Adani SBI LIC: ఆందోళనలో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ కస్టమర్లు.. అదానీ ఆస్తి పతనంపై తొలిసారి స్పందించిన కేంద్రం..

ABN, First Publish Date - 2023-02-03T15:28:12+05:30

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ సగానికిపైగా పతనమైంది. దాదాపు 120 బిలియన్ డాలర్ల దిగజారింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.8 లక్షల కోట్లకు సమానం. ఈ పరిణామమే ప్రభుత్వరంగ ఎస్‌బీఐ (SBI), బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కస్టమర్లు, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే..

Adani SBI LIC: ఆందోళనలో ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ కస్టమర్లు.. అదానీ ఆస్తి పతనంపై తొలిసారి స్పందించిన కేంద్రం..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg research) ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ (Adani Group) స్టాకుల పతనపరంపర (Stocks fall) శుక్రవారం కూడా కొనసాగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సహా పలు కంపెనీల షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. నష్టాల బాటలోనే పయనించాయి. ఈ ప్రభావంతో రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ సగానికిపైగా పతనమైంది. దాదాపు 120 బిలియన్ డాలర్ల దిగజారింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.8 లక్షల కోట్లకు సమానం. ఈ పరిణామమే ప్రభుత్వరంగ ఎస్‌బీఐ (SBI), బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కస్టమర్లు, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఈ రెండు సంస్థలకు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. పతనం ఫలితంగా తమపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ఎస్‌బీఐ డిపాజిటర్లు, ఎల్ఐసీ పాలసీదారులు కలవరానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) తొలిసారి స్పందించింది.

అదానీ గ్రూపు స్టాకుల పతన ప్రభావం ఎస్‌బీఐ, ఎల్‌ఐసీల మీద స్వల్పమేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘ ప్రైవేటు కంపెనీల వ్యక్తిగత సంపద పతనంపై స్పందించలేం. ఆయా కంపెనీల బాలాలు, బలహీనతల ఆధారంగా సంపద పెరుగుతుంది, తరుగుతుంది. అయితే ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ విషయంలో మాత్రమే నేను స్పందిస్తా. ఈ రెండు సంస్థల్లోని ఇన్వెస్టర్లు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. రిస్క్ పరిమితికి లోబడే ఈ రెండు సంస్థలు అదానీ కంపెనీల్లో పెట్టుబడిపెట్టాయి. ఇది చాలా స్వల్పం. ఒక కంపెనీ తలరాత ఇతర కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపదు. జాతీయ బ్యాంకులు లేదా కంపెనీలకు చెందిన డిపాజిటర్లు లేదా పాలసీహోల్డర్లు ఆందోళన చెందడానికి ఎలాంటి కారణం లేదని ఖచ్చితంగా చెప్పగలను’’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్ఐసీ (LIC) 4 బిలియన్ డాలర్లు, ఎస్‌బీఐ (SBI) 2.6 బిలియన్ డాలర్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ నుంచి వివరణ కోరేందుకు ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ యంత్రాంగాలు సిద్ధమయ్యాయనే రిపోర్టులు వచ్చాయి.

కాగా కుప్పకూలుతున్న అదానీ గ్రూప్‌ షేర్ల ప్రభావం పార్లమెంట్‌(Parliament)పై శుక్రవారం కూడా పడింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనంటూ కేంద్రప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఈ విధంగా స్పందించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని శుక్రవారం పార్లమెంట్‌లో విపక్షాలు పట్టుబట్టాయి. అభ్యర్థనలను లోక్‌సభ(Lok Sabha) స్పీకర్ నిరాకరించారు. మరోవైపు రాజ్యసభ(Rajya Sabha) ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దీంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ, లోక్‌సభలు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇక హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెలువడిన రోజుల వ్యవధిలోనే గౌతమ్ అదానీ సంపద భారీగా పతనమైపోయింది. ఈ ప్రభావంతో ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ నంబర్ 2 స్థానం నుంచి ప్రస్తుతం 21వ స్థానానికి పడిపోయినట్టు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ సూచిస్తోంది.

Updated Date - 2023-02-03T15:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising