అశోకుడిని కనుగొన్న ప్రిన్సెప్
ABN , First Publish Date - 2023-10-22T03:38:31+05:30 IST
అశోక చక్రవర్తి గురించి నూటఎనభై సంవత్సరాల క్రితం ఎవరికీ ఏమీ తెలియదు. ఇది మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు కాని, కాదనలేని వాస్తవం. మరింత స్పష్టంగా చెప్పాలంటే బౌద్ధ మతగ్రంథాలలో...
అశోక చక్రవర్తి గురించి నూటఎనభై సంవత్సరాల క్రితం ఎవరికీ ఏమీ తెలియదు. ఇది మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు కాని, కాదనలేని వాస్తవం. మరింత స్పష్టంగా చెప్పాలంటే బౌద్ధ మతగ్రంథాలలో అశోకుడి గురించిన ప్రస్తావనలు ఎంతగా ఉన్నప్పటికీ చరిత్ర పురుషుడుగా ఆ మహా చక్రవర్తి విస్మృతుడయ్యాడు. దీపవంశ, మహావంశ వంటి పాలీ గ్రంథాలు అతని గురించి చెప్పాయి. సంస్కృత గ్రంథమైన ‘అశోకావదాన’ అతడి జీవితచరిత్రగా భాసిల్లింది. చైనా యాత్రికులు ఫాహియాన్ (5వ శతాబ్దం), హుయన్–త్సాంగ్ (6వ శతాబ్దం) లను కలిసిన బౌద్ధులు అశోకుని గురించి వారికి అనేక కథలు చెప్పారు. భారీ శిలాస్తంభాలు, స్తూపాలు, ఇంకా ఆరామాలు చూపించారు. అశోకుడు నిర్మించాడని చెబుతున్న 84,000 స్థూపాలు, ఆరామాల గురించి విని చైనా బౌద్ధయాత్రికులు ఆశ్చర్యపోయారు.
అశోకుడిని ప్రస్తావించిన బౌద్ధ మత గ్రంథాలు ఈనాడు మనకు తెలిసిన అశోకుని గురించి అంటే అతని యుద్ధ పరిత్యాగం, మతపరివర్తన, ధర్మబద్ధమైన సమాజ స్థాపనా ప్రయత్నాల గురించి పూర్తిగా మౌనం వహించాయి. ఆ సంప్రదాయ కథనాలు ప్రధానంగా భిక్షు సంఘానికి అతను అందించిన అపరిమితమైన దానాలను కీర్తించాయి. కాని, ప్రజాసంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలను పూర్తిగా విస్మరించాయి; అలాగే, కళింగ యుద్ధంలో తాను జరిపిన నరమేధాన్ని చూసి, ఆయన బౌద్ధాన్ని స్వీకరించిన విషయం గురించి కూడ అవి చెప్పలేదు. దీపవంశ, మహావంశ, అశోకావదాన, లేదా మరో బౌద్ధ సంప్రదాయ గ్రంథం గాని, ఈ విషయాలను అసలు ప్రస్తావించలేదు. అయితే చరిత్ర పురుషుడుగా అశోకుడి గురించి మనకు ఎలా తెలిసింది?
ఇంగ్లీషువాడైన జేమ్స్ ప్రిన్సెప్ 1799లో జన్మించాడు. 1819లో భారతదేశానికి వచ్చి కలకత్తా టంకశాలలో నాణేల నాణ్యతను పరిశీలించే ఉద్యోగంలో చేరాడు. తర్వాత బెనారస్ వెళ్ళి అక్కడి మింట్‌లో 1830 వరకు పనిచేశాడు. 1833లో అతను, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కొత్త వెండి రూపాయి ఆధారంగా, భారతీయ తూనికలు–కొలతల సంస్కరణకు కృషి చేశాడు. అతను అధునాతనమైన ఒక సున్నితపు త్రాసును రూపొందించాడు; ఒక ధాన్యపు గింజలో మూడువేల వంతు బరువును కొలవగల ఆ త్రాసు ఆ కాలంలో ఒక అద్భుత ఆవిష్కరణ.
ప్రిన్సెప్ ప్రతిభావంతుడైన కళాకారుడు, డ్రాఫ్ట్స్‌మాన్. శిథిలమైన పురాతన కట్టడాల నమూనాలను చిత్రించాడు. ఖగోళ పరిశోధన నిమిత్తం అవసరమైన సాధనాలను రూపొందించాడు. ఉష్ణోగ్రతలను నమోదు చెయ్యగల సరికొత్త బారోమీటర్‌నూ రూపొందించాడు. ఇనుప తలాలపై పేరుకొనే తుప్పును నిరోధించటానికి ఎన్నో ప్రయోగాలు చేశాడు. అయితే, అన్నింటిని మించి ప్రిన్స్‌ప్‌కి నాణేల అధ్యయనంలో అమితమైన ఆసక్తి ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో, ఇంకా దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేయబడిన పురావస్తు ప్రదేశాలలో పర్యటించిన అనేకమంది బ్రిటిష్ ఉద్యోగులు, అధికారులు తమకు దొరికిన పురాతన నాణాలను అతనికి పంపేవారు.
