Share News

తుస్సుమన్న బస్సుయాత్ర

ABN , First Publish Date - 2023-11-07T01:34:20+05:30 IST

నగర పరిధిలోని గాజువాకలో సోమవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి ఆదరణ కరువైంది.

తుస్సుమన్న బస్సుయాత్ర

గాజువాకలో సభ జరుగుతుండగానే వెనుతిరిగిపోయిన జనం

పోలీసులు అడ్డుకున్నా ఆగకుండా వెళ్లిపోయిన మహిళలు

ముందువరుసలో తప్ప మిగిలిన కుర్చీలన్నీ ఖాళీ

విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):

నగర పరిధిలోని గాజువాకలో సోమవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి ఆదరణ కరువైంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే జనాలు వెనుతిరిగి వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీ అయిపోయాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాతగాజువాక జంక్షన్‌లో సోమవారం ఈ బస్సు యాత్ర సభ నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే యూసీడీ సిబ్బంది, వలంటీర్లు జన సమీకరణ చేశారు. సభకు భారీగా జనం హాజరవుతారనే భావనతో నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. అనంతరం ఽమరో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం ప్రారంభం కాగానే జనాలు ఒక్కొక్కరుగా లేచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. ధర్మాన ప్రసంగిస్తుండగానే అందరూ లేచి వెళ్లిపోతుండడంతో వెనుక వైపున ఉన్న పోలీసుల వారిని అడ్డుకుని సభ అయిపోయేంత వరకూ కూర్చోవాలని ఆదేశించారు. అయినప్పటికీ మహిళలు మాత్రం పోలీసులతో వాదనకు దిగి మరీ బయటకు వెళ్లిపోవడం కనిపించింది. చివరకు మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌ మాట్లాడేసరికి ముందున్న నాలుగైదు వరుసల్లో మాత్రమే జనం మిగిలారు. మిగిలిన కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడంతో నేతలు కంగుతిన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో భారీగా జనం హాజరవుతారనుకుంటే, సభకు వచ్చిన వారిని అర్ధగంటసేపు కూడా కూర్చోబెట్టుకోలేకపోయారంటూ స్థానిక నేతలపై ముఖ్య నేతలు అసహనం వ్యక్తంచేయడం కనిపించింది. ఇప్పుడే పరిస్థితి ఇలావుంటే రాబోయే ఎన్నికల సమయానికి పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ధరలు అన్ని రాష్ర్టాల్లోనూ పెరిగాయి: మంత్రి ధర్మాన

నిత్యావసర వస్తువుల ధరలు ఒక్క మన రాష్ట్రంలోనే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే మాదిరిగా ఉన్నాయనే విషయం ప్రతిపక్షాలు తెలుసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా సోమవారం పాతగాజువాక కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అవినీతికి తావివ్వకుండా సుపరిపాలనను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఇంకా సభలో మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్‌నాథ్‌, స్థానిక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-07T01:34:22+05:30 IST