పునాదులు కదులుతున్న అలికిడి వినండి!

ABN , First Publish Date - 2023-03-23T01:39:56+05:30 IST

ఉన్నట్టుండి తెలంగాణ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రజలలో అసంతృప్తులు ఉన్నా, వాటిని ప్రత్యామ్నాయంగా మలిచే శక్తి ఏ ప్రతిపక్షానికీ లేకపోవడంతో, అధికారపక్షానికి ఎదురులేనట్టే...

పునాదులు కదులుతున్న అలికిడి వినండి!

ఉన్నట్టుండి తెలంగాణ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రజలలో అసంతృప్తులు ఉన్నా, వాటిని ప్రత్యామ్నాయంగా మలిచే శక్తి ఏ ప్రతిపక్షానికీ లేకపోవడంతో, అధికారపక్షానికి ఎదురులేనట్టే కనిపించింది. కానీ పరిస్థితులు నాటకీయమైన మలుపు తిరిగాయి. ప్రత్యర్థులకు కొత్తశక్తులేవీ సమకూరలేదు కానీ, ప్రభుత్వమే తనంతట తాను ఉచ్చు బిగించుకుంటోంది.

ఏ పక్షానికీ నైతికత లేని స్థితిలో, బిఆర్ఎస్ కల్వకుంట్ల కవితకు, బిజెపి ప్రభుత్వ ఏజెన్సీకి నడుమ జరుగుతున్న విచారణ తతంగం ఉత్కంఠభరితమైన రాజకీయ వినోదంగా మాత్రమే ఇక మిగిలిపోవచ్చు. దానివల్ల ఒకరికి సానుభూతి, మరొకరికి రాజకీయ ఆయుధం దక్కే అవకాశమేదీ కనిపించడం లేదు. ఈ సన్నివేశం మధ్యలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదం గుప్పుమన్నది. కొంత అలజడి తరువాత సద్దుమణుగుతుందనుకున్నారు, కొన్ని చర్యల తరువాత చల్లారుతుందనుకున్నారు. కానీ, ప్రభుత్వపక్షం నుంచి, కమిషన్ పక్షం నుంచి కూడా సమస్యను ఎదుర్కొనడంలో సమర్థత, సమయస్ఫూర్తి వ్యక్తం కాలేదు. పైగా, ప్రభుత్వం కలవరపడుతున్నదని, ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని ప్రస్ఫుటంగా తెలిసిపోతున్నది.

జరిగిన పరీక్షలు ఎన్ని, వెల్లడయిన పరీక్షాపత్రాలు ఎన్ని వంటి లెక్కలకు మించిన సంక్షోభం ఇది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి, ఎంపిక కూడా అయి హతాశులయిన అభ్యర్థుల సమస్య మాత్రమే కాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నమోదయిన ఉద్యోగార్థుల సంఖ్యనే ఒక ప్రమాణంగా తీసుకుంటే, 30 లక్షల మందిలో అవిశ్వాసాన్ని కలిగించిన పరిణామం ఇది. ఆ ముప్పై లక్షల మంది వెనుక ముప్పై లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ సంఖ్య చిన్నది కాదు. ఈ అంశం రాజకీయ అస్త్రంగా రానురాను పదునెక్కుతున్నదంటే, కారణం, ప్రభుత్వం బోనులో నిలబడవలసి రావడమే. కమిషన్ కార్యనిర్వహణలో ప్రభుత్వ ప్రమేయం ఎంత అన్న సాంకేతిక విషయాలను పక్కన పెడితే, సమస్యకు, పరిష్కారానికి బాధ్యత వహించేది అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వమే అని ప్రజలు విశ్వసిస్తారు. సరే, ఎన్ని కట్టుదిట్టాలున్నా ఒక్కోసారి దొంగలు కన్నం వేయవచ్చు. జరిగిన తప్పును గుర్తించి, అది పునరావృతం కాకుండా చూడడం ఒక స్థాయి పరిష్కారం అయితే, జరిగిన పరిణామంతో దెబ్బతిన్న మనోస్థైర్యాలకు భరోసాను, అలుముకున్న నిస్పృహలకు ఉపశమనాన్ని అందించడం మరో స్థాయి పరిష్కారం. అన్ని అంచెలలోను దిద్దుబాటు జరగాలి, కానీ, జరుగుతున్నది చాలా తక్కువ.

