Share News

ఉత్తరాంధ్రకు మీ సేవలు ఏమిటి, జగన్‌?

ABN , First Publish Date - 2023-10-26T01:12:41+05:30 IST

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తామని, కర్నూల్‌లో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ అని...

ఉత్తరాంధ్రకు మీ సేవలు ఏమిటి, జగన్‌?

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తామని, కర్నూల్‌లో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ అని పేర్కొంటూ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ పరిపాలన వికేంద్రీకరణ అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం చేసి నేటికి నాలుగేళ్లు దాటింది. విచిత్రం ఏమిటంటే ఈ కాలంలో ఉత్తరాంధ్ర ఇసుమంత కూడా అభివృద్ధి సాధించలేదు సరికదా మరింత వెనుకబాటులోకే నెట్టబడింది. విశాఖ నగరంలోని రుషికొండను సిఆర్‌జెడ్‌ నిబంధనలను ధిక్కరించి తవ్వేశారు. దశపల్లా భూములను కాజేశారు. బీచ్‌ రోడ్డులోని 14 ఎకరాల కోట్లాది రూపాయల విలువైన భూమిని తమ అనుంగులకు ధారాదత్తం చేయజూస్తున్నారు. అభివృద్ధి సంగతి పక్కన పెడితే, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా నేటికీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దౌర్భాగ్యం. కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయంగా రాబట్టాల్సిన నిధులను రాబట్టలేకపోతున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయలేకపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పోరాటం చేయకుండా ఉత్తరాంధ్రను ఎలా అభివృద్ధి చేస్తారు?

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో నాటకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి విశాఖ కేంద్రంగా పని చేయడానికి, సమీక్షలు చేయడానికి కేంప్‌ ఆఫీసు ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం ఆగమేగాల మీద ఇటీవల జీవో విడుదల చేసింది. ముఖ్యమంత్రి విశాఖపట్నానికి మకాం మార్చితే ఆటోమేటిక్‌గా ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటు విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాలలో స్పష్టంగా కనబడుతోంది. ఈ రంగాల్లో వీరి పరిపాలనా కాలంలో ఏం చేశారో తెలిపి, అప్పుడు మిగిలిన విషయాలపై మాట్లాడితే సబబుగా ఉండేది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో చేసేస్తామని, దాని కోసమే విశాఖ నుంచి పాలన చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమే అవుతుంది.

అక్షరాస్యతలో ఉత్తరాంధ్ర జిల్లాలు రాష్ట్రంలోనే అధమ స్థానంలో ఉన్నాయి. వైద్య రంగంలో పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రాథమిక పాఠశాలు అనేకం మూసివేశారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఎయిడ్‌ను ఎత్తేశారు. ఫలితంగా ప్రాథమిక, ఉన్నత విద్యలు రెండూ ప్రజలకు మరింత దూరమయ్యాయి. ఇదే జీవోలో గిరిజన ప్రాంతం కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ నిరక్షరాస్యత మరింత అధికంగా ఉంది. మహిళా అక్షరాస్యత ఇంకా ఘోరం. మొత్తం ఉత్తరాంధ్రలోని ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఆసుపత్రులలో కనీస సదుపాయాలు కూడా లేవు. నేటికీ వైద్యం కోసం కిలోమీటర్లు డోలీమోతలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేసిన పలాసలోని ఉద్దానం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌–కం– సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఐదేళ్లు పూర్తికావస్తున్నా, ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంతం నుంచి అనేకమంది సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. అంటే నీటి ప్రాజెక్టుల నిర్మాణం తప్పనిసరి. కానీ విచిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో ఇక్కడ కనీసం ఒక్కటంటే ఒక్క నీటి ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. మరోపక్క రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, దానిని ప్రతిఘటించి కాపాడుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరించేలా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా విశాఖపట్నంలో సదస్సులు నిర్వహించినా, కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవు. ఈ రకంగా ఉత్తరాంధ్ర ఈ కాలంలో కూడా విద్య, వైద్యం, ఉపాధి వంటి అన్ని రంగాలలోనూ మరింత వెనుకబాటులోకే నెట్టబడింది.

వీటన్నిటికీ తోడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్రకు కూడా తీరని ద్రోహం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్నీ పదేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయలేదు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఒక ప్రహసనంలా మార్చివేసింది.


ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసు విశాఖలో ఏర్పాటు చేసే ముందు ఉత్తరాంధ్రకు వీరి పాలనా కాలంలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. సుజల స్రవంతితో పాటు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎన్ని నిధులు ఖర్చు చేశారో, రైతులకు ఏం మేలు చేశారో తెలపాలి. ఉత్తరాంధ్రలో కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలు, ఫెర్రో ఎల్లాయిస్‌, జ్యూట్‌ మిల్లులను తెరిపించడానికి ఏం చేశారు? అప్పటికే మూతపడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తెరిపించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 970 రోజులుగా పోరాటం జరుగుతున్నది. లక్ష కుటుంబాలకు పైగా ఉపాధి కల్పిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను రక్షించడంలో వీరి ప్రభుత్వ పాత్ర ఏమిటి? గంగవరం పోర్టును అదానీకి ఎందుకు ధారాదత్తం చేశారు? పైగా స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన ముడిసరుకును ఎందుకు ఆపించేశారు? విశాఖపట్నం ఏజెన్సీలో ఆదిమ తెగ ఉంది. బాగా వెనుకబడినవారు, వారి కోసమే ముఖ్యమంత్రి విశాఖపట్నంకు మకాం మారుస్తున్నారని జీవోలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవటమే కాకుండా ఆదిమ తెగ జాతులకు (పివిటిజి) అంత్యోదయ కార్డుల ద్వారా ఇచ్చే ఉచిత రేషన్‌ కొత్త కుటుంబాలకు ఎందుకు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే రుణాలు కూడా అమలు చేయడం లేదు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాల కల్పనకై ఏం చర్యలు చేపట్టారు? 1/70 చట్టానికి భిన్నంగా హైడ్రో ప్రాజెక్టు పేరున గిరిజనుల భూములను ఆరు వేల ఎకరాలు కార్పొరేట్లకు ఎందుకు ధారపోస్తున్నారు? ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా 6,116 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా ఎందుకు లాక్కున్నారు? రైల్వేజోన్‌, వాల్తేరు డివిజన్‌, మెట్రోరైలు, గిరిజన యూనివర్శిటీ వంటి విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం ఏం ప్రయత్నం చేసారు?

ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అలా కాకుండా విశాఖపట్నం మకాం మార్చడమంటే, ఉత్తరాంధ్రలో ఉండే కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దోచుకోవడానికి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ చేయాలి, నిధులు మంజూరు చేయాలి. కానీ జగన్‌ ప్రభుత్వం పంచాయతీలకు, ఎన్నికైన స్థానిక సంస్థలకున్న హక్కులనే హరించి వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. గిరిజన ప్రాంతాలలో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వరంగ సంస్థలను రక్షించడంతో పాటు, ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

కె. లోకనాధం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

Updated Date - 2023-10-26T01:12:41+05:30 IST