TDP Chief: ఆ అధికారులు తీవ్ర మూల్యం చెల్లించక తప్పదు..అయ్యన్న అరెస్ట్‌పై చంద్రబాబు
ABN, First Publish Date - 2023-09-01T13:07:56+05:30
టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అమరావతి: టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు (TDP Leader Ayyannapatrudu Arrest))అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయ్యన్నపై అక్రమ కేసులతో వేధింపులను అధినేత ఖండించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేసే దారుణ పరిస్థితులు దాపురించాయన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే, ప్రశ్నించే అయ్యన్నపై అక్రమ అరెస్టుతో కక్ష సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై అయ్యన్న విమర్శలే నేరమైతే.... మంత్రులు, వైసీపీ నేతలు రోజూ చేస్తున్న వ్యాఖ్యలకు వారిని జీవితాంతం జైల్లో పెట్టాలన్నారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారని... ధైర్యం ఉంటే విమర్శలకు సమాధానం చెప్పాలని అన్నారు. జగన్ చేస్తున్న తప్పులు, నేరాల్లో ఇలా పోలీసులు భాగస్వాములు అయితే ఆ అధికారులు తీవ్ర మూల్యం చెల్లిస్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.
Updated Date - 2023-09-01T13:07:56+05:30 IST