ప్రధాని చేస్తే ఒప్పు, ప్రతిపక్ష నేత తప్పు

ABN , First Publish Date - 2023-03-09T00:54:00+05:30 IST

రాహుల్ గాంధీ మళ్లీ తప్పులో కాలేశారా? జోడో యాత్రతో సంపాదించుకున్న కొద్దో గొప్పో పేరు కాస్తా కేంబ్రిడ్జ్‌లో ఆవిరయిందా? బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నుంచి...

ప్రధాని చేస్తే ఒప్పు, ప్రతిపక్ష నేత తప్పు

రాహుల్ గాంధీ మళ్లీ తప్పులో కాలేశారా? జోడో యాత్రతో సంపాదించుకున్న కొద్దో గొప్పో పేరు కాస్తా కేంబ్రిడ్జ్‌లో ఆవిరయిందా? బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నుంచి హిండెన్‌బర్గ్ అదానీ కల్లోలం దాకా ఉక్కిరిబిక్కిరి అయిన బిజెపి, కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ, విజాతీయ విరుగుడు వ్యూహంలో అసంకల్పితంగా చిక్కుకుని రాహుల్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా?

ఈ ప్రశ్నలు ఏమంత అప్రధానమైనవి కావు. ఎందుకంటే, రాహుల్ గాంధీ మాట్లాడే మాటలపై బిజెపి చాలా ఆశలు పెట్టుకున్నది. ఇంగ్లండ్ పర్యటన ముగియలేదు. పాల్గొనవలసిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. ఇదే ఊపు మీద కొనసాగితే, తమకు లెక్కలేనన్ని ఆయుధాలు దొరికినట్టేనని బిజెపికి సంబరంగా ఉన్నది. విదేశాలకు వెళ్లి ఇంటిపరువు తీస్తున్నాడని, చైనాను పొగుడుతున్నాడని చేస్తున్న విమర్శ సాధారణ ఓటర్లను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకని, ఆహార్యాన్నీ, కేశసంస్కారాన్నీ కూడా పట్టించుకోకుండా జనంలో కలిసిమెలిసి తిరిగిన ఒక జనయాత్రికుడిని, దేశప్రతిష్ఠను ధ్వంసం చేయడానికి కిరాయిమనిషి వలె ప్రయత్నిస్తున్న ద్రోహిగా చిత్రించడానికి శాయశక్తులా ప్రయత్నం జరుగుతున్నది.

-ఒక పాదయాత్ర చేసినంత మాత్రాన రాహుల్ గాంధీకి కొత్త శక్తులు సమకూరాయని, వచ్చే ఏడాది ఎన్నికలలో ప్రత్యామ్నాయానికి ఆయన సారథ్యం వహిస్తాడని కాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, దేశంలో తిరిగి బిజెపి ప్రభుత్వమే వస్తుంది. ఇప్పుడున్నన్ని సీట్లు కూడా రావచ్చు. ఇదే పరిస్థితి ఇదే తీరుగా కొనసాగితే, 2024లో కనీసపు గెలుపు అయితే ఖాయంగాను, అదనపు మెజారిటీ అనిశ్చితంగాను లభించవచ్చు. ఇప్పటికీ, ఎన్నికలు జరిగే వేళకీ నడుమ ఉన్న పదమూడు, పధ్నాలుగు నెలల కాలంలో జరిగే రాష్ట్రాల ఎన్నికలు, సంభావ్యత కలిగిన అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. బిజెపి లక్ష్యం తిరిగి ఎన్నిక కావడం మాత్రమే కాదు, 2019 మాదిరిగా, వీలయితే, అంతకంటె ఎక్కువ స్థాయిలో విజయం సాధించాలి. అప్పుడు మాత్రమే తన ‘ప్రాజెక్టు’ నిరాఘాటంగా కొనసాగుతుంది. అందుకుగాను, ప్రతిపక్షాల కూటమి ఏర్పడడానికి ఉండే అన్ని అవకాశాలనూ భగ్నం చేయడం, ముఖ్యంగా, చిన్నచిన్న, స్థానిక రాజకీయ పక్షాలకు ఇరుసుగాను, గొడుగుగాను వ్యవహరించగలిగిన కాంగ్రెస్‌ను మరింతగా బలహీనం చేయడం బిజెపి అవసరం.

రాహుల్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది కదా, అనుకునే శ్రేయోభిలాషులుంటారు. రాజకీయాలలో ఆచితూచడం అవసరమే. కానీ, అతిజాగ్రత్తలు అడుగే పడనీయని అవరోధాలుగా మారే ప్రమాదమూ ఉంటుంది. అట్లా మాట్లాడకుండా కాంగ్రెస్ నాయకుడికి గత్యంతరమేమున్నది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే.

ఎమర్జెన్సీ తరువాత జనతా హయాంలో ఇందిరాగాంధీని ఒక రోజు అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. ఎవరో విలేఖరి ఆమె జైలు అనుభవం గురించి ప్రశ్నించబోతే, ఇందిర, ఈ పత్రికాసమావేశంలో ‘ఇండియా గురించి నేను చెడుగా మాట్లాడను’ అని సమాధానం చెప్పారట. ఇందిరకు దగ్గరగా ఉండి, లండన్‌లో స్థిరపడిన ఒక సూపర్ సీనియర్ జర్నలిస్టు మొన్న రాహుల్‌కు ఈ ఉదంతాన్ని గుర్తుచేయడమే కాకుండా, నేర్చుకొమ్మన్నాడట. పరాయిదేశంలో ఉన్నప్పుడు స్వదేశం గురించి చెడుగా మాట్లాడకపోవడం ఒక పరిపక్వత అన్న అభిప్రాయం ప్రచారంలో ఉన్నది. ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు కవి. కానీ, సమస్య ఏమిటంటే, దేశమూ, దేశాన్ని పాలించే ప్రభుత్వాలూ ఒకటేనా? దేశంలో సమస్యలను ప్రస్తావిస్తే, దేశం గురించి చెడు మాట్లాడినట్టా?

సర్వమత సమ్మేళనంలో మాట్లాడడానికి వెళ్లిన వివేకానందుడు, భారతదేశంలో ఆకలితో అల్లాడిపోతున్న జనం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. వారికి మీరు మతాన్ని ఇవ్వచూపుతున్నారు, కానీ, వారికి అన్నం కావాలి, అని క్రైస్తవ మిషనరీలను ఉద్దేశించి అన్నారాయన. ఆనాటి దేశం వలసపాలనలోని దేశమే కావచ్చు, కానీ, నికృష్టపేదరికాన్ని పరదేశంలో ప్రస్తావించడాన్ని తప్పుబట్టగలమా? దేశంలోని వాస్తవిక పరిస్థితుల ప్రస్తావన ఎప్పుడూ అగౌరవపరచడం కాదు, వాటిని సరిదిద్దడంలో బాధ్యతాయుత వ్యక్తుల సంస్థల వైఫల్యాన్ని చెప్పడం కూడా దేశాన్ని అగౌరవపరచడం కాదు. 1977లో జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసమావేశంలో ప్రసంగిస్తూ, అత్యవసర పరిస్థితిని భారత ప్రజలు ఎట్లా ఓడించిందీ చెప్పారు. ‘ప్రాథమిక మానవహక్కుల పునరుద్ధరణ జరిగింది. మా ప్రజల తలల మీద వేలాడిన భయమనే ఖడ్గం తొలగిపోయింది’ అని ఇందిర పాలన గురించి ప్రస్తావించారు. ఆ మాటలు వాస్తవమే కదా, ఆయన అట్లా మాట్లాడటాన్ని తప్పుబట్టగలమా?

ఇక మన గౌరవ ప్రధానమంత్రి గారు, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకంటె ముందున్న ప్రభుత్వాలను అగౌరవపరుస్తూ అమెరికాలో, కెనడాలో, జర్మనీలో మాట్లాడుతూనే వచ్చారు. పోయిన ప్రభుత్వాలు అంతా పాడుచేసిపోయాయి, మేం వచ్చి అంతా బాగుచేసుకోవలసి వస్తోంది- వంటి మాటలు ఆయన రకరకాల విదేశీ వేదికల మీద మాట్లాడారు. అప్పుడు కాంగ్రెస్ ఆ మాటలను తప్పు పట్టింది. ప్రధానిగా విదేశాలకు వెళ్లినప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలి కానీ, పార్టీకి కాదు అంటూ వ్యాఖ్యలు చేసింది. అది కూడా సరైన స్పందన కాదు. విమర్శను ఎక్కడి నుంచైనా ఎదుర్కొనాలి. ఎక్కడైనా సమాధానం ఇవ్వాలి. దేశ సంస్కృతిని, సంప్రదాయాలనీ, చరిత్రని అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేయకూడదు, తప్పు. రాజకీయ విమర్శలు అధికారంలో ఉన్నవారైనా, ప్రతిపక్షీయులైనా చేయడంలో తప్పులేదు. అందులో దేశభక్తి లోపమేమీ లేదు.

