Pawan Kalyan : వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే!
ABN , First Publish Date - 2023-10-02T03:06:49+05:30 IST
రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

బీజేపీతో కలిసి వెళ్తే ఓట్లు రావచ్చు
కానీ ఎంత మందిమి అసెంబ్లీకి వెళ్తాం?
బీజేపీతో నేను కలిసి వెళ్తే ఓట్లు వస్తాయి.. అయితే ఎంతమందిమి అసెంబ్లీకి వెళ్లగలం?
కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. సంతోషంగా పెట్టుకోవచ్చు. జనసేనకు అండగా ఉన్న ముగ్గురు యూట్యూబర్లను అరెస్టు చేశారు.
- పవన్ కల్యాణ్
నన్ను తిట్టే వైసీపీ నేతలు ఆలోచించుకోవాలి. జనసేన-టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని కాపాడాలని మీరే నా వద్దకు వస్తారు. మిమ్మల్ని కాపాడేది నేనే.
- పవన్ కల్యాణ్
2024లో మా గెలుపు డబుల్ పక్కా
జగన్ ఓటమి ఖాయం.. వైౖసీపీకి 15 వస్తే గొప్ప
కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీది కౌరవుల పాత్ర
ఆ పార్టీ పతనం మొదలైంది.. జగన్‌ను ఇంటికి పంపడమే లక్ష్యం
‘ఒక్క చాన్స్’ తప్పు మళ్లీ వద్దు.. సీఎం పదవి వస్తే స్వీకరిస్తా.. వెంపర్లాడను
నన్ను తిట్టే వైసీపీ నేతలు ఆలోచించుకోవాలి.. మిమ్మల్ని కాపాడేది నేనే
బాబు నిర్దోషిలా బయటకు వస్తారు.. ఆయనతో ఇక విభేదాలు రావు
రాజధాని, హోదాపైనే గతంలో విభేదించా: జనసేనాని
అవనిగడ్డ/విజయవాడ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అంటున్నాడని.. ఈ యుద్ధంలో కౌరవులు వైసీపీ వాళ్లేనని చెప్పారు. ‘ఈ సమరంలో జగన్ ఓటమి ఖాయం. జనసేన-టీడీపీ కూటమి గెలుపు డబుల్ ఖాయం’ అని అన్నారు. నాలుగో విడత వారాహి యాత్రను ఆయన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఆదివారం ప్రారంభించారు. సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని సీఎం జగన్ ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఆయనకు 15 సీట్లు వస్తే గొప్ప విషయమని అన్నారు. 2019ఎన్నికల్లో జగన్ అన్న ‘ఒక్కచాన్స్’తో చేసిన తప్పును ప్రజలు రాబోయే ఎన్నికల్లో చేయవద్దని హితవు పలికారు. ఈసారి తప్పు జరిగితే రాష్ట్రం కోలుకోవడానికి 20 ఏళ్లు పడుతుందన్నారు. రూ.500, రూ.2 వేలకు ఓట్లను అమ్ముకుంటే నైతిక బలాన్ని కోల్పోతారని హెచ్చరించారు. ప్రజల కోసమే 2024 ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని చెబుతున్నానని తెలిపారు. ఈ మాట తాను పదేపదే చెప్పడానికి ప్రత్యేక కారణాలున్నాయన్నారు. తాను బీజేపీతో కలిసి వెళ్తే ఓట్లు వస్తాయని.. కానీ ఎంతమందిమి అసెంబ్లీకి వెళ్లగలమని ప్రశ్నించారు. తనకు పార్టీ కంటే జన్మభూమి ముఖ్యమని చెప్పారు. 2014లో తన వల్లే సీఎం పదవి చేజారిపోయిందని జగన్‌కు అంత కోపం ఉంటే.. నాలుగేళ్లు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఇంకెంత కోపం ఉండాలని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ తీసుకొస్తానని ప్రకటించి.. ఆ తర్వాత మోసం చేశాడన్నారు. వైసీపీ పతనం మొదలైందని, రాబోయే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపడమే జనసేన-టీడీపీ లక్ష్యమని ప్రకటించారు. ఇంకా ఏం చెప్పారంటే..
అధికార మదంతో..
