Viveka Case: చావు కబురు చెప్పిందెవరు?
ABN, First Publish Date - 2023-07-30T02:29:18+05:30
2019 మార్చి 15.. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) మరణించారన్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)కి చెప్పిందెవరు? ఆ కబురు ఆయనకు ఎలా చేరింది? ఇప్పుడు ఇదో పెద్ద మిస్టరీ!..
వివేకా మరణ వార్త జగన్‌కు ఎలా తెలిసింది?
ఎవరో వచ్చి జగన్‌కు చెప్పారన్న ఉమ్మారెడ్డి
అవినాశ్ చెప్పారని జగన్‌కు చెప్పిన ఓఎస్డీ
భారతి ద్వారానే తెలిసిందన్న అజేయ కల్లం
కీలకంగా మారిన కల్లం వాంగ్మూలం
వారం తర్వాత సీబీఐపై ఎదురుదాడి
వాంగ్మూలం మార్చారని ఆరోపణ
తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్‌భేటీలో
పాల్గొన్న ముగ్గురి భిన్న వాంగ్మూలాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి): 2019 మార్చి 15.. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) మరణించారన్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)కి చెప్పిందెవరు? ఆ కబురు ఆయనకు ఎలా చేరింది? ఇప్పుడు ఇదో పెద్ద మిస్టరీ! ఆ రోజు, ఆ సమయంలో లోట్‌సపాండ్(Lotus pond)లో జగన్‌తో భేటీ అయిన ముగ్గురిని సీబీఐ(CBI) ప్రశ్నించి, వారి వాంగ్మూలాలు సేకరించింది. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి(Krishna Mohan Reddy), సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(Ummareddy Venkateshwarlu), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం రెడ్డి(Ajeya Kallam Reddy)... వీళ్లే ఆ ముగ్గురు. ఒకే సమయంలో, ఒకే భేటీలో పాల్గొన్న ఈ ముగ్గురు... ఒకే ప్రశ్నకు మూడు భిన్నమైన సమాధానాలు చెప్పారు. అందులోనూ... అజేయ కల్లం వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారింది. భవిష్యత్తులో వచ్చే చిక్కులు ఆలోచించకుండా యథాలాపంగా చెప్పారేమో కానీ... ఆయన ఒక్కరే ‘అమ్మ’ (వైఎస్ భారతి) ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ‘నేను అలా చెప్పనే లేదు. నా వాంగ్మూలాన్ని సీబీఐ మార్చేసింది. దానిని చార్జిషీటు నుంచి తొలగించండి’’ అంటూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. జగన్ సతీమణి ప్రస్తావన, సమాచారం అందిన సమయాన్ని మాయం చేయడమే ఆయన ఉద్దేశం!
ఆయన ఏం చెప్పారంటే...
‘‘ఆ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకే లోట్‌సపాండ్‌లో జగన్ అధ్యక్షతన మీటింగ్ మొదలైంది. జగన్ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డి, డి. కృష్ణ, సాంబశివారెడ్డితో కలసి పాల్గొన్నాను. చర్చల మధ్యలో 5:30 గంటల సమయంలో ఒక అటెండెంట్ (సహాయకుడు) సమావేశం రూమ్ డోర్‌కొట్టి పైఅంతస్తులో ఉన్న అమ్మ (భారతి) పిలుస్తోంది అని జగన్‌కు చెప్పారు. ఆ వెంటనే జగన్ వెళ్లారు. పది నిమిషాల తర్వాత సమావేశం గదిలోకి వచ్చి తన బాబాయ్ వివేకానంద రెడ్డి ఇక లేరని చెప్పారు. ఆ మాట విని మేం అంతా షాక్‌కు గురయ్యాం. కడపకు వెళ్లాలని మేం జగన్‌కు సూచన చేసి మీటింగ్ రూమ్ నుంచి బయటకొచ్చాం’’ అని ఆయన చెప్పారు. ఇందులో రెండు కీలకమైన అంశాలున్నాయి. ఒకటి... 5.30కు అటెండెంట్ (నవీన్) వచ్చి డోర్‌కొట్టడం. రెండు... ‘అమ్మ (భారతి) పిలుస్తున్నారని చెప్పాక జగన్ సమావేశం నుంచి బయటికి వెళ్లడం! వెరసి... వైఎస్ వివేకా మరణ వార్త బయటి ప్రపంచానికి తెలియకముందే జగన్ దంపతులకు తెలిసిందని రిటైర్డ్ ఐఏఎస్ అజేయ కల్లం ధ్రువీకరించారు.
