ప్రభుత్వాలే సుప్రీం
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:11 AM
అక్కడ వేరొకరు గనుక ఉండివుంటే, ఇన్నిమాటలు పడ్డాక కూడా ఇంకా ఆ కుర్చీని పట్టుకొనివేలాడేవారు కాదు. తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఈ తరహా వ్యాఖ్యలు ..

అక్కడ వేరొకరు గనుక ఉండివుంటే, ఇన్నిమాటలు పడ్డాక కూడా ఇంకా ఆ కుర్చీని పట్టుకొనివేలాడేవారు కాదు. తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఈ తరహా వ్యాఖ్యలు అనేకం వినబడుతున్నాయి. రవి తక్షణమే రాజీనామా చేయాలని డిఎంకె నాయకులు అనడమే కాదు, ఇంకా కొనసాగడం ఆయనకంటే ఆ పదవికే అవమానకరమన్న వ్యాఖ్యలు ప్రజాస్వామికవాదులనుంచి, రాజ్యాంగం మీద గౌరవాభిమానాలున్నవారినుంచి కూడా వినబడుతున్నాయి. న్యాయస్థానాలనుంచి ఈ తరహా తీర్పులు, కఠిన వ్యాఖ్యలు నిజంగానే విపక్షపాలిత గవర్నర్లను అవమాన భారంతో కుదిపేయగలిగితే రవి వంటివారి ఆవిర్భావమే ఉండేది కాదు. గవర్నర్ స్థాయిలో ఉన్నవారికి రాజ్యాంగబద్ధంగా నడుచుకోమని పదేపదే చెప్పాల్సిరావడం నిజానికి సర్వోన్నత న్యాయస్థానానికే పెద్ద పరీక్ష.
ఇది తమిళనాడు గవర్నర్‌కు మాత్రమే పరిమితమైన తీర్పు కాదు. విపక్షపాలిత రాష్ట్రాల్లో రవి తరహా గవర్నర్లు పెడుతున్న బాధలను అనుభవిస్తున్న పార్టీలకు ఈ తీర్పు ఎక్కడలేని శక్తినీ, ఉత్సాహాన్నీ ఇచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు అతీతులమన్న తరహాలో వ్యవహరిస్తున్న గవర్నర్లకు ఘాటైన హెచ్చరిక ఇది. వారి అధికారాలను, పరిధినీ, పాటించాల్సిన ధర్మాన్నీ గుర్తుచేస్తూ, లక్ష్మణరేఖ దాటవద్దని చెబుతున్న తీర్పు ఇది. రాజ్యాంగం ఆశయాలను ఎత్తిపడుతూ, ఫెడరల్ వ్యవస్థను పునాది దిట్టం చేసేందుకు ఈ తీర్పు ఉపకరిస్తుంది. ఓ పది బిల్లులను రాష్ట్రపతికి నివేదించడంలో సదరు గవర్నర్ కుట్రను తప్పుబట్టడానికే సుప్రీంకోర్టు పరిమితం కాలేదు. నిర్దిష్టకాలపరిమితిలో ఆమోదించకుండా, శాసనసభ రెండోసారి పంపినా సంతకం చేయకుండా ఆ గవర్నర్ కుట్రలు చేసిన బిల్లులమీద సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుంది. గవర్నర్ చర్యలన్నింటినీ రద్దుపరిచి, 142వ అధికరణద్వారా తనకు దఖలుపడిన ప్రత్యేకాధికారాలను అందుకు వినియోగించుకుంది. అసెంబ్లీ రెండవసారి పంపిన బిల్లులను సైతం ఆమోదించకుండా, వాటిని రాష్ట్రపతికి నివేదించి గవర్నర్ అతితెలివి ప్రదర్శిస్తే, దానినే గడువుగా తీసుకొని ఆ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టుగా కోర్టు నిర్ధారించడం సముచితమైన చర్య. దుష్ట చేష్టలను వమ్ముచేయాలన్నా, కృత్రిమ సంక్షోభాలను పరిష్కరించాలన్నా ఈ తరహా సాహసోపేతమైన నిర్ణయాలు తప్పవు. ఇలా, గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లులు చట్టాలు కావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
బిల్లు ఆమోదానికి నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడం రవి తరహా గవర్నర్లకు అధికారపక్షాన్ని వేధించడానికి బ్రహ్మాస్త్రంలాగా ఉపకరిస్తోంది. ఇప్పుడు, ఆమోదానికీ, తిరస్కారానికీ, రాష్ట్రపతి నివేదనకు కాలపరిమితులు విధించడం, ఏ ముచ్చటైనా మూడునెలల్లో జరగాలని కోర్టు శాసించడం బాగుంది. మళ్ళీ తనముందుకు మరోమారు యథాతథంగా వచ్చిన బిల్లును నెలరోజుల్లోగానే ఆమోదించాలనడం, ఆమోదం పొందినట్టుగానే పరిగణించాలనడం సముచితంగా ఉంది. ఈ కాలపరిమితులను దాటితే గవర్నర్ల చర్యలు న్యాయసమీక్షకు నిలవాల్సివస్తుందన్న హెచ్చరిక అవసరమైనదే. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న రవివంటివారి వల్లనే ఆ ఉన్నత వ్యవస్థకు సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువులు విధించాల్సి వచ్చింది. ఇప్పటికే పలుమార్లు హితవులు చెప్పినా, హెచ్చరించినా నడవడిక మార్చుకోకుండా రాజ్యాంగాతీత శక్తులుగా తయారైనవారిని ఇలా దారికితేవాల్సి వస్తున్నది.
కేంద్రప్రభుత్వం నియమించే గవర్నర్లకంటే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే ఉన్నతమైనవని కోర్టు తేల్చింది. మీకు వీటో అధికారాలు లేవు అంటూ, రాష్ట్ర ప్రభుత్వాలకు, వాటిని ఎన్నుకున్న ప్రజలకు గవర్నర్‌లు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. తాము ఏదో పైనుంచి దిగివచ్చినట్టుగా, ప్రత్యేకాధికారాలు ఉన్నట్టుగా వ్యవహరిస్తూ, ఎన్నికల్లో నెగ్గివచ్చిన విపక్షపార్టీల ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతున్న గవర్నర్లకు ఈ తీర్పులో సరిపడినన్ని చీవాట్లున్నాయి. రాజ్యాంగస్ఫూర్తితో పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు మిత్రుడిగా, మార్గదర్శిగా వ్యవహరించాలంటూ చెప్పిన బోలెడు హితవులూ ఉన్నాయి. ప్రజాస్వామ్యానికీ, సమాఖ్యవ్యవస్థకు సత్తువనిచ్చే తీర్పు ఇది. రవి తరహాలో పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించే గవర్నర్లందరికీ చెంపపెట్టు. అటువంటి వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ, భుజం తట్టి ప్రోత్సహిస్తూ, ప్రమోషన్లు ఇస్తున్న ఢిల్లీ పెద్దలకు ఎదురుదెబ్బ.
ఈ వార్తలు కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News