ఈ కాలం కళాకారుడు...

ABN , First Publish Date - 2023-07-01T01:01:57+05:30 IST

తెలుగు నేల మీద ఎనభయో దశకం తర్వాత విస్మరణకు గురైన సామాజిక సమూహాల నుంచి కవులు, కళాకారులు, మేధావులు ఎదిగివచ్చారు.

ఈ కాలం కళాకారుడు...

తెలుగు నేల మీద ఎనభయో దశకం తర్వాత విస్మరణకు గురైన సామాజిక సమూహాల నుంచి కవులు, కళాకారులు, మేధావులు ఎదిగివచ్చారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక నిర్మాణంలోని అసమానతల మీద సంవాదానికి దిగారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఘనీభవించిన వాతావరణాన్ని కదలబార్చారు. మార్క్స్‌, అంబేద్కర్‌ సైద్ధాంతిక నేపథ్యం నుంచి పొందిన వీరి అధ్యయన సంస్కారం సాహిత్య నిర్మాణాన్ని ప్రశ్నించింది. సాహిత్య ఇతివృత్తం మీద మాత్రమే కాకుండా శైలి శిల్పం మీద కూడా చర్చ మొదలైన కాలమది. ఈ క్రమంలో మార్జినలైజ్డ్‌ వర్గాల భాషను, సౌందర్యాన్ని సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పరిచయం చేసారు. ఇదంతా సమాజం యధాతథస్థితి నుంచి ప్రగతి వైపు ప్రయాణించడానికి దోహదపడిరది. అయితే ఈ సంవాదానికి మూలమైన వ్యక్తులు తమ జీవితాల నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. ఈ అరుదైన వ్యక్తుల మరణం ఆ సమాజానికే తీరని లోటు. మద్దూరి నగేష్‌బాబు, పైడి తెరేష్‌బాబు, కలేకూరి ప్రసాద్‌, మద్దెల శాంతయ్య, పాటమ్మ భిక్షపతి, ఎర్ర ఊపాలి.... ఇప్పుడు సాయిచంద్‌.

సాయిచంద్‌ ఈ కాలానికి అరుదుగా లభించిన వాగ్గేయకారుడు. ఉమ్మడి పాలమూరు జిల్లా అమరచింత గ్రామంలో జన్మించాడు. కూతపెట్టు దూరంలో కృష్ణా నది మీద నిర్మించిన జూరాల ప్రాజెక్టు ఉంటుంది. కానీ గొంతులోకి నీళ్లు దిగని ప్రాంతంలో పుట్టాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నిరాశకు గురైన యువత ఆనాడు నక్సల్బరీ మార్గాన్ని ఎంచుకున్నది. ఇలాంటి అనేక ప్రభావాలలో సాయిచంద్‌ తండ్రి వెంకట్రాములు విప్లవ విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడు అయ్యాడు. ఎమర్జెన్సీ తెచ్చిన చీకటి కాలాన్ని దాటుకొని వెంకట్రాములు విప్లవ స్వప్నాన్ని కన్నాడు. తెలుగు నేలలో ఆట, పాట మీద కొనసాగిన తీవ్ర నిర్బంధ కాలంలో సాంత్వన కోసం అరుణోదయ కళాసంస్థలో చేరాడు. వెంకట్రాములు తండ్రి మాల చెన్నప్ప కోలాటం కళాకారుడు. తండ్రి గాత్రాన్ని సొంతం చేసుకున్న వెంకట్రాములు పుట్టుకతో వచ్చిన గాత్రానికి విప్లవాన్ని జోడించి విప్లవ కళాకారుడిగా మారాడు. ఇట్లా తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సాయిచంద్‌ బాల్యంలోనే కళాకారుడిగా రూపొందాడు. పై చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చి ప్రగతిశీల విద్యార్థి సంఘంలో భాగమయ్యాడు. అధ్యయనం, ఆచరణ కలపోతగా విప్లవ సంప్రదాయాన్ని ఎత్తిపట్టాడు. కానూరి తాత, గద్దర్‌, రామారావు, గోరటి వెంకన్న, విమల, నాగన్న అందించిన చైతన్యంతో పాటలోని రహస్యాన్ని తెలుసుకోగలిగినాడు.

దళిత సమాజం నుంచి ఎదిగిన సాయిచంద్‌ కంఠానికి మంద్రస్థాయిలో కూడా వీరరసాన్ని పలికించటం తెలుసు. శ్రోతకు ఏ రూపంలో సందేశాన్ని అందించాలో తెలుసు. ఉత్పత్తి వర్గాల భాషకు సౌందర్యాన్ని జోడించి విప్లవ కాల్పనికతను ప్రవేశపెట్టిన కవుల వారసత్వాన్ని సాయి పాటలోకి ప్రవేశపెట్టాడు. గాత్రానికి పరిమితం కాకుండా కవిత్వ రచన వైపు దృష్టిపెట్టి పరిణతి సాధించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో ఎం.ఏ తెలుగు చదివిన కాలంలో సాహిత్య నిర్మాణ సూత్రాలను అభ్యసించాడు. ఆ పరిజ్ఞానంతో పాట కవిత్వాన్ని పండించాడు. ఈ సందర్భంలోనే తెలంగాణ నేలమీద రాజకీయ పరిణామాలు వేగవంతమయ్యాయి. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష సాహిత్య, సాంస్కృతిక స్థాయిలో కూడా వ్యక్తం కావటం మొదలయ్యింది. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు విషయంలో సైద్ధాంతిక పరిమితులను కొన్ని రాజకీయ నిర్మాణాలు అనివార్యంగా దాటి తెలంగాణ సందోహంలోకి రాకతప్పలేదు. ఈ నేపథ్యంలోనే సాయిచంద్‌ తెలంగాణ పాటను ఎత్తుకున్నాడు.

విప్లవ సాంస్కృతికోద్యమంలో గూడ అంజయ్య రాసిన ఊరు మనదిరా పాటకు విస్తృత ప్రాచుర్యం కల్పించింది గద్దర్‌ కనుక చాలా రోజుల వరకు ఆ పాట రచయిత గద్దరే అనుకొనేవారు. ఇలాంటి మరో పోలిక తెలంగాణ ఉద్యమంలో కనిపిస్తుంది. మిట్టపల్లి సురేందర్‌ రాసిన ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ అనే పాట సాయిచంద్‌ కంఠం నుంచే ప్రాచుర్యంలోకి వచ్చింది. కనుక ఈ పాట రచయిత సాయిచందే అనేకునేవారు ఇప్పటికీ ఉన్నారు. సురేందర్‌ ఆ పాటను విప్లవోద్యమం నేపథ్యం నుంచి రాసాడు. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో యువత స్వయం హననం చేసుకుంటున్న సందర్భానికి అన్వయించి సాయిచంద్‌ పాడేవాడు. ఆ పాటను విన్నంతసేపు శ్రోతలందరూ దుఃఖానికి లోనవుతారు. ఈ శక్తి పాట రాసిన సురేందర్‌ కలానికి ఎంత ఉందో, పాడిన సాయిచంద్‌ గళానికి కూడా అంతే ఉంది. విప్లవోద్యమ సందర్భంలో లక్షలాది మందిని కదలకుండా కూర్చోబెట్టే శక్తి గద్దర్‌ పాటకు ఉండేది. బహుజనోద్యమ సమయంలో మాష్టార్జీ ఆ క్రెడిట్‌ను పొందాడు. ఇక వర్తమానంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ సభలకు వచ్చిన లక్షలాది ప్రజలను గంటల కొద్ది కూర్చోబెట్టగలిగిన శక్తి సాయిచంద్‌ గళానికి ఉంది. అందుకే సాయి ఈ కాలపు కళాకారుడు.

సాయిచంద్‌ కేవలం పాటలు పాడేవరకు పరిమితం కాలేదు. ఆయన పాట కవి కూడా. బాల్యంలోనే తల్లిని కోల్పోయి, పాటకు దగ్గరైన సాయికే తల్లి ప్రేమ విలువ అందరి కంటే ఎక్కువ తెలుసు. ‘అనురాగాల పల్లవి అమ్మ ప్రేమ/మమతల కోవెల మణిదీపం మాతృమూర్తి’ అని రాయటంలోనే అతని మాతృప్రేమ వ్యక్తమయ్యింది. పాటలోని పాదాలను ఒడుపుగా రాయగల్గటం ఆయనకే సాధ్యమేమో అనిపించేటట్లు పాటను అల్లాడు. ఒక పాదం తర్వాత మరో పాదాన్ని బరువెక్కించి శ్రోతల హృదయాన్ని జలగీతం చేసే శక్తి అతని కలానికి ఉంది. కడుపు నెలపొడుపై పూసి, గర్భసంచిని ఊగే ఊయలగా మార్చిన తల్లి ఔన్నత్యాన్ని శిఖరాయమానం చేసాడు. తెలంగాణ పల్లెను తెల్లని మల్లెపూవుతో పోల్చిన ఈ కవి, కష్టమంతా కడుపులో దాచుకొని నవ్వులను వెదజల్లే నాన్న గురించి కూడా పాటను అల్లాడు. విప్లవం, ప్రత్యేక తెలంగాణ, మానవ సంబంధాల మీదే కాకుండా, కుల వివక్ష మీద కూడా అనేక పాటలు రాసాడు. కులం గోత్రాన్ని ప్రశ్నించాడు. వాటి శాస్త్రీయత ఏమిటో నిరూపణకు రమ్మని సామాజిక సంవాదానికి దిగాడు.

సాయిచంద్‌ సున్నిత మనస్సు కలిగిన కవి. మలినమైపోతున్న మానవ సంబంధాలను నిలబెట్టుకోవడానికి తపించేవాడు. మనిషిని మనిషిగా ప్రేమించి గౌరవించే విలువకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చాడు. మనిషి మాయమైపోతున్న కాలంలో సాయిచంద్‌ లాంటి అరుదైన వ్యక్తిత్వం కోసం తపించవలసిన రోజొకటి వస్తుందేమో! జూలై ఒకటో తేది నుంచి నేను దేశవ్యాపితంగా ఉన్న విశ్వవిద్యాలయాల తెలుగు ప్రొఫెసర్లకు పునఃశ్చరణ తరగతులను ఓయూలో నిర్వహిస్తున్నాను. ఆ తరగతులలో సాయిచంద్‌ జూలై మూడున రిసోర్స్‌ పర్సన్‌గా హాజరై ‘మౌఖికపాట– సామాజిక జీవితం’ అనే అంశం మీద ఉపన్యసించవలసి ఉండింది. అంతలోపే ఆయన పాట ఆగిపోయింది. ఇప్పుడు రాతిబొమ్మల్లోన కొలువైన శివుడిని ప్రశ్నించే గొంతు కోసం ఆశగా ఎదురుచూస్తూ...

ప్రొ. చింతకింది కాశీం

ఉస్మానియా యూనివర్సిటి

Updated Date - 2023-07-01T01:01:57+05:30 IST