Visakha Steel: విశాఖ ఉక్కుకు తెలంగాణ బిడ్!
ABN , First Publish Date - 2023-04-10T03:09:30+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్) ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈవోఐలో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయం
సింగరేణి ద్వారా బిడ్ వేయించే యోచన
ఇప్పటికే ఈవోఐపై కేంద్రానికి కేటీఆర్ లేఖ
నేడో, రేపో విశాఖ స్టీల్‌కు టీ-అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్) ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరె్‌స్ట-ఈవోఐ)ను ఆహ్వానించిన నేపథ్యంలో.. దాని బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిశ్చయించింది. బిడ్డింగ్‌ను దక్కించుకోగలిగితే ఇటు పాలనాపరంగా.. అటు రాజకీయంగా కేంద్రంలోని బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టినట్లవుతుందని.. ప్రైవేటీకరణను అడ్డుకున్నామని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశమంతా మైలేజీ వస్తుందని బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల 27న ఈవోఐ విడుదల అయింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో.. ఒకట్రెండు రోజుల్లో అధికారుల బృందం ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి, అధ్యయనం చేయనుంది.
అక్కడి అధికారులను సంప్రదించి, ఈవోఐలో పాల్గొని, బిడ్‌ను దక్కించుకున్న సంస్థలకు అందే ప్రతిఫలం ఏమిటి? కేవలం స్టీల్‌ను నేరుగా తీసుకోవడమేనా? ఇంకేమైనా ప్రయోజనాలుంటాయా? అనే అంశాలను పరిశీలించనుంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తూ ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘విశాఖ ఉక్కు.. తెలుగు ప్రజల హక్కు’ అని ఆయన అందులో పేర్కొన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ ఏపీ నేతలు విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న మార్గాలను కేసీఆర్‌కు వివరించారు. ఈ క్రమంలోనే ఈవోఐలో పాల్గొనాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం.
బీఆర్‌ఎస్‌కు రాజకీయ లబ్ధి..!
విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్‌లో పాల్గొనడం ద్వారా బీఆర్‌ఎ్‌సకు రాజకీయంగా మైలేజీ వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మోదీ సర్కారు లాభదాయక సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే విపక్షాలు గగ్గోలు పెట్టడమే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదని.. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఏకంగా ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు బిడ్డింగ్‌లో పాల్గొంటోందని అందరూ భావిస్తారన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ ఈ బిడ్డింగ్‌ను దక్కించుకుంటే.. నైతికంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విజయం సాధించినట్లవుతుందని.. జాతీయ పార్టీగా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఉదాహరణతో బీఆర్‌ఎస్ రాజకీయంగా దూసుకుపోయే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు సైతం విశ్లేషిసునాఆ్నయి. విశాఖ ఉక్కుకు మూలధనం సమకూర్చకుండా మోదీ ప్రభుత్వం దానిని క్రమంగా ప్రైవేటీకరించే దిశగా వెళ్తోందని.. గతంలో అప్పటి ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి.. ఈ ఫ్యాక్టరీకి మూలధన నిధులు ఇచ్చారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.