TDP: కరకట్ట ఇళ్లు జప్తుపై వర్ల రామయ్య ఏమన్నారంటే...
ABN, First Publish Date - 2023-07-01T15:46:49+05:30
ముఖ్యమంత్రి జగన్ టీమ్ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ (CM YS Jaganmohan Reddy) టీమ్ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న (శుక్రవారం) చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇళ్లు జప్తు చేశారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యక్తపరిచిన శునకానందం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమా అని ప్రశ్నించారు. అడుగడుగునా ప్రతిపక్షనేత, చంద్రబాబు కదలికలకు అడ్డంకులు కలిగిస్తుంది అందుకేనా అంటూనిలదీశారు. ఆయన అద్దెకు ఉంటున్న ఇళ్లు జప్తు కాబడితే ఆ తగవు ఇంటి యాజమాని లింగమనేని రమేష్‌కు ప్రభుత్వానికి మధ్య అని.. అందులోకి చంద్రబాబు నాయుడుని ఎందుకు లాగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుప్పంలో నూతన గృహనిర్మాణానికి పరిమిషన్ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇళ్లు కట్టుకోవాలంటే ఆనాడు ముఖ్యమంత్రి, ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చారని..మరీ మీరెందుకు చంద్రబాబుకు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుపై ముఖ్యమంత్రికి ఎందుకు అంత కక్ష అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఇంటిపైన దాడి చేసి, వీధి రౌడీలా వ్యవహరించిన జోగి రమేష్‌కు ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేస్తారా అని అన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన చిరు నాయకుడ్ని పెద్దనాయకుడుగా ప్రమోషన్ ఇస్తారా అంటూ మండిపడ్డారు. బాధిత మాదిగ కుటుంబాలను పలకరించటానికి ఆత్మకూరు వెళ్తున్న చంద్రబాబును ఇంటిలో నుంచి బయటికి రాకుండా గేటుకు ఎందుకు తాళ్లు కట్టి నిర్భదించారని ప్రశ్నించారు. అడుగడుగునా చంద్రబాబు పర్యటనలకు అడ్డు తగిలి, చిల్లరకేసులు పెట్టి ఆటంకం కలిగించారని అన్నారు. చిమ్మ చీకటీలో అనపర్తిలో 8 కిలోమీటర్లు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని కాలి నడకన నడిపిస్తారా అంటూ దుయ్యట్టారు. లింగమనేని రమేష్ కట్టిన ఈ ఇంటికి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్ని అనుమతులు ఇచ్చారని ఈ నాటి ముఖ్యమంత్రికి తెలుసా అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్ అధికార నివాసంగా లోటస్ పాండ్‌లోని ఇంటికి పరిమిషన్ ఇచ్చింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని తెలియదా అని అడిగారు. మరి ఈనాడు మీరు ముఖ్యమంత్రి గా ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుకు ఎందుకు అనుమతులు ఇవ్వరని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇళ్లు లేకుండా, కట్టుకొవడానికి అనుమతులు ఇవ్వకుండా ఆయనను రోడ్డున పడేద్దామనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. ‘‘మీరెన్ని కుట్రలు పన్నినా, ఆయనకు ఇళ్లు లేకుండా ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ప్రస్తుతం ఉంటున్న ఇంటి నుంచి బయటికి పంపినా, ఆయన కోట్లాదిమంది ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి’’ అంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు.
Updated Date - 2023-07-01T16:33:23+05:30 IST