TSPSC: 783 పోస్టులకు ఎంత పోటీ ఉందంటే..!
ABN, First Publish Date - 2023-03-01T11:29:02+05:30
పరీక్షలకు వారం రోజుల ముందు అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు
ఆగస్టు 29, 30న గ్రూపు-2 పరీక్షలు
783 పోస్టులు... 5,51,943 మంది పోటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): గ్రూపు-2 పరీక్షలను (Group-2 Exam) ఆగస్టు 29, 30వ తేదీల్లో నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (TSPSC) నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం సుమారు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సుమారు 705 మంది పోటీ పడుతున్నారు. పరీక్షలో ప్రతిభ కనపరచిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పరీక్షలకు వారం రోజుల ముందు అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్ష
మార్చి 6 నుంచి మే 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
కేయూ క్యాంపస్, ఫిబ్రవరి 28: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల కోసం నిర్వహించే ఐసెట్-23 నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కేయూ వీసీ ప్రొఫెసర్ టి.రమేశ్, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, రిజిస్ట్రార్ శ్రీనివాసరావులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు ఐసెట్ వివరాలను వెల్లడించారు. ఐసెట్ దరఖాస్తులను మార్చి 6 నుంచి మే 6 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 18 వరకు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు రూ.550, ఇతర వర్గాల వారు రూ.750 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలని వివరించారు. మే 22 నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. మే 26, 27 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. జూన్ 5న ప్రిలిమినరీ కీ ఇస్తామని, 8 వరకు కీపై అభ్యంతరాలను స్వీకరిస్తామని, తుది ఫలితాలను 20న వెల్లడిస్తామని వివరించారు. పరీక్ష సిలబస్, మాదిరి ప్రశ్నాపత్రాలు, మాక్ టెస్ట్ వివరాలు వెబ్‌సైట్ icet.tsche.ac.inలో ఉన్నాయని తెలిపారు. వివరాలకు 0870-2958088, 0870-2439088 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Updated Date - 2023-03-01T11:47:43+05:30 IST