Education: పిల్లల చదువుపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
ABN, First Publish Date - 2023-03-03T11:14:08+05:30
పిల్లలను కేవలం చదువులకే పరిమితం చేసి, కనీస స్వేచ్ఛను, సంస్కృతి, సంప్రదాయాలను వారికి తెలియకుండా, వారి వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇటు ఇంట్లో, అటు
తల్లిదండ్రులు ఫ్రెండ్స్‌లా మెలగాలి
హైదరాబాద్, నార్సింగ్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పిల్లలను కేవలం చదువులకే పరిమితం చేసి, కనీస స్వేచ్ఛను, సంస్కృతి, సంప్రదాయాలను వారికి తెలియకుండా, వారి వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇటు ఇంట్లో, అటు విద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు వారిని మానసికంగా కృంగదీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల మనస్తత్వానికి అనుగుణంగా వారికి అండ లేకపోవడం, తీరా మరణమే శరణ్యం అనుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పిల్లలు ఏం చదువుతారు? ఎలా చదవాలనుకుంటున్నారు?, భవిష్యత్‌లో వారు ఎలా ఉండాలనుకుంటున్నారు? అన్నదానిపై తల్లిదండ్రులు పూర్తిగా తెలుసుకొని వారిపై ఒత్తిడి లేకుండా పిల్లలకు తల్లిదండ్రులుగా తమ వంతు బాధ్యత వహించినప్పుడే ఈ ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా విద్యార్థుల ఆత్మహత్యలు, మిస్సింగ్‌లపై, వీటిని వారించే మార్గాలపై పలువురి ప్రముఖుల స్పందన వారి మాటల్లోనే..
తల్లిదండ్రుల కోరికలు.. పిల్లలపై...
చాలా మంది తల్లిదండ్రులు తమ కోరికలను పిల్లలపై రుద్దుతున్నారు. వారిని ఒత్తిడికి గురిచేసి మరీ చదివించాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది పిల్లలు మానసిక ఒత్తిడికి, మానసిక బలహీనతకు లోనవుతున్నారు. పిల్లల బాల్యం హరించిపోతుంది. వారిలో అనిశ్చితి స్థితి ఏర్పడుతుంది. చెడు వ్యసనాలకు, పాశ్చాత్య సంస్కృతికి బానిసవడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడికి గురిచేయకుండా చూసుకోవాలి.
- సుభాషిణి, డిప్యూటీ సీఈఓ, మెదక్ జిల్లా పరిషత్
ప్రవర్తనను గమనిస్తుండాలి
ప్రస్తుతకాలంలో పిల్లలపై టీవీషోలు, సినిమాల ప్రభావం ఎక్కువుగా ఉంటోంది. వీటివల్ల వారు చెడలవాట్లకు గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వారితో కలిసి మెలిసి గడపాలి. పిల్లలను ఒత్తిడికి గురిచేసి చదివించాలని ప్రయత్నించవద్దు. వారు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి.
- డాక్టర్ ప్రొఫెసర్ రవిచందర్, ఎంజీఐటీ కళాశాల
బాధ్యతగా ఉండాలి
నేడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను గాలికి వదిలేస్తున్నారు. పాఠశాలకు వెళ్లి ఏం చదువుతున్నారు అన్న విషయాలపై తల్లిదండ్రులకు ఎలాంటి శ్రద్ధ ఉండడం లేదు. కేవలం వారిపై ఒత్తిడి పెంచడం, మంచి మార్కులు తేవాలని వారిని ప్రేరేపించడం చేస్తున్నారు. తమ పిల్లలు ఏం చదువుతున్నారో, దేనిపై ఇష్టపడుతున్నారో, ఎలాంటి ఆటల్లో శ్రద్ధ చూపుతున్నరన్నదానిపై తెలుసుకోవడం తల్లిదండ్రులు పూర్తిగా మరిచారు. పిల్లలను మంచి మార్గంలో ఉంచాలంటే కేవలం తల్లిదండ్రులే బాధ్యత వహించాలి.
- డాక్టర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, ఎంజీఐటీ కళాశాల
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషిచేయాలి. వారికి విద్యతోపాటు పలు అంశాలపై కూడా ఆసక్తిని పెంపొందించాలి. యోగా, వ్యాయామం, క్రీడలు, పాటల్లో ప్రోత్సహించాలి. వీటన్నింటిలో వారిని ప్రోత్సహించడం వల్ల వారు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. చదువుతో పాటు అన్నిరంగాల్లో కూడా వారు చురుకుగా ఉంటారు. చిన్ననాటి నుంచే వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడం వల్ల ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఒత్తిడికి గురిచేయడం వల్ల తల్లిదండ్రులపై, ఉపాధ్యాయులపై అసహనం పెరుగుతుంది.
- రేవతి, రిటైర్డ్ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు
నిపుణులతో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించాలి
మొదటగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఒత్తిడికి గురిచేయవద్దు. కళాశాల యాజమాన్యాలూ విద్యార్థులపై ర్యాంకుల పోరు తగ్గించాలి. కళాశాల గదిలో ఉన్న విద్యార్థులందరూ ఒకే రకంగా ఉండరు. విద్యార్థులకు అప్పుడప్పుడు నిపుణులచే కౌన్సెలింగ్ తరగతులు నిర్వహించాలి. వారు ఏం చదువుతున్నారు. తమ చదువువల్ల భవిష్యత్‌లో ఎలా ఎదుగుతారు. తనపై తల్లిదండ్రులకు ఉన్న నమ్మకం ఏమిటి, తన తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు. ఒత్తిడికి గురవుతున్నారా, కళాశాలల్లో తోటి విద్యార్థులతో పోటీపడుతున్నారా అన్న అంశాలపై సై కాలజీ నిపుణులతో అప్పుడప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్పించాలి. అప్పుడే విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గుతాయి.
