రెప్పపాటులో ఘోరం

ABN , First Publish Date - 2023-06-06T02:04:39+05:30 IST

అందరూ ఒకే గ్రామానికి చెందినవా రు. నిరుపేద దళిత మహిళలు. ఉదయం కూలి పనులకు వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం బంధువుల ఇంట్లో జరుగుతున్న పుష్పావతి అలంకరణ వేడుకకు బయలుదేరారు.

 రెప్పపాటులో ఘోరం

శుభకార్యానికి వెళ్తుండగా ట్రాక్టర్‌ బోల్తా

ఏడుగురు మహిళలు దుర్మరణం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): అందరూ ఒకే గ్రామానికి చెందినవా రు. నిరుపేద దళిత మహిళలు. ఉదయం కూలి పనులకు వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం బంధువుల ఇంట్లో జరుగుతున్న పుష్పావతి అలంకరణ వేడుకకు బయలుదేరారు. 37 మంది మహిళలు బాడుగ ట్రాక్టర్‌లో మరో ఊరి కి పయనమయ్యారు. కాసేపట్లో బంధువుల ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. రెప్ప పాటులో ఊహించని ఘోరం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ ఒక్కసారిగా అదుపు తప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. సోమవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొండెపాడు గ్రామ దళితవాడ మహిళలు పొన్నూరు మండలం జూపూడికి వెళ్తుండగా వట్టి చెరుకూరు మండలం గారపాడు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ కుదుపునకు గురవడంతో డ్రైవర్‌ కుల్లి ప్రశాంత్‌(22) అదుపు చేయలేకపోయాడు. డ్రైవర్‌ వెం టనే కిందకు దూకేశాడు. ట్రాక్టర్‌ క్షణాల్లోనే రోడ్డుకు కుడివైపు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. పంటకాలువకు, రోడ్డుకు మధ్యలో ఇంజిన్‌, ట్రక్కు బోల్తాపడ్డాయి. ఇంజన్‌పై ఉన్న వారు రోడ్డు పక్కన పడిపోగా, ట్రక్కులో ఉన్నవా రు కింద చిక్కుకుపోయారు. పక్కనే పొలంలో పనిచేస్తున్న పొక్లెయిన్‌ డ్రైవర్‌ దీన్ని గమనించి వెంటనే అక్కడకు వెళ్లారు.

పొక్లెయిన్‌ సహాయంతో ట్రాక్టర్‌ను పైకి లేపారు. దీంతో ట్రక్కు కింద పడిపోయిన మహిళలను స్థానికులు బయటకు లాగారు. మామిడి ఝాన్సీ రాణి(45), మిక్కిలి నాగమ్మ(55), గనికపూడి మేరమ్మ(50), గనికపూడి రత్నకుమారి(55), గనికపూడి సుహాసిని(40), కట్టా నిర్మల(55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గుంటూరు జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గనికపూడి సలోమి(55) మార్గమధ్య లో మృతి చెందారు. పొక్లెయిన్‌ డ్రైవర్‌ సకాలంలో స్పందించి సాయం చే యడంతో ప్రాణనష్టం తగ్గిందని బాధితులు చెప్పారు. మంత్రి అంబటి రాంబాబు, అధికార పార్టీ నేతలు, కలెక్టర్‌ జీజీహెచ్‌కు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్‌ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించిందని మాజీ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి 25 వేలు పరిహారం చెల్లించి, వైద్యం అందించనున్నట్టు తెలిపారు. కాగా, రూ.5 లక్షల పరిహారం ప్రకటించడంపై మృతుల బంధువులు, గ్రామస్థుల్లో నిరసన వ్యక్తమైంది. విద్యుత్‌ తీగలు తగిలి చనిపోయిన రైతు కూలీలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం తమకు రూ.5 లక్షలే ప్రకటించడమేంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి సుచరితను కొందరు ఇదే విషయం ప్రశ్నించగా ఆమె మౌనం వహించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-06T02:56:36+05:30 IST