జగన్‌కు ఒక్క చాన్స్ ఇస్తే ఎంత మంది యువతకు ఐటీ ఉద్యోగాలు వచ్చాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి? యువత వద్ద డబ్బులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే జగన్ వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వైసీపీ నేతలు చెబుతున్న అభివృద్ధి.. దున్నపోతు ఈనగానే జున్ను పాల కోసం మరచెంబు తెచ్చినట్లుగా ఉంది. నిజంగా జగన్ మంచి పాలకుడైతే నేను రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు. అధికార మదంతో ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. జగన్‌కు ఉన్న ఆర్థిక బలం, ప్రైవేటు బలం నాకు లేవు. ప్రాక్టికల్‌గా రాజకీయాలు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నాకు డబ్బు అవసరం లేదు. ఈ విషయాన్ని వైసీపీ సన్నాసులు తెలుసుకోవాలి. నటుడిగా నా రెన్యుమరేషన్ రూ.కోట్లలో ఉన్నప్పుడు సైబరాబాద్‌లోని మాదాపూర్‌లో పది ఎకరాలు కొనుక్కుని ఉంటే నేడు కోట్లాది రూపాయల ఆదాయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓట్లు చీలిపోయిన కారణంగానే అసెంబ్లీలో చేయాల్సిన పోరాటాన్ని వీధుల్లో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ చేసిన తప్పులకు సంబంధించిన కాగితాలు ప్రతి బహిరంగ సభలో చదివీచదివీ నా గడ్డం నెరిసిపోతోంది. రైతాంగమంతా ఈసారి జనసేన-టీడీపీ కూటమికి అండగా ఉండాలి. పదేళ్లుగా రాజకీయం చేస్తున్నాను. ఓడిపోయినా ఎక్కడికీ పారిపోలేదు. ప్రజల ప్రేమాభిమానాలే జగన్‌ను ఎదుర్కొని నిలబడేలా చేశాయి.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు. ఆయన కారణంగానే బీసీ, ఎస్సీ, గిరిజన వర్గాల నుంచి నాయకులు పుట్టుకొచ్చారు. ఎన్టీఆర్‌కు కుదిరినట్లు ఇప్పుడు అందరికీ కుదరదు. 2047 నాటికి ఇప్పుడున్న యువతరం నుంచి మంచి నాయకత్వం తయారు కావాలన్నదే నా ఆశయం. సీఎం పదవి వచ్చినా, దానికి మించిన పదవి వచ్చినా ఆనందంగా స్వీకరిస్తా. కానీ దానికోసం వెంపర్లాడను. ఇటీవల ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) సర్వే చేయించింది. దీని ప్రకారం రాష్ట్రంలో 3,17,259 కుటుంబాలు వలస వెళ్లిపోయినట్లు తేలింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.88 లక్షల డ్రాపవుట్స్ ఉన్నాయి.. 5-18 ఏళ్లలోపు పిల్లలు 62,754 మంది చనిపోయారని తేలింది. ఈ సర్వేపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో రహదారుల నిర్మాణంలో వైసీపీ నేతలు 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు జగన్‌కు ఇంకా ఎంత డబ్బు కావాలని అడిగాలనుకున్నాను. కానీ ప్రధానికి మొత్తం తెలుసు.
బాబుతో ఈసారి విభేదాలు రావు
నాకు, చంద్రబాబుకు మధ్య పాలనాపరంగానే విభేదాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినందుకే ఆయనతో విభేదించాను. ఈసారి ఆయనతో ఎలాంటి విభేదాలూ రావు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. మద్యపాన నిషేధం పేరుతో మహిళలను, మెగా డీఎస్సీ పేరుతో డీఎస్సీ అభ్యర్థులను జగన్ మోసం చేశాడు. డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోయినా భృతి అందేలా చేస్తా. కొత్త ప్రభుత్వం రాగానే వారికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటా.
పొగరు, ఆత్మగౌరవం ఎక్కువ
నాపై కేసులు పెట్టినా, నా సినిమాలను అడ్డుకుని ఆదాయం లేకుండా చేసినా జగన్ వద్దకు వెళ్లను. పోలీసు కానిస్టేబుల్ బిడ్డగా పుట్టిన నాకు పొగరు, ఆత్మగౌరవం ఎక్కువ. జగన్ దగ్గరకు వెళ్లి నమస్కారం పెడితే కూర్చోమంటాడు. ఆ తర్వాత పవన్ వంటి వ్యక్తిని తన వద్దకు రప్పించుకుని కూర్చోబెట్టుకున్నాని ఆనందం పొందుతాడు. నేను భగత్‌సింగ్, పింగళి వెంకయ్య వారుసుడిని. ఎస్సీలు, కాపులు, బీసీ నేతలతో నన్ను, నా కుటుంబాన్ని, పిల్లలను తిట్టిస్తున్నా ప్రజలే నాకు ముఖ్యం. నేను వ్యక్తిత్వాన్ని తప్ప కులాన్ని చూడను. జగన్ చేసేవి చిన్నపిల్ల చేష్టలు. ఆయన చాలా అపరిపక్వంగా వ్యవహరిస్తున్నారు. మెచ్యూర్ అవ్వాలి.