కలకలం... కలవరం...
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం బయటికి రాగానే అజేయకల్లం ఒక్కసారిగా కలవరపడ్డారు. వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ రాసిందని ఆరోపించారు. ‘‘ఒక సహాయకుడు వచ్చి డోర్ తలుపుతట్టారు. ఓఎ్‌సడీ బయటకు వెళ్లి వచ్చి విషయం తెలుసుకొని జగన్ చెవిలో ఏదో చెప్పారు. దీంతో జగన్ తీవ్ర దిగ్ర్భాంతికి, ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నాన్న చనిపోయారని చెప్పారు. అంతే తప్ప జగన్‌ను ఆయన జీవిత భాగస్వామి పిలవడంలాంటివి నేను చెప్పలేదు. దురదృష్టవశాత్తు సీబీఐ నేను చెప్పింది సరిగ్గా రికార్డుచేయలేదు. దర్యాప్తును తప్పుదారిపట్టించి ఇతరులను కేసులో ఇరికించేందుకే సీబీఐ ఇలా చేసింది. చార్జిషీటు నుంచి నా వాంగ్మూలాన్ని తొలగించండి’’ అని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అంత అమాయకుడా?
అజేయ కల్లం ఆషామాషీ వ్యక్తికాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌కు సలహాదారుగా ఉన్నారు. ఆయన వద్ద వాంగ్మూలం నమోదు చేసింది... సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి. అజేయ కల్లం స్థాయి, పలుకుబడి ఏమిటో సీబీఐకి బాగా తెలుసు. పైగా... అధికారులు ఆయన ఇంటికే వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. అందులోనూ.. ‘మీరు చెప్పినవన్నీ ల్యాప్‌టా్‌పలో నమోదు చేస్తున్నాం’ అని స్పష్టంగా చెప్పారు. మరి... అజేయ కల్లం చెప్పని విషయాలను సీబీఐ నమోదు చేయడం సాధ్యమా? సీబీఐ ఎస్పీపైనే కేసులు పెడుతున్న రాష్ట్రంలో... ఏకంగా జగన్ సలహాదారు వాంగ్మూలాన్నే వక్రీకరించేంత సాహసం చేయగలరా? తనేం మాట్లాడారు? సీబీఐ ఏం రికార్డు చేసిందో ముందుగా చెక్ చేసుకోరా? తన సంతకం తీసుకోవాలని కోరరా? రికార్డు పూర్తయ్యాక ఆ స్టేట్‌మెంట్‌ను చదవరా? ఈ రోజుల్లో చదువుకోని వారు కూడా ఏదైనా కాగితంపై సంతకం చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఇతరులతో చదివించుకుంటారు. అజేయ కల్లం ఆ మాత్రం కూడా చేయలేదా? అజేయకల్లం వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసినట్లు రెండు నెలల కిందటే ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. అప్పుడైనా అజేయ కల్లం తన వాంగ్మూలాన్ని సీబీఐ ఎలా నమోదు చేసిందో పరిశీలించే ప్రయత్నం కూడా చేయలేదా? సీబీఐకి అజేయకల్లం ఇచ్చిన వాంగ్మూలం ఈనెల 21వ తేదీన బయటపడింది. 22వ తేదీన పత్రికల్లో ప్రచురితమైంది. ‘‘అమ్మ పిలుస్తున్నారని సహాయకుడు చెప్పాడు. ఆ తర్వాత జగన్ బయటికి వెళ్లారు. తిరిగి వచ్చాక... వివేకా మరణించారు’’ అని అజేయ కల్లం స్పష్టంగా చెప్పినట్లు సీబీఐ తన వాంగ్మూలంలో పేర్కొంది. అప్పుడు ఆయన నోరెత్తలేదు. ‘ఇది ఘోరం. నేరం. నేను చెప్పని విషయాలూ రాశారు’ అని హోరెత్తించలేదు. వారం రోజులు కిమ్మనకుండా ఉండి... ఆ తర్వాత తీరిగ్గా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో... జగన్ సతీమణి ప్రస్తావన, సమాచారం అందిన సమయం (తెల్లవారుజామున 5.30 గంటలు) లేకుండా చూడటమే కీలకం! కీలక వాంగ్మూలాలను వక్రీకరించాలనుకుంటే ... అజేయ కల్లం స్టేట్‌మెంట్‌నే సీబీఐ ఎందుకు మార్చేస్తుంది? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలాలను మాత్రం ఎందుకు యథాతథంగా నమోదు చేస్తుంది? వాళ్ల వాంగ్మూలాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు కదా? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం! అందరి వాంగ్మూలాలను సీబీఐ యథాతథంగా నమోదు చేసింది. కానీ... ‘నోరు జారి కీలక విషయాలు చెప్పడం’తో అజేయ కల్లం మాత్రమే సీబీఐపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పక తప్పదు!
ఆ రోజు జగన్ నివాసంలో ఏం జరిగింది?
జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలో 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత (15వ తేదీ తెల్లవారుజామున) దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో వైసీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఇందులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కృష్ణమోహన్ రెడ్డి, అజేయకల్లం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివేకా మరణ వార్త ఉదయం 6.30 గంటల సమయంలో బయటి ప్రపంచానికి తెలిసింది. మరి... జగన్‌కు ఎన్ని గంటలకు, ఎవరి ద్వారా తెలిసిందనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇది తెలుసుకునేందుకే సీబీఐ ఆ ముగ్గురి వాంగ్మూలాలు సేకరించింది.
ఆ ఇద్దరి మాట ఇది...
‘‘ఆ రోజు తెల్లవారుజామున 4-5 గంటల సమయంలో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. అయితే... వయోభారం వల్ల కచ్చితమైన సమయం చెప్పలేకపోతున్నాను. మీటింగ్ మొదలయ్యాక కొంత సమయానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి వివేకా చనిపోయారని జగన్‌కు చెప్పారు. ఆయన పేరు ఏమిటో నాకు తెలియదు. ఆ సమయం ఏమిటో కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నా’’ అని ఉమ్మారెడ్డి సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక... ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి భిన్న కథనం వినిపించారు. ‘‘ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకే జగన్ ఇంటికి వెళ్లాను. అక్కడ జీవీడీ కృష్ణమోహన్, సాంబశివారె డ్డి ఉన్నారు. కాన్ఫరెన్స్ హాల్‌లో 4.30 గంటలకే మీటింగ్ జరుగుతోంది. మీటింగ్ మధ్యలో నవీన్ (భారతి వ్యక్తిగత సహాయకుడు) డోర్ కొద్దిగా తెరచి న న్ను ఒక్క నిమిషం బయటకు రమ్మన్నారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారని ఫోన్ నాకు ఇచ్చారు. వివేకా చనిపోయారని ఆయన నాకు చెప్పగా ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యా. ఎలా చనిపోయారని అడిగా. వివేకా మృతదేహం బాత్‌రూమ్‌లో పడి ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని జగన్‌కు తెలియజేయాలని చెప్పి... ఫోన్ కట్ చేశారు. సమావేశం గదిలోకి వెళ్లి వివేకా మరణం గురించి అవినాశ్ ఇచ్చిన సమాచారం జగన్‌కు తెలియజేశాను’’ అని చెప్పారు. ఇది ఇద్దరి వాదన. ఇక... మిగిలింది అజేయ కల్లం!
