Atchannaidu: నారాయణపై వైసీపీ రౌడీ మూక దాడి చేయడం దుర్మార్గం
ABN, First Publish Date - 2023-10-05T13:10:55+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రగా వస్తున్న వృద్ధుడు నారాయణపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రగా వస్తున్న వృద్ధుడు నారాయణపై వైసీపీ శ్రేణులు దాడి చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అణిచివేతే రాజ్య విధానంగా జగన్ రెడ్డి పాలన సాగుతోందని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్త నారాయణపై వైసీపీ రౌడీ మూక దాడి చేయడం దుర్మార్గమన్నారు. భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు నారాయణ పాదయాత్ర చేయడం జగన్ రెడ్డికి తప్పుగా కనిపిస్తోందా అని మండిపడ్డారు. నారాయణపై ఇద్దరు వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. జగన్ రెడ్డి చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని విమర్శించారు. నారాయణపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే.
టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పాదయాత్రగా వస్తున్న వృద్ధుడిపై వైసీపీ దాడికి పాల్పడింది. చింతల నారాయణ (63) అనే వృద్ధుడు నంద్యాల జిల్లా చిన్న దేవలాపురం నుంచి రాజమండ్రి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో వినుకొండ మండలం విఠంరాజుపల్లి వద్ద వృద్ధుడిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన చింతల నారాయణను టీడీపీ వర్గీయులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆస్పత్రికి చేరుకుని చింతల నారాయణను పరామర్శించారు. వైసీపీ దుర్మార్గపు చర్యలపై జీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-05T13:10:55+05:30 IST