AP News: ఎండలు బాబోయ్..
ABN, First Publish Date - 2023-05-14T21:30:45+05:30
తీవ్రమైన ఎండలు, వడగాడ్పులకు ఆదివారం మధ్య కోస్తాలో పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో...
విశాఖపట్నం: తీవ్రమైన ఎండలు, వడగాడ్పులకు ఆదివారం మధ్య కోస్తాలో పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో (Guntur West Godavari District)ని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ దిశగా పడమర దిశ నుంచి వీచిన గాలుల్లో తేమ లేకపోవడంతో ఎండ మండిపోయింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఎండలు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జంఘమహేశ్వరపురంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా జగ్గయ్యపేటలో 44.8, ద్వారకా తిరుమలలో 44.7, కామవరపుకోటలో 44.5, నందిగామలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు పెరిగి వడగాడ్పులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో సోమవారం 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు, మంగళవారంలో 92 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 190 మండలాల్లో గాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
Updated Date - 2023-05-14T21:30:45+05:30 IST