Techie R Nandhini: తమిళనాడులో టెక్కీ సజీవదహనం.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి..
ABN , Publish Date - Dec 25 , 2023 | 04:31 PM
తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. చెన్నైలోని దక్షిణ శివార్లలోని తలంబూర్‌లో శనివారం నాడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిని ఆమె 26వ పుట్టినరోజు సందర్భంగా.. అత్యంత కిరాతకంగా హతమార్చారు.
Woman Techie Nandhini Burnt Alive: తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. చెన్నైలోని దక్షిణ శివార్లలోని తలంబూర్‌లో శనివారం నాడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిని ఆమె 26వ పుట్టినరోజు సందర్భంగా.. అత్యంత కిరాతకంగా హతమార్చారు. గొలుసుతో కట్టేసి.. బ్లేడుతో కోసి.. ఆపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఆమెను వివాహం చేసుకోవడానికి లింగమార్పిడి చేయించుకున్న పాఠశాల విద్యార్థిని ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆర్ నందిని (మృతురాలు), పాండి మురుగేశ్వరి గతంలో మదురైలోని ఒక బాలికల పాఠశాలలో 10వ తరగతి వరకు కలిసి చదువుతున్నారు. కట్ చేస్తే.. కొంతకాలం తర్వాత పాండి మురుగేశ్వరి లింగమార్పిడి చేయించుకొని, వెట్రిమారన్‌గా మారాడు. అతడు ఎంబీఏ పూర్తి చేశాడు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే నందినిపై మనసు పారేసుకున్న అతడు.. ఆమెని పెళ్లి చేసుకోవడం కోసమే లింగమార్పిడి చేయించుకున్నాడు. అయితే.. నందిని అతనితో రిలేషన్షిప్లో ఉండేందుకు అంగీకరించలేదు. కానీ.. అతనితో స్నేహంగా మెలుగుతూ వచ్చింది.
కట్ చేస్తే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ పట్టా పొందిన నందినికి 8 నెలల క్రితం చెన్నైలో ఉద్యోగం వచ్చింది. అక్కడ మేనమామ దగ్గర ఉంటూ.. ఆఫీస్‌కి వెళ్తూ వస్తుండేది. వెట్రిమారన్‌తోనూ తరచుగా కలుస్తూ ఉండేది. అయితే.. వెట్రిమారన్‌కు నందినిపై అనుమానం వచ్చింది. ఆమె మరొకరితో సన్నిహితంగా మెలుగుతుందేమోనని అనుమానించాడు. దీంతో.. నందినిని హతమార్చాలన్న ఉద్దేశంతో, ఒక పన్నాగం పన్నాడు. పుట్టినరోజు నాడే బర్త్ డే సర్ప్రైజ్ పేరుతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. నందినిని చంపాలని పక్కా ప్రణాళిక రచించాడు.
శనివారం వెట్రిమారన్ ఫోన్ చేసి, తనతో కొన్ని గంటలు గడపాలని నందిని కోరాడు. అతని కోరిక మేరకు వెట్రిమారన్‌ని కలిసింది. ఇద్దరు కలిసి కొత్త బట్టలు కొనుగోలు చేశారు. కాసేపు సరదాగా గడిపిన అనంతరం.. ఇంటికి తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆమెను గొలుసుతో కట్టేశాడు. ఇదంతా ఫన్ కోసమేనని చెప్పడంతో.. నందనికి అనుమానం రాలేదు. అయితే.. గొలుసుతో కట్టేసిన అనంతరం వెట్రిమారన్ ఆమెకు టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో.. తనని వదిలిపెట్టమని ఆమె ప్రాధేయపడింది.
ఇంతలో వెట్రిమారన్ తనతో తెచ్చుకున్న బ్లేడుని బయటకు తీసి.. ఆమె మెడ, చేతులు కోసేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో కాలిపోతున్న నందినిని గమనించి, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ కేసులో పోలీసులు వెట్రిమారన్‌ని అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు. హత్యారోపణల్లో అతడ్ని జ్యుడిషియల్ రిమాండ్‌కి తరలించారు.
ఈ ఘటనపై తాంబరం పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘నందిని, వెట్రిమారన్ మంచి స్నేహితులు. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో నివసించారు. నందినిపై లైంగిక వేధింపులు జరిగినట్టు ఎలాంటి సూచనలు లేవు. వెట్రిమారన్ ఇంతకుముందు హింసాత్మక ధోరణులను ప్రదర్శించాడా? లేదా? అనేది స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని చెప్పారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఇదే సమయంలో మరో కథనం చక్కర్లు కొడుతోంది. మొదట్లో నందిని వెట్రిమారన్‌ని ప్రేమించిందని.. అయితే అతడు ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో దూరమయ్యిందని తెలిసింది. ఆ తర్వాత ఆమె రాహుల్ అనే యువకుడితో ప్రేమలో పడగా.. వెట్రిమారన్ కూడా ఆమెని ప్రేమిస్తున్నట్టు తేలింది. దీంతో నందిని అతడ్ని మందలించిందని, దీంతో కోపం పెంచుకున్న వెట్రిమారన్ ఆమెని పుట్టినరోజు సందర్భంగా పక్కా స్కెచ్ వేసి హతమార్చాడని వార్తలు వస్తున్నాయి.