Global Investors Summit 2023: పెట్టుబడులకు ముప్పులేని వాతావరణం ఏపీలో ఉంది: జగన్
ABN, First Publish Date - 2023-03-03T15:33:55+05:30
పెట్టుబడులకు ముప్పులేని వాతావరణం ఏపీలో ఉందని సీఎం జగన్ (CM Jagan) స్పష్టం చేశారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో..
విశాఖ: పెట్టుబడులకు ముప్పులేని వాతావరణం ఏపీలో ఉందని సీఎం జగన్ (CM Jagan) స్పష్టం చేశారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో జగన్ మాట్లాడుతూ ఏపీలో సుస్థిరమైన అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని, భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలమని ప్రకటించారు. ఇప్పటికే 6 పోర్టులు ఉన్నాయని మరో 4 పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదువ లేదని వ్యాఖ్యానించారు. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు (Industrial corridors)వస్తుంటే.. అందులో 3 ఏపీలోనే రాబోతున్నాయని జగన్ వెల్లడించారు.
రెండు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు శుక్రవారం నగరంలో ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారు. జగన్ గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకున్నారు. అతిథులంతా ఒక్కొక్కరుగా వస్తున్నారు. హోటళ్లన్నీ అతిథులలో నిండిపోయాయి. విశాఖలో సరైన వసతి లభించలేదని కొందరు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు నగరానికి 50 కిలోమీటర్ల దూరానున్న సన్ రే రిసార్ట్స్‌లో బస చేశారు. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంతో నిర్వహిస్తున్న సదస్సులో ఒక్క ఎన్‌టీపీసీయే లక్ష కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకోనునన్నదని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. పూడిమడకలో దీనికి సంబంధించిన హబ్ ఏర్పాటుచేస్తారని సమాచారం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అధిక పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు.
Updated Date - 2023-03-03T15:33:55+05:30 IST