- భీమ్‌రెడ్డి, ఉపాధ్యాయు సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
బీజీలైఫ్‌లో పిల్లలను పట్టించుకోవడం లేదు
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నారే తప్ప వారు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించడం లేదు. కళాశాలల్లో ఫీజులు చెల్లించి, పిల్లలను చేర్చి అనంతరం వారు కళాశాలలకు వెళుతున్నారా, చెడు అలవాట్లుకు గురవుతున్నారా, ఏం చేస్తున్నారని గమనించడం లేదు. దీనివల్ల చాలా మంది పిల్లలు చెడు స్నేహాల కారణంగా చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. వారితో స్నేహంగా మెలగాలి.
- విజయ్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు, నార్సింగ్ జడ్పీ స్కూల్
పిల్లలు పట్ల శ్రద్ధ వహించాలి
తల్లిదండ్రులు పిల్లలకు పాఠశాలలు, కళాశాలలకు ఫీజులు చెల్లించి తమ బాధ్యత అయిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా పాఠశాలల్లో పిల్లలను ఒత్తిడికి గురిచేసి, మరీ విద్యను బోధిస్తున్నారు. దీంతో నిర్బంధ విద్యకు పిల్లలు గురవుతున్నారు. దీనివల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి బాగోగులు రోజూ అడిగి తెలుసుకోవాలి. వారితో సమయం గడపాలి.
- టి.ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్యే, రాజేంద్రనగర్
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి
తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుల విషయంలో పూర్తిస్థాయిలో ఒత్తిడిని తగ్గించాలి. ప్రస్తుతం ఎల్‌కేజీ నుంచే చిన్న పిల్లలను ఇంటి నుంచి ఉదయం ఏడు, 8 గంటలకే పంపించి సాయంత్రం వరకు పాఠశాల గదుల్లో ఉంచుతున్నారు. దీంతో చిన్నప్పటి నుంచే ఆ పిల్లలు తెలివివచ్చే సరికి ఆ గదులకే పరిమితం అవుతున్నారు. తల్లిదండ్రులను గౌరవించడం, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం, ఆటలు, పాటలకు దూరంగా ఉంచడం, వారి మనస్థాపానికి పునాదిరాళ్లు పడుతున్నాయి. ఇక పాఠశాల దశ దాటగానే కళాశాల స్థాయికి వచ్చే సరికి వారిపై పోటీ తత్వాన్ని రుద్దుతుండడంతో విద్యార్థులకు సమాజ అవగాహన పూర్తిగా లేకుండా పోతోంది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నారు. ఇలాంటి మనస్తాపాల నుంచి విద్యార్థులను బయటపడేసినప్పుడే ఆత్మహత్యలు, మిస్సింగ్‌లు తగ్గుముఖం పడతాయి.
- మహ్మద్ కౌసర్ మోహియుద్దిన్, ఎమ్మెల్యే కార్వాన్
పోటీతత్వం మానాలి
చదువుల పేరుతో తమ పిల్లలను రెచ్చగొట్టడం, ఎదుటి విద్యార్థులతో పోటీపడమని ఉసిగొల్పడం లాంటివి తల్లిదండ్రులు మానుకోవాలి. తొమ్మిదో తరగతి స్థాయి నుంచే పిల్లలు చదివే సబ్జెక్టులు, వాటిపై చూపుతున్న వారి ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించాలి. ఏ సబ్జెక్టులో అతనికి ఇష్టం ఉంటుందో అదే సబ్జెక్టుపై తల్లిదండ్రులు విద్యార్థికి అండగా ఉండి ముందుకు తీసుకెళ్లాలి. కళాశాల స్థాయి వెళ్లేసరికి తమ పిల్లల మనస్సులో ఉన్న విషయాలన్నింటిపై తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఏ కోర్సులు అంటే ఇష్టం, భవిష్యత్తులో ఎలాంటి రంగాన్ని ఎంచుకుంటున్నారన్నదానిపై తల్లిదండ్రులు మొదటగా తమ పిల్లలతో ప్రేమభావకంగా అడిగి తెలుసుకోవాలి. పిల్లలు అభిరుచికి తగ్గట్లే చదువు చెప్పించాలి. మంచి చదువులు చదివి ఇటు తల్లిదండ్రులకు, గురువకుల మంచి పేరుతేవాలని సూచించాలే తప్ప ఎదుటి విద్యార్థులతో పోటీపడే లక్షణాలను మానుకోవాలి.
- సీతారాం దూళిపాళ్ల, అధ్యక్షుడు, మణికొండ ఆల్ కాలనీ ఫెడరేషన్
ఇది కూడా చదవండి: పాపం.. ఈ 21 ఏళ్ల యువతికి ఎంత కష్టమొచ్చింది..? కేన్సర్ ట్రీట్మెంట్ కోసం నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టి మరీ..
Updated Date - 2023-03-03T11:14:08+05:30 IST