మహమ్మదీయుల పాలనకు ముందటి భారతదేశ చరిత్ర గురించి, ఆ రోజుల్లో చాలా తక్కువగా మాత్రమే తెలుసనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇందుకు ప్రధాన కారణం, భారతదేశంలో లభించిన అనేక ప్రాచీన రాతప్రతులు, శాసనాలు, నాణేలపై చెక్కిన అక్షరాలను భారతీయులతో సహా ఎవరూ చదవలేకపోవడమే. 1832లో ప్రిన్సెప్ ‘జర్నల్ ఆఫ్ ది ఏషియాటిక్ సొసైటి’ మొదటి సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు. దీనితో, ప్రాచీన భారతచరిత్ర పట్ల ఆసక్తి గల ఇతరులతో, వారు వెలుగులోకి తెస్తున్న అనేక పురాతన వస్తువులతో అతనికి పరిచయం ఏర్పడింది. అపారమైన నైపుణ్యం, సహనశీలత కలిగిన మేధావే కాక ప్రతిభావంతమైన ఊహాశక్తి గల ప్రిన్సెప్, అనేక ప్రాచీన శాసనాలను చదివి, శతాబ్దాలుగా మరుగునపడిన భారతచరిత్రను తెలియజేసే సమాచార శకలాలను ఒక క్రమపద్ధతిలో కూర్చగలిగాడు.
ఆరు సంవత్సరాల పాటు సాగించిన అకుంఠిత పరిశ్రమ ఫలితంగా, 1837లో ప్రిన్సెప్ ఒక అరుదైన విజయం సాధించాడు. ఢిల్లీ పరిసరాల్లోని ఒక కొండశిఖరంపై శిథిలావస్థలో పడివున్న ఒక రాతిస్తంభం మీద గల పురాతన శాసనాన్ని చదవగలిగాడు. ఆ శాసనం బ్రాహ్మి లిపిలో ఉంది. దీనికి ఇతర ప్రాచీన లేదా ఆధునిక భారతీయ లిపులతో అంతగా పోలిక లేదనిపించింది. అప్పటికి కొంతకాలంగా ఇటువంటి శాసనాలు గల అనేక శిలా స్తంభాలు కనుగొనబడి, పరిశోధకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ప్రిన్సెప్ చదివిన శాసనం, ‘దేవానాం పియదస్సి’ (దేవతలకు ప్రియమైనవాడు) అని తనను తాను ప్రకటించుకున్న రాజుచే జారీ చేయబడిన శాసనాల పరంపరలో భాగమని నిరూపించబడింది. ఇప్పుడు ‘అశోకుడ’ని మనకు తెలిసిన చక్రవర్తే ఈ ‘దేవానాం పియదస్సి’. ప్రిన్సెప్ తొలుత శిలాస్థంభం మీది శాసనం సంస్కృత భాషలో ఉందని భావించి దాన్ని చదివే ప్రయత్నం చేశాడు. అయితే శ్రీలంకలో జార్జి టర్నోర్ (1799 –1843) పరిశోధనల ఫలితంగా అది థేరవాద బౌద్ధుల ‘పాలి’ భాషను పోలివుందని భావించేలా చేసింది.
తదుపరి దశాబ్దాలలో, అదే రాజు పేరుతో ఇంకా అనేక శాసనాలను కనుగొనటం జరిగింది; వాటి భాషలను మరింత కచ్చితంగా చదవగలిగారు. దీనితో ఆ రాజు గురించి, అతడు చేసిన పనుల గురించి పూర్తి చిత్రం వెలుగులోకి రావటం ప్రారంభమయింది. శాసనాలలో కనిపించే రాజు పియదస్సి తరచూ బౌద్ధ కథల్లో, దీపవంశ, మహావంశ వంటి గ్రంథాల్లో కీర్తించబడిన మహారాజు అశోకుడు కావచ్చునని పరిశోధకులకు అర్థమైంది. ప్రిన్సెప్ భారత చరిత్రకు, దాని కాలక్రమ నిర్మాణానికి, నాణేల పరిశోధనకు అనేక విధాలుగా దోహదం చేశాడు. అయితే అశోకుని శాసనాల గుట్టువిప్పటం వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది. అంతక్రితం శతాబ్దాలుగా మరుగునపడిన చక్రవర్తి గురించి లభించిన సమాచారం, బుద్ధుని ధర్మాన్ని సామాజిక రంగానికి అన్వయించవచ్చని, నిజానికి ఒకప్పుడు అది అలా అన్వయించబడిందని నిరూపించింది. అది బౌద్ధులకు ధర్మబద్ధమైన పరిపాలన గురించి ఒక నమూనాను అందించింది. అంతేకాదు, అది హింసను త్యజించిన శక్తిమంతుడైన చక్రవర్తిని, ఒక అనన్యమైన ఉదాహరణగా ప్రపంచానికి అందించింది.
ఇంతటి గొప్ప ఆవిష్కరణ చేసిన జేమ్స్ ప్రిన్సెప్ ఆ తరువాత ఎక్కువ కాలం జీవించలేదు. తరచూ తిరగబెట్టిన అనారోగ్యంతో అతను యాతనపడ్డాడు. 1838 నవంబరులో ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. 1840 ఏప్రిల్ 22న మరణించాడు. అతని అభిమాని, సహాయకుడు అయిన అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ ప్రాచీన భారత చరిత్ర గురించి తన మిత్రునికి గల ఆసక్తితో ప్రేరణ పొందాడు; బుద్ధునికి సంబంధించిన అనేక ప్రదేశాలలో పురావస్తు తవ్వకాలు జరిపి బుద్ధుని చారిత్రక వాస్తవికతను నిరూపించడంలో సహాయపడ్డాడు. 1841లో, కోల్‌కతాలోని హుగ్లీ నది తీరాన జేమ్స్ ప్రిన్సెప్ జ్ఞాపకార్థం ఎంతో అందంగా నిర్మించిన స్మారక స్థూపం ఇప్పటికీ చూడవచ్చు.
శ్రావస్తి ధమ్మిక
(తెలుగు డి. చంద్రశేఖర్)