ఇంతకీ రాహుల్ ఇంగ్లండ్‌లో ఏ వ్యాఖ్యలు చేశారు? భారత్‌లో స్వేచ్ఛలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. పార్లమెంటులో మాట్లాడిన మాటలు కూడా మాయం అవుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం పునాదుల మీద దాడి జరుగుతున్నదన్నారు. భారత రాజ్యాన్ని, చీకటి రాజ్యశక్తులైన సిబిఐ, ఈడీ వంటి ఏజెన్సీలు కబళిస్తున్నాయన్నారు. ఇవన్నీ ఆయన ఇంగ్లండ్‌లో అన్నారు. ఇవన్నీ బ్రిటిష్ ప్రజలకు స్వయంగా భారత ప్రభుత్వమే తెలియజెప్పింది కదా? బిబిసి మీద ఒక కేంద్ర ఏజెన్సీ సర్వే జరిపింది. దాని డాక్యుమెంటరీని ప్రభుత్వమే నిషేధించింది. ఈ ఎనిమిది తొమ్మిదేళ్ల కాలంలో గ్రీన్ పీస్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు పనిచేసే పరిస్థితులు లేకుండా భారత ప్రభుత్వమే చేసింది. ఇక ప్రత్యేకంగా ఎవరైనా కలిగించగలిగే అప్రదిష్ఠ ఏముంది?

‘ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా..’ అని 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి ఒక సినిమా పాటలో అన్నారు. ఆ పంక్తులు ఆనాడు సమైక్యతను కోరుకున్నవారికి గొప్పగా వినిపించాయి. ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నవారికి తప్పుగా వినిపించాయి. కుటుంబం కానీ, కులం కానీ, గ్రామం కానీ, ప్రాంతం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ, తమలోని అంతర్గత విభేదాలను అప్రధానం చేసుకుని, బయటివారికి ఐక్యంగా కనిపించాలన్నది ఒక సంప్రదాయ విలువ. భర్త ఎంతగా హింసించినా, పొరుగింటికి కూడా వినిపించకుండా రోదించాలని కుటుంబస్మృతి చెబుతుంది. కానీ, ఇప్పుడు, ఆధునిక జీవనం, ప్రజాస్వామిక భావాలు ఆ పరిధులను ప్రశ్నిస్తున్నాయి. నా పెళ్లాం, నేను కొట్టుకుంటాను, చంపుకుంటాను అనే వాదనను అంగీకరించడం లేదు, పరువు కోసం బాధిత పక్షం మౌనం వహించాలని ఎవరూ అనుకోవడం లేదు. పాండవులు ఐదుగురు, కౌరవులు నూరుమంది, బయటివారు వస్తే నూటాఅయిదు మంది అన్న విలువ తరతరాల నాటిది, ఇప్పటికీ అది ఆకర్షణీయమైనదే. కానీ, సాంప్రదాయికమైన అస్తిత్వాలు కాక, మంచిచెడు, న్యాయం అన్యాయం అన్న మౌలిక సూత్రాల ఆధారంగా సమర్థనలు, మోహరింపులు జరగడమే ఆధునికమైన విలువ.

నిర్బంధాలు దురాచారాలు హింసలు అలుముకున్నచోట, విముక్తి కోసం ప్రయత్నాలు చేయడం మానవసహజం. సామాజికమో, రాజకీయమో అయిన అధికారం కలిగినవారు మహాబలశాలి అయినప్పుడు, బాధితులు సహాయం కోసం చూస్తారు. హాహాకారాలు చేస్తారు, ఆర్తనాదాలు చేస్తారు, బయటి సాయం కోసం చూస్తారు. తమ బాధలు ప్రపంచం అంతటికీ తెలియాలని ఆశిస్తారు. తమ ప్రభుత్వం ఘనతలను పాలకులు విదేశాలలో కూడా చాటింపు వేస్తారు. ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షనాయకులు కూడా పరదేశాలలో చాటింపు వేస్తారు. ఇంటిగుట్టు అన్నది పీడకులకు ఆయుధం కాగూడదు. కుటుంబపు పరువో, కులం పరువో, దేశం పరువో చెడ్డ పనుల వల్ల పోతుంది తప్ప, చెడు రచ్చ అయినందువల్ల కాదు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-03-09T00:54:00+05:30 IST