Madhavaram Krishna Rao: చెరువుల సుందరీకరణపై వివరాలు ఇవ్వండి
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:15 AM
చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.

హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మాధవరం లేఖ
కూకట్‌పల్లి, మార్చి 8 (ఆఽంధ్రజ్యోతి): చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. ఈ మేరకు శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు లేఖ రాశారు. నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లబోమని హైడ్రా అధికారులు ప్రకటించడం హర్షణీయమని ఎమ్మెల్యే అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ముళ్లకత్వ, కామునిచెరువు, మైసమ్మ చెరువు, సున్నం చెరువు, రంగథాముని చెరువు(ఐడీఎల్) నల్లచెరువు, ఖాజాకుంట, బొయినపల్లి చెరువుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని గతంలోనే అధికారులను కోరామన్నారు.
ప్రస్తుతం నల్లచెరువు, సున్నం చెరువుల్లో చేస్తున్న సుందరీకరణ పనులను హైడ్రా అధికారులే చేస్తున్నారా? లేక ఇతర ఏజెన్సీలకు ఇచ్చారా? వివరాలు ఇవ్వాలని కోరారు. చెరువుల అభివృద్ధి విషయంలో తన వంతు సహాకారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. చెరువు భూములకు సంబంధించి పట్టదారులకు ఏ విధమైన నష్టపరిహారం చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.