కవిత-, ఈడీ ముఖాముఖీలో సంచలనశీలత రానురాను తగ్గిపోతున్నది. ప్రశ్నల అధ్యాయం ఇంకా కొనసాగుతున్నది. మంగళవారం నాటి సుదీర్ఘ విచారణ తరువాత, మలివాయిదా ఎప్పుడో కూడా తెలియదు. అంతిమంగా, అరెస్టు జరిగినా, అప్పటికి ఆ పరిణామంలో పెద్దగా వేడి మిగలదు. కాబట్టి, ఈడీ హడావుడిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదం సమసిపోతుందనో, మరుగుపడుతుందనో అనుకోవడానికి లేదు. కానీ, ప్రభుత్వంలోని కీలకవ్యక్తులు, తమ కుటుంబ సమస్యను ఎదుర్కోవాలి, ఇటు రాజకీయంగా ఉధృతమవుతున్న ఆందోళనను గమనించాలి. వారి ఇబ్బంది సానుభూతి ప్రకటించదగినదే కానీ, అధికారానికి ఉండే అనేక అనుబంధ ప్రభావాలలో వీటిని కూడా భాగంగా తీసుకోవాలి.

పరీక్షాపత్రాల లీక్ తెలంగాణలోని రెండు ప్రతిపక్షాలకు మంచి ఉద్యమాంశం అయింది. ఇతర పార్టీలకు కూడా తమ గొంతును, విధానాలను వినిపించడానికి ఒక సందర్భం అయింది. మొన్నటి దాకా బిఆర్ఎస్‌కు సాటి రాలేకపోతున్నాయని జనం అంచనా వేసిన పార్టీలకు ఉన్నట్టుండి కొత్తగా వచ్చిన బలమేమీ లేదు. బలమంతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదంలో ఉన్నది. దాని మీద జనం దృష్టిని సుదీర్ఘకాలం నిలపగలిగితే, రాజకీయ లాభం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా ఉద్యమకార్యాచరణ చేపడుతున్న సందర్భం ఇదే. ఆశ్చర్యకరంగా, చొరవను, చైతన్యాన్ని కోల్పోయి, సమస్యలోనే కూరుకుపోయినట్టు భారత్ రాష్ట్రసమితి కనిపిస్తున్నది. వాయుగుండం ఏర్పడింది. ఒకటో నెంబరు ప్రమాదసూచిక ఎగిరింది.

ఒక అసంతృప్తి మరొకదాన్ని మండిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు, నిద్రాణ పాలన, క్షేత్రస్థాయిలో విపరీతంగా ఉన్న అవినీతి, ధరణిని ఆశ్రయించి చెలరేగుతున్న రాజకీయ కబ్జాదారులు జనం సహనాన్ని ఎప్పటి నుంచో పరీక్షిస్తున్నాయి. ఇప్పుడు అన్నిటిని కలిపి ఆలోచించడం మొదలయింది. కేంద్రప్రభుత్వం కక్షసాధింపు కూడా ఉన్నది కాబట్టి, మద్యం కేసు గురించి తెలంగాణ సమాజం గుంభనంగా ఉన్నది కానీ, అటువంటి కేసులో అనుమానితులుగా ఉండడాన్ని హర్షించడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది ఇటువంటి పర్యవసానాల కోసం కాదన్న వేదన కూడా ఉద్యమకారులలో ఉన్నది. ఏ ఆదర్శాలూ లేని డొల్ల సమాజాన్నా మనం నిర్మించుకున్నది? అని వారు మథనపడుతున్నారు. ఈ నష్టాన్ని అంతటినీ మరమ్మత్తు చేసుకోవాలంటే ఎంతో ప్రయాసపడాలి. కేవలం డబ్బు అన్నిటినీ అధిగమింపజేస్తుందని అనుకోవడం పొరపాటు. ప్రజలలో ఆశను, ప్రలోభాన్ని పెంచడం కాదు, నమ్మకాన్ని పెంచాలి, గౌరవాన్ని పొందాలి.

అయినప్పటికీ, రెండు ప్రతిపక్షాలూ పోటాపోటీగా ఉద్యమాలు చేస్తే, వ్యతిరేక ఓటు చీలి తమకే లబ్ధి రావచ్చునని పాలకపక్షం అనుకుంటే కనుక, అది పొరపాటని తెలిసేలోపే జరగవలసిన నష్టం జరుగుతుంది. ఇప్పటి రాజకీయ వాతావరణంలో దాగి ఉన్న అవకాశాలను పసిగట్టిన పక్షాలు, దాన్ని సానుకూలం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాయి. ఎవరికి క్షేత్రబలం, ధనబలం, ప్రజామోదం సమకూరతాయో వారే ఆ పోటీలో నెగ్గుతారు తప్ప, ప్రజలు అమాయకంగా తమ అభిమతాన్ని చీల్చుకోరు.

కాంగ్రెస్‌కు, బిజెపికి ఉన్న బలహీనతలు అట్లానే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా, తెలంగాణ కాంగ్రెస్ కలహాల కాపురం లాగానే ఉంటోంది. ఉన్నా లేకున్నా, జనం మనసులో ఆ అభిప్రాయం పాదుకుపోయింది. తెలంగాణలో పార్టీ వృద్ధి కోసం కాంగ్రెస్ అధిష్ఠానవర్గం చేయగలిగింది ఏమన్నా ఉంటే, అది అసంఖ్యాకంగా ఉన్న పార్టీనేతలను క్రమశిక్షణలో పెట్టడం. ఒకరి కాళ్లు మరొకరు లాగకుండా, అంతా కలిసి లక్ష్యాన్ని అధిరోహించే ప్రయత్నం చేయడం. అందుకు ఈ సమయానికి మించిన అవకాశం మరొకటి ఉండదు. బిజెపి సందడి ఎక్కువ కానీ, క్షేత్రస్థాయిలో అంతటి దృశ్యం ఉండదు. నిత్యం వార్తల్లో ఉండడంలో, ప్రభుత్వాన్ని ధాటిగా విమర్శించడంలో ముందే ఉంటారు. కాకపోతే, దురుసు, దూకుడు మాటలను ప్రజలు అన్ని సందర్భాలలోనూ ఇష్టపడరు. పరుషంగా మాట్లాడే నేతల మీద గౌరవం కూడా ఉండదు. ఐకమత్యంలో క్రమశిక్షణలో గతంలో మంచి మార్కులు తెచ్చుకునే బిజెపి, ఈ మధ్య ఇంటిపోరుతో సతమతమవుతోంది. ఉత్తరాది మతవిభజన ధోరణిని తెలంగాణలో కూడా ప్రయోగించాలనే ఆలోచన కట్టిపెట్టి, ప్రజాసమస్యల మీద పోరాడే ప్రతిపక్షంగా వ్యవహరిస్తే, ఎదగడానికి ఆస్కారం ఉంటుంది.

కేంద్రప్రభుత్వం ఇంకా అదానీ జ్వరం నుంచి కోలుకోలేదు. రాహుల్ లండన్ ప్రసంగాలను యాగీ చేసి, అదానీని రక్షించుకుందామనే ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు ఇంతటి బలశాలిగా ఉన్నప్పటికీ వచ్చే ఏడాది గురించి భయపడుతున్నది. కర్ణాటకలో పేకమేడల్లా చెదిరిపోతున్న పునాదుల్ని చూసి ఆందోళన చెందుతున్నది. వాల్ పోస్టర్లు అంటిస్తే వందలాది కేసులు పెడుతున్నది. ఈ సారి లెక్క తక్కువ పడుతుందేమోనన్న కలవరం ఉన్నది. అందుకే, బిజెపికి తెలంగాణ కావాలి. మద్యం కేసును అక్కడే పర్యవేక్షిస్తున్నట్టుగా, పరీక్షపత్రాల లీక్ వ్యవహారాన్ని అక్కడినుంచి గమనిస్తున్నారు.

బహుశా ఇది కాళ్ల కింద నేల కదిలే కాలం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పాలకులకు కూడా ఒక హెచ్చరిక అందింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికారపక్షానికి ఎదురయిన దారుణమైన ఓటమి, ప్రధాన ప్రతిపక్షానికి కొండంత బలాన్ని ఇచ్చింది. వాస్తవాన్ని గ్రహించలేని ఏలికలు నోరుపారేసుకుంటున్నారు, అసహనంతో రగిలిపోతున్నారు. తెలంగాణలో ఒకే ఒక్క ప్రతిపక్షం ప్రత్యర్థిగా ఎదగడం సమస్య అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాలు ఒక జట్టు కావడం సమస్యగా ఉన్నది. కావలసిన కార్యానికి మండలి ఎన్నికలు రంగం సిద్ధం చేశాయి. బిజెపికి ఇప్పుడు ఇదొక సమస్య. వైసీపీ ప్రభుత్వం నుంచి అందే విధేయత, కప్పం ఢిల్లీ ప్రభువులకు విలువైనవి. తామొకటి తలిస్తే జనం మరొకటి తలుస్తున్నారు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-03-23T01:39:56+05:30 IST