించారని తెలిపారు. సస్పెండ్ చేయడం తనకు హ్యాపీనే అని మేకపాటి చెప్పుకోవడం ఇక్కడ కొసమెరుపు. పైగా తన బరువంతా దిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా మనుషుల్ని పంపారని తెలిపారు. తాను ఎప్పుడూ సీఎం జగన్‌తో అమర్యాదగా ప్రవర్తించలేదని, కానీ పార్టీ పా పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిందని తప్పుబట్టారు. వైఎస్‌ఆర్ (YSR) కొడుకు అనే జగన్ వెంట నడిచామని మేకపాటి పేర్కొన్నారు. జగన్ కోసం గతంలో ఎమ్మెల్యే పదవికి మేకపాటి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఇప్పు డు అదే వైసీపీ నుంచి మేకపాటి సస్పెండ్ కావడం గమనార్హం. గతంలో వైసీపీ హైకమాండ్‌పై కోటంరెడ్డి ఆరోపణలు చేశారు. క్రాస్ ఓటింగ్ పేరుతో సస్పెండ్ చేయడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఆనం ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి రాకపోవడంతో ఆనం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఆయువుపట్టు. అంతేకాదు జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో వీళ్లున్నారు. పైగా జగన్‌ను నమ్మి ఆయన వెంటే ఈ నేతలు నడిచారు. జగన్ రాజీనామా చేయమన్నప్పుడు రాజీనామా చేశారు. పార్టీని కాసుకుని జగన్ వెన్నంటే ఉన్నారు. గతాన్ని పట్టించుకోకుండా నెల్లూరు పెద్దారెడ్లపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని జిల్లా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
Updated Date - 2023-03-24T20:42:10+05:30 IST