Atchannaidu: వైసీపీ దురాగతాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది
ABN, First Publish Date - 2023-06-06T13:49:32+05:30
రాష్ట్రంలో వైసీపీ దురాగతాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు లేవన్నారు. మొన్న నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై, నిన్న కొండేపిలో బాలవీరాంజనేయ స్వామిపై దాడికి పాల్పడ్డారన్నారు.
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ దురాగతాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు లేవన్నారు. మొన్న నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై, నిన్న కొండేపిలో బాలవీరాంజనేయ స్వామిపై దాడికి పాల్పడ్డారన్నారు. టంగుటూరులో సుధాకర్ అనే టీడీపీ నాయకుడు పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నాడని ఆయన భార్యను ట్రాక్టర్‌తో తొక్కించి మరీ చంపేశారని మండిపడ్డారు. నేడు కడప జిల్లా, గోపవరంలో టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డిపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారన్నారు. ఇది సైకో పాలనకు నిదర్శనమని... రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేస్తుంటే జగన్ రెడ్డి సంతోషించడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు వైసీపీ రౌడీమూకలను కట్టడి చేయడం మాని వారికి వత్తాసు పలుకుతూ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేతలపై వైసీపీ గూండాల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జయరామిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఏదైనా జరగరానిది జరిగితే జగన్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. జయరామిరెడ్డిపై దాడికి పాల్పడ్డ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Updated Date - 2023-06-06T13:49:32+05:30 IST