TDP: వైసీపీ భూబకాసురుల కోసమే ఆ చట్టానికి సవరణలు అన్న టీడీపీ నేత
ABN, First Publish Date - 2023-07-13T12:43:03+05:30
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలకు సంబంధించి సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలకు సంబంధించి సీఎం జగన్ రెడ్డిపై (CM Jagan Reddy) టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader kommareddy Pattabhi ram) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి, ప్రలోభపెట్టి నాలుగన్నరేళ్లలో భూములు కొట్టేసిన వైసీపీ భూబకాసురుల కోసమే జగన్ రెడ్డి అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చట్టానికి సవరణలు అని అంటున్నారని మండిపడ్డారు. పేదలకు భూములపై హక్కులు కల్పించే నెపంతో తన పార్టీ భూకబ్జా ముఠాలకు న్యాయం చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని వ్యాఖ్యలు చేశారు. పేదల ముసుగులో తన స్వలాభంతో పాటు, తన పార్టీ వారు కబ్జా చేసిన భూములను వారిపరం చేయడానికే చట్ట సవరణ (భూముల బదలాయింపు నిరోధకచట్టం-1977) అంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల ఎకరాల భూములకు విముక్తి అని పత్రికల్లో వచ్చిందని.. ఆ భూములన్నీ పేదవాడికి కాకుండా వైసీపీ వారికి దోచిపెట్టి, ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నదే జగన్ దురాలోచన అని టీడీపీ నేత విమర్శలు గుప్పించారు.
చట్టాన్ని సవరించడం కోసం రాష్ట్రంలో అతిపెద్ద భూకబ్దాదారుడైన ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasadrao) నేత్రత్వంలో కమిటీ వేసినప్పుడే ముఖ్యమంత్రి చిత్తశుద్ధి అర్థమైందన్నారు. విశాఖపట్నం శివార్లలో మాజీ సైనికుల భూములు కాజేసిన ధర్మాన, పేదలకు భూములపై హక్కులు కల్పించి, వారికి న్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. నిజంగా జగన్ రెడ్డి పేదలకు భూములపై హక్కులు కల్పించేవాడే అయితే, ఎన్నో ఏళ్లనుంచి అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న వారిని భయపెట్టి, ఇళ్ల పట్టాల కోసం భూములు లాక్కుంటారా అంటూ నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న పేదల గుడిసెల్ని రాత్రికి రాత్రే కూల్చేయిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి స్కీమ్‌లన్నీ స్కామ్ కోసమే, పేదలకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తున్నామంటూ, వైసీపీ నేతలకు భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. భూములు తన పార్టీ వారికి అప్పగిస్తే, వారు అవి అమ్మేసి వచ్చే ఎన్నికల్లో తన కోసం పని చేస్తారన్న ఆశ కూడా ముఖ్యమంత్రితో ఈ పనిచేయిస్తోందన్నారు. నిజంగా జగన్ రెడ్డికి పేదలకు భూములు పంచే ఆలోచన ఉంటే, ఏ ఏ జిల్లాలో ఏఏ భూముల్ని క్రమబద్ధీకరిస్తున్నారో, ఆ భూములు ఎవరి పేర్లతో ఉన్నాయనే పూర్తి సమాచారంతో (సర్వేనంబర్లతో సహా) తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫలానా జిల్లాలో ఫలానా భూమి ఫలానా పేదవాడికి ఇస్తున్నామని చెప్పి వివరాలు బయటపెట్టాలన్నారు. పేదల పేరు చెప్పి, వారికి ఆసరాగా ఉన్నభూముల్ని శాశ్వతంగా లాక్కునే ప్రయత్నం తప్ప, నిజంగా పేదలకు న్యాయంచేసే ఆలోచన జగన్ సర్కార్‌కు లేదని పట్టాభిరామ్ దుయ్యబట్టారు.
Updated Date - 2023-07-13T12:43:56+05:30 IST