ఎన్నెన్నో ప్రశ్నలు!
ఒకే సమావేశంలో పాల్గొన్న ముగ్గురి స్టేట్ మెంట్లను పరిశీలిస్తే ఎన్నో సస్పెన్స్‌లు, ట్విస్టులు కనిపిస్తాయి.
వివేకా మరణ వార్తను ‘ఎవరో’ వచ్చి జగన్ చెవిలో చెప్పారని, అతనెవరో తనకు తెలియదని ఉమ్మారెడ్డి చెబుతున్నారు. ‘జగన్ చెవిలో చెప్పింది నేనే’ అని ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. మరి... కృష్ణమోహన్ రెడ్డి ఎవరో కూడా గుర్తించని స్థితిలో ఉమ్మారెడ్డి ఉన్నారా! ఆయన అప్పట్లో వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కావడం గమనార్హం.
ఆ రోజు సమావేశంలో పాల్గొన్న వారిలో జీవీడీ కృష్ణమోహన్, సాంబశివారెడ్డి ఉన్నట్లు ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ ఇద్దరి పేర్లను ఉమ్మారెడ్డి, అజేయ కల్లం చెప్పలేదు.
వారం తర్వాత తెలిసిందా?
కల్లం పిటిషన్‌లో ‘అమ్మ’, ‘సమయం’ మాయం
అజేయ కల్లం వాంగ్మూలం ప్రకారం వైఎస్ వివేకా మరణ వార్త ముందు భారతికే తెలిసింది. ఆమెకు ఆ విషయం ఎవరు చెప్పారు? ఏ సమయంలో చెప్పారు? వివేకా ఎలా చనిపోయారని చెప్పారు? అనే కోణాలపై సీబీఐ విచారణ జరపాల్సి ఉంటుంది. అంటే... జగన్ దంపతులను ప్రశ్నించాలి. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదనేదే జగన్ శిబిరం ఆలోచన! అందుకే... అజేయ కల్లంపై ఒత్తిడి తెచ్చి, ‘నా వాంగ్మూలాన్ని మార్చేశారు. దానిని చార్జిషీటు నుంచి తొలగించండి’ అని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించారనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇందులో ఆయన ‘అమ్మ’ ప్రస్తావన తీసేశారు. ‘సమయం’ కూడా తప్పించేశారు.
జగన్ వాంగ్మూలం తీసుకుంటారా?
ఆ రోజు జగన్ నివాసంలో భేటీలో పాల్గొన్న ముగ్గురి వాంగ్మూలాలను సీబీఐ సేకరించింది. ముగ్గురూ మూడు రకాలుగా చెప్పారు. అజేయ కల్లం మాత్రం మరింత వివరంగా, భిన్నంగా వాంగ్మూలం ఇచ్చారు. ఇక... మిగిలిన నాలుగో వ్యక్తి సీఎం జగన్! బాబాయ్ మరణ వార్త తనకు ఎవరి ద్వారా, ఎలా, ఎన్ని గంటలకు తెలిసిందో ఆయనే చెప్పాలి! అజేయ కల్లం చెప్పిన ప్రకారం.. భారతి ద్వారానే జగన్‌కు వివేకా మరణం గురించి తెలిసిందా? లేక... ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లుగా అవినాశ్ ద్వారా తెలిసిందా? దీనిపై జగన్‌ను సీబీఐ ప్రశ్నిస్తుందా? అప్పుడు ఆయన ఏం వాంగ్మూలం ఇస్తారు? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు!
Updated Date - 2023-07-30T04:27:07+05:30 IST