Inter Board: ప్రైవేటుకు ముకుతాడు! వేధిస్తే శాశ్వతంగా రద్దే!
ABN, First Publish Date - 2023-03-11T12:33:15+05:30
ప్రైవేటు కళాశాలల (Private colleges) నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవి జారీ చేసే ప్రకటనల్ని కూడా ఈ కమిటీ పర్యవేక్షించేలా చర్యల్ని
ఇంటర్మీడియట్ కళాశాలల పర్యవేక్షణకు కమిటీ
విద్యార్థులను వేధిస్తే అనుమతి రద్దు
ప్రకటనలపై నియంత్రణ.. ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు కళాశాలల (Private colleges) నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవి జారీ చేసే ప్రకటనల్ని కూడా ఈ కమిటీ పర్యవేక్షించేలా చర్యల్ని తీసుకోనున్నారు. ఈమేరకు ఇంటర్మీడియట్ బోర్డు (Inter Board) అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం (Telangana Govt.) ఆమోదించిన వెంటనే తగు చర్యల్ని తీసుకోనున్నారు. కొన్ని కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. దాంతో విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక కొన్నిసార్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కళాశాలలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నది. విద్యార్థులను వేధిస్తున్నట్టు నిరూపణ అయితే.. సదరు కళాశాల అనుమతి శాశ్వతంగా రద్దు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈమేరకు నార్సింగ్‌లోని ఒక కార్పొరేట్ కళాశాల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేశారు. అలాగే కళాశాలలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగే ఈ కమిటీలో కార్పొరేట్ కళాశాలల ప్రతినిధి, జూనియర్ కళాశాలల ప్రