Banks in India: జూలై 28న బ్యాంకులకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడే అవకాశం.. అదేంటంటే..
ABN , First Publish Date - 2023-07-22T14:43:03+05:30 IST
‘ది ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్’ (IBA) కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనపై వచ్చే వారం కీలక ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు సానుకూలంగానే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఇప్పటికే బ్యాంకింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
‘ది ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్’ (IBA) కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనపై వచ్చే వారం కీలక ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు సానుకూలంగానే ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఇప్పటికే బ్యాంకింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక్క పని దినాల విషయంలోనే కాదు బ్యాంకు ఉద్యోగుల జీతాల పెంపు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలపై కూడా జూలై 28న కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బ్యాంకు యూనియన్ల సభ్యులు, బ్యాంకు అసోసియేషన్ సభ్యులు తొలిసారిగా జూలై 28న సమావేశం అవుతుండటంతో బ్యాంకు ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర పడే అవకాశం మెండుగా ఉంది. ఆమోదించిన మరుసటి నెల నుంచే.. వచ్చే ఆగస్టు నుంచే వారానికి ఐదు రోజులు మాత్రమే బ్యాంకు ఉద్యోగులు కార్యకలాపాలు కొనసాగించే అవకాశం లేకపోలేదు. వారానికి ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనను ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపడం గమనార్హం.
‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్’ కూడా ఈ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసింది. అయితే.. బ్యాంకు ఉద్యోగులు పని దినాలైన ఆ ఐదు రోజులు 40 నిమిషాల పాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు నెలలో రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు సెలవు దినాలుగా ఉండటం గమనార్హం. వీటికి తోడు.. పబ్లిక్ హాలిడేస్ ఉండనే ఉంటాయి. తాజాగా.. వారానికి రెండు రోజులు సెలవు ప్రతిపాదన కూడా తెరపైకి రావడం, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే బ్యాంకు ఉద్యోగులు పండగ చేసుకోనున్నారు.