Share News

‘అధికార’ చరిత్రకు పరిశోధక చికిత్స

ABN , Publish Date - Oct 24 , 2024 | 02:34 AM

భన్వర్ మేఘ్వంశీ. రాజస్థాన్‌కు చెందిన రచయిత, పాత్రికేయుడు, దళితోద్యమ కార్యకర్త. ఈయన రాసిన ఆత్మకథనాత్మక రచన తెలుగు అనువాదం ‘‘నేనెందుకు హిందువును కాలేకపోయాను?’’ ఆవిష్కరణ ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలోను...

‘అధికార’ చరిత్రకు పరిశోధక చికిత్స

భన్వర్ మేఘ్వంశీ. రాజస్థాన్‌కు చెందిన రచయిత, పాత్రికేయుడు, దళితోద్యమ కార్యకర్త. ఈయన రాసిన ఆత్మకథనాత్మక రచన తెలుగు అనువాదం ‘‘నేనెందుకు హిందువును కాలేకపోయాను?’’ ఆవిష్కరణ ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలోను జరిగింది. తండ్రి హెచ్చరికను పెడచెవిన పెట్టి మరీ ఆర్ఎస్ఎస్‌లో చేరి, ఒకసారి అయోధ్య కరసేవకు కూడా వె‍ళ్లిన మేఘ్వంశీ, సంఘ్‌లో కులవివక్ష కారణంగా తప్పుకున్నారు. హైదరాబాద్ ‘లామకాన్’లో జరిగిన కార్యక్రమంలో మేఘ్వంశీ సంఘ్‌లో తన అనుభవాలను స్వయంగా వివరించారు. ఆర్ఎస్ఎస్ స్థాపన 1925లో జరిగితే, మూడేళ్లకే అది రాజస్థాన్‌కు వ్యాపించిందని, అంబేడ్కర్ వాదం మాత్రం 1990ల దాకా రాలేదని ఆయన చెప్పారు. ఆ సందర్భంగా, మేఘ్వంశీని ఒక ప్రశ్న అడిగాను: అంబేడ్కర్ ప్రభావం లేకపోతే, సంఘ్ దళితులకు మేలుచేయదని, అందులో చేరవద్దని మీ నాన్న మీకు సలహా ఎట్లా ఇవ్వగలిగారు? ఆయనకు ఆ అవగాహన ఎట్లా కలిగింది? అందుకు మేఘ్వంశీ సమాధానం, ‘‘అంబేడ్కర్ ప్రభావం లేదు కానీ, గాంధీ ప్రభావం ఉన్నది. కాంగ్రెస్ చేపట్టిన సంస్కరణాత్మక హరిజనోద్ధరణ కార్యక్రమాల ప్రభావం, రాజ్యాంగం ద్వారా వచ్చిన సంక్షేమం, హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా అమలులోకి రావడం, ఈ కారణాల వల్ల రాజస్థాన్ దళితులు ఇటీవలి కాలం దాకా కాంగ్రెస్ వైపే ఉంటూ వచ్చారు.’’ దళితులు ఎక్కడా ఎదురుచూపుల్లో మిగలలేదు. అందిన ఆధారంతోనే అడుగులు వేశారు.


ఆధునిక భారతదేశ చరిత్ర ఎంత అసమగ్రం అంటే, భౌగోళికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కూడా కొన్ని స్థలాలు, శ్రేణుల ప్రయాణం ఇంకా అక్షరాలకు ఎక్కలేదు. మనం చరిత్ర అని చదువుకుంటున్నదానిలో ఎన్నో ఖాళీలు, విస్మరణలు, అగాధాలు! జాతీయోద్యమచరిత్ర అంతా ఉత్తరాది పురాణమే తప్ప, దక్షిణాదికి చెందిన నేతల, కార్యకర్తల, ప్రజల కథనాలే కనిపించవు! అట్లాగే, సామాజికంగా అట్టడుగున ఉన్న ప్రజాశ్రేణులు స్వాతంత్ర్య పోరాటానికి, జాతీయోద్యమవిలువలకు చేసిన దోహదాల స్మరణ ఏ దినోత్సవాలలోనూ వినము. స్థానికంగా పుట్టి పెరిగి ప్రభావశీలంగా మారిన ఉద్యమాల గురించి పెద్దగా చెప్పుకోము. గాంధీ ‘హరిజన’ అంశాన్ని జాతీయోద్యమానికి కీలకంగా పరిగణించకముందే, దేశంలోని దళితులకు ఆరాధ్య నాయకుడిగా, ఆశాజ్యోతిగా అంబేడ్కర్ కనిపించకముందే, దేశవ్యాప్తంగా సామాజిక ప్రజాస్వామ్యవాదానికి బీజాలు పడ్డాయని గ్రహించము.


సామాజికోద్యమాల చరిత్రకారుడు జంగం చిన్నయ్య రాసిన ‘‘ఆధునిక భారత నిర్మాణానికి దళితుల దోహదం’’ (దళిత్స్ అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా) అన్న పుస్తకం, కులనిర్మూలనా భావాల శతాబ్దాల చరిత్రను వివరిస్తూ, భారతదేశంలో ఈ చైతన్యం వలసవాద పూర్వదశకు, అనంతరదశకు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నదని అంటారు. భారతదేశంలో ఆధునికత వలసపాలన ఫలితమేనా, స్థానికంగా మూలాలు లేవా అనే ప్రశ్నకు, చిన్నయ్య ఈ రూపంలో సమాధానం ఇచ్చారు. భారతదేశంలో కులనిర్మూలన, కులవ్యతిరేక భావాలకున్న సుదీర్ఘచరిత్రను ఆధునికతా ప్రయాణంలో భాగంగా పూర్వోత్తర వలసవాద మేధావులు పరిగణించకపోవడం అన్యాయం. చిన్నయ్య పుస్తకం జాతీయోద్యమ అధికారిక కథనాలు మరుగుపరచిన మరో చరిత్ర కథనాన్ని ఆవిష్కరించింది. సామాజిక సమానత్వాన్ని స్వాతంత్ర్యానికి ఒక ముందస్తు షరతుగా చేయడం ద్వారా దళిత ఉద్యమం జాతీయవాదానికి గొప్ప చేర్పు ఇచ్చిందని ఆ పుస్తకం సూచిస్తుంది. హిందూ శిష్టవర్గాల జాతీయవాదానికి ప్రతివాదాన్ని నిర్మించి, ముందుకు తీసుకువెళ్లినవాడిగా బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను చిన్నయ్య పేర్కొంటారు. అదే సమయంలో తెలుగు ప్రాంతాలలో, స్థానికంగా ఎదిగిన దళిత నాయకత్వం గురించి, నాటి రాజకీయాలలో వారి ప్రమేయం గురించి వివరంగా పేర్కొంటారు. అంబేడ్కర్‌ కంటె ముందే, అంబేడ్కర్‌ ప్రభావం సోకక ముందే, అనేక మంది దళిత సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా కార్యక్షేత్రంలో ఉన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని తమ వ్యక్తీకరణను విస్తరించుకుంటూ వెళ్లారు. దేశవ్యాప్తంగా అట్లా ఎదిగిన పాయలన్నీ అనివార్యంగా, సహజంగా అంబేడ్కర్‌ మహానదిలో కలసిపోయాయి. అటువంటి పాయలలో ఒకటి ఆది హిందూ/ ఆది ఆంధ్ర ఉద్యమం. నాటి హైదరాబాద్ రాజ్యంలో ఆ పతాకాన్ని చేతబట్టి, తన ప్రభావాన్ని బ్రిటిష్ ఆంధ్రలో కూడా విస్తరించినవాడు భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి ఉద్యమం గురించి చెప్పడమే కాకుండా, ఆయన వైఖరులను విశ్లేషించారు చిన్నయ్య. హిందూ సంస్కర్తల కార్యప్రణాళికకు లోబడి పనిచేసి, వారి గుర్తింపును పొందినవాడిగా భాగ్యరెడ్డి వర్మను చిన్నయ్య వ్యాఖ్యానించారు.


విడిగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక శ్రేణితో మాత్రమే పనిచేయకుండా, ఆనాటి హైదరాబాద్ సమాజంలో ఉన్న శిష్ట సంస్కర్తలతో కలసి భాగ్యరెడ్డి ముందుకు నడిచారు. ఆ క్రమంలో ఆయన అనేక అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. నిజాం పాలన కావడం వల్ల, ప్రభుత్వం నుంచి దళితులకు లభించే సానుకూలపరిగణనను వినియోగించుకుంటూ, ఆ నాటి నగరప్రముఖులలో ఒకరిగా భాగ్యరెడ్డి ఎదిగారు. 1917లో విజయవాడలో జరిగిన చరిత్రాత్మక ఆదిమాంధ్ర మహాసభకు భాగ్యరెడ్డి అధ్యక్షుడిగా ఆహ్వానితులయ్యారు. తెలుగులో మొట్టమొదటి మహానవల ‘మాలపల్లి’లో ఒక పాత్రగా నిలిచినప్పటికీ, భాగ్యరెడ్డివర్మకు అనంతర కాలంలో తెలుగువారి సామాజిక చరిత్రలో పెద్ద స్థానం లభించలేదు. 1938లో మరణించిన భాగ్యరెడ్డి స్మృతి పూర్తిగా అణగారిపోకుండా ఆయన కుటుంబం, ఉద్యమసహచరులు కాపాడుతూ వచ్చారు కానీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం, దళిత రాజకీయాలతో సహా అన్నీ మారిపోయాయి. 1985 తరువాత ఉమ్మడి తెలుగురాష్ట్రాలలో దళిత చైతన్యం వెల్లువెత్తింది కానీ, ఒకనాటి నైజాము రాజ్యంలో గొప్ప సంస్కర్తగా, దళిత కార్యకర్తగా నిలిచిన భాగ్యరెడ్డికి రావలసిన గుర్తింపు రాలేదు.

భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బి.ఎస్. వెంకట్రావు, శ్యామ్‌సుందర్ వంటి వారితో కూడిన హైదరాబాద్ దళిత ఉద్యమ ప్రస్థానాన్ని చరిత్రీకరించిన పి.ఆర్. వెంకటస్వామి పుస్తకం ‘‘అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్’’ దశాబ్దాలపాటు అలభ్యంగా మసకబారిపోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమం అందుకుంటున్నవేళ, పరిశోధించి, విస్మృత చిహ్నాల స్ఫూర్తిని పునరుద్ధరించాలన్న సంకల్పం వల్ల భాగ్యరెడ్డి ప్రధానకథనాలలోకి రాసాగారు. చెల్లాచెదరుగా ఉన్న తెలంగాణ దళిత చైతన్యకథనాలను కఠోరశ్రమతో పోగుచేసి, మిగిలిన వ్యక్తులతో మాట్లాడి గొప్పకృషి చేసినవాడు సంగిశెట్టి శ్రీనివాస్. అలనాటి తెలంగాణ వికాసోద్యమంలో పరిశోధకుడిగా ఆదిరాజు వీరభద్రరావు ఎంతటి పని చేశారో, సంగిశెట్టి శ్రీనివాస్ పాతికేళ్ల కిందట మొదలయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పరిశోధకుడిగా అంతటి పాత్ర నిర్వహించారు. తెలంగాణ జర్నలిజం చరిత్ర, కథాసాహిత్య చరిత్ర, అనేక జీవిత చరిత్రలు, ఆంధ్ర ప్రాంత, అగ్రవర్ణ రచయితలతో సహా అందరి అలభ్యరచనల సేకరణ, చేసిన సంగిశెట్టి ఇప్పుడు, బహుజన సాహిత్యం మీద ప్రత్యేకంగా గురిపెట్టారు.


భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఎం.బి. గౌతమ్ రాసిన ‘భాగ్యోదయం’, గెయిల్ ఆమ్ వెట్ రాసిన ‘‘దళిత్స్ అండ్ ది డెమొక్రాటిక్ రివల్యూషన్’’, అబ్బసాయిలు రాసిన ‘‘దళిత్ రీడర్‌షిప్ ఇన్ ఇండియా’’ వంటి పుస్తకాలు కొన్ని తప్ప, పాతికేళ్ల కింద తెలంగాణ, హైదరాబాద్ దళిత ఉద్యమం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. దొరికిన వాటిని క్షుణ్ణంగా అధ్యయనంచేసి, విశ్వవిద్యాలయాలలోని పరిశోధక వ్యాసాలు, ఇంకా అనేక ఉద్యమచరిత్ర గ్రంథాలు, ఆత్మకథలు, పత్రికలు వీటన్నిటిని శోధించి భాగ్యరెడ్డి వర్మతో పాటు, ఆ నాటి తెలంగాణ దళిత నాయకుల విశేషాలన్నీ సంగిశెట్టి ఆవిష్కరించారు. తన అన్ని సాహిత్య, సాహిత్యేతర పరిశోధక ప్రచురణల్లోనూ దళిత కోణాన్ని, సమాచారాన్ని అంతర్భాగం చేశారు. ఈ మధ్యనే విడుదలైన సంగిశెట్టి శ్రీనివాస్ ‘‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’’ ఆధునిక తెలుగు సామాజిక చరిత్రలన్నిటిలోనే ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఇందులోని సమాచారం అంతా సంగిశెట్టి సుమారు రెండు దశాబ్దాలుగా పోగుచేస్తూ వస్తున్నదే. దళితశ్రేణుల నిర్వచనాలను, బౌద్ధకాలం నుంచి మూలాలను సంగిశెట్టి ఇందులో చర్చించారు. ఆసఫ్ జాహి కాలం నుంచి ఆధునికతా ప్రయాణాన్ని సూచించారు. దళితుల సాంప్రదాయ వృత్తులు, వారి కళారూపాలు, ఉద్యమాలలో దళితుల స్థానం, దళితుల సొంత ఉద్యమాలు, వీటన్నిటినీ సంగిశెట్టి శ్రీనివాస్ ఈ పుస్తకంలో విపులంగా చర్చించారు. ఈ పుస్తకంలోని బలం, కేవలం చరిత్ర పుస్తకం కావడం కాదు. చరిత్రలు విస్మరించిన చరిత్రపుస్తకం కావడం. మౌలిక ఆధారాలను, ఆకరాలను సేకరించడంలో అగ్రవర్ణచరిత్రల విషయంలో లభించినంత సౌలభ్యం ఇటువంటి చరిత్రలలో దొరకదు.


అంబేడ్కర్‌ కంటె మూడు నాలుగు సంవత్సరాలు ముందుపుట్టిన భాగ్యరెడ్డి వర్మ, హేతుబద్ధ వివేచనను, పౌరాణిక కథనాలను ప్రశ్నించే కుతూహలాన్ని, సామాజిక సమానత్వ ఆదర్శాన్ని అలవరచుకున్నారు. అంటే ఆయన మెలగిన సమాజంలో, ఆయా ప్రగతిశీల భావాలు ఉనికిలో ఉన్నాయన్న మాట. దళితులు ఒకప్పుడు దేశపాలకులని, అందుకని రెడ్డి అని పేరుచివర ఉండాలని కుటుంబ శైవ గురువు సూచన మేరకు, భాగ్యరెడ్డి అన్నపేరు ఆయన తల్లిదండ్రులు పెట్టారు. మతప్రచారకుల ద్వారా కూడా ఆత్మాభిమాన సందేశాలు అందుతూ ఉండేవన్నమాట. అంబేడ్కర్‌ కంటె ముందే సామాజిక న్యాయ, సమానత్వ భావాలను విస్తృతంగా ప్రచారం చేసిన భాగ్యరెడ్డి వర్మ, 1930 ప్రాంతంలో చరిత్రాత్మక రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు, అంబేడ్కర్‌ ప్రాతినిధ్యాన్ని సమర్థించడం ద్వారా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్టు సూచించారు. స్వాతంత్ర్యానంతరం భాగ్యరెడ్డి కుమారుడు కాంగ్రెస్ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సమకాలంలో భాగ్యరెడ్డికి, ఇతర దళిత సంస్కర్తలకు మధ్య సమన్వయమూ ఉండేది, విభేదాలు కూడా ఉండేవి. భాగ్యరెడ్డి వర్మ జీవితాన్ని, ఆచరణను కథనం చేస్తూ రాసిన ప్రత్యేక చరిత్ర గ్రంథం ‘‘దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ’’ కూడా సంగిశెట్టి శ్రీనివాస్ ఈ ఏడాదే ప్రచురించారు.

ప్రాంతీయ, శ్రేణీయ చరిత్రల ద్వారానే సమగ్రమైన భారత చరిత్ర నిర్మితమయ్యేది. సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ అందుకు ఒక మంచి నమూనా. పరిశోధనా, సత్యాన్వేషణా కాలం చెల్లిన విలువలైన రోజుల్లో ఇంతటి నిష్ఠాగరిష్టుడైన పరిశోధకుడు ఉండడం తెలుగువారికి లభించిన మంచి అవకాశం.

కె. శ్రీనివాస్

Updated Date - Oct 24 , 2024 | 02:35 AM