అమరావతి రైతులతో చెలగాటం!

ABN , First Publish Date - 2023-04-06T02:23:36+05:30 IST

అమరావతి రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటానికి దిగుతోంది.

అమరావతి రైతులతో చెలగాటం!

ఆర్‌ 5 జోన్‌పై సర్కారు మంకు పట్టు

పేదల ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాలకు టెండర్లు

రూ.50 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ

ఇప్పటికే 49 వేల ఇళ్ల పట్టాలు ముద్రణ

వలంటీర్ల ద్వారా రహస్యంగా పంపిణీకి సన్నాహాలు

విజయవాడ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటానికి దిగుతోంది. రాజధానేతర పేదలకు రాజధానిలో ఇళ్ళ స్థలాలు కల్పించటంపై కోర్టును ఆశ్రయించిన రైతులకు స్టే రాకపోవటంతో.. అదను చూసుకుని ప్రభుత్వం విరుచుకుపడింది. అమరావతిలోని ఆర్‌ 5 జోన్‌లో రాజధానేతర పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి మొండిగా వెళ్లాలని నిర్ణయించింది. కోర్టు పరిధిలో ఉన్నా నివాస స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లను పిలవాలని సీఆర్‌డీఏను నిర్దేశించింది. దీంతో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు బుధవారం ఆగమేఘాల మీద రూ. 50 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. ముఖ్యమంత్రి జగన్‌ సొంత పత్రికలోనే టెండర్‌ ప్రకటనను ప్రచురించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల కల్పనలో భాగంగా ఆరు పనులకు టెండర్లు పిలిచారు. అవి లెవలింగ్‌, రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి వసతి, వీధిలైట్లు తదితర పనులుగా తెలుస్తోంది. గురువారానికి ఆ పనులేమిటో వెలుగు చూసే అవకాశం ఉంది. ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి వివరాలు అందుబాటులో ఉంటాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ ప్రకటించారు. టెండర్లలో పాల్గొనేవారు బిడ్లను సమర్పించటానికి ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువిచ్చారు.

అదేరోజు ఆరు గంటలకు టెక్నికల్‌ బిడ్లను తెరుస్తారు. ఆర్‌-5 జోన్‌లో ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన 49 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అఽథారిటీ సమావేశంలో రెండు జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించిన సంగతి తెలిసిందే. అంతకుముందే ప్రభుత్వం రహస్యంగా జీవో ఎంఎస్‌ 45 ద్వారా ఆర్‌ 5 జోన్‌ లోని 1134.58 ఎకరాలలో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 24 వేల మంది లబ్ధిదారులకు 583.93 ఎకరాలు, గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 550.65 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై రాజధాని రైతులు ఆందోళన చెందారు. తమ నుంచి తీసుకున్న భూముల విషయంలో భూ సమీకర ణ ఒప్పందాలు, రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, సీఆర్‌డీఏ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు వస్తాయని రైతులు ఆశించినా.. హైకోర్టు ఇవ్వలేదు. ఈ అంశంపై ఇప్పుడే కల్పించుకోలేమని, అవసరమనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో రైతులు ఒకింత నిరాశ చెందారు. అయినప్పటికీ రాజధాని భవిష్యత్తుకు సం బంధించిన అంశాలు ఇంకా సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిధిలో ఉండటంతో రైతులు ధైర్యంగానూ ఉన్నారు. భూములను ఇంకా లబ్ధిదారులకు కేటాయించనందున.. తొందరపడకూడదన్న కోర్టు నిర్ణయాన్ని రైతులు గౌరవించినా.. ప్రభుత్వం మాత్రం కోర్టుల పరిధిలో ఉన్నప్పటికీ అడ్డగోలుగా ముందుకు వెళుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో 24 వేలు, గుంటూరు జిల్లా పరిధిలో 25 వేల లబ్ధిదారులను ఏడాదిన్నర కిందటే గుర్తించారు. మొదటి దశలోనే వీరికి ఇళ్ల పట్టాల ముద్రణ చేశారు.

పంపిణీ చేయటమే మిగిలి ఉంది. ఆ దశలో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా, అప్పటికి ఉన్న సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ప్లాన్‌లను అనుసరించి ప్రభుత్వ ప్రయత్నాన్ని ధర్మాసనం నిలువరించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్‌ 5 జోన్‌ను సృష్టించింది. దీని కోసం సీఆర్‌డీఏ చట్ట సవరణ చేపట్టింది. గవర్నర్‌ ఆమోదంతో తుది గజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా వెలువరించింది.రాజధాని విధ్వంసానికి సంబంధించి ప్రభుత్వంపై అనేక కేసులున్నాయి. తుది తీర్పు ద్వారా తమకు న్యాయం జరుగుతుందని అమరావతి రైతులంతా భావిస్తున్నారు. ప్రభుత్వం మూడో విడతగా మేలో ఇళ్ల పట్టాల పంపిణీ అన్నప్పటికీ ఈ లోపే సచివాలయాల ద్వారా పంపిణీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. మే వరకు సమయం ఉందన్న వదంతులను వ్యాప్తి చేయటం ద్వారా చాపకింద నీరు లా పని కానిచ్చేయాలన్నది ప్రభుత్వ వ్యూహంగా రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. ఒక్కసారి ఇళ్ల పట్టాలు లబ్ధిదారుల చేతికందితే ఇక చేసేదేమీ ఉండదని ఆందోళన చెందుతున్నారు. దీంతో తాజా ప్రభుత్వ చర్యలపై మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టునే ఆశ్రయిస్తారా? సుప్రీంకోర్టుకు వెళతారా అన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-04-06T02:23:36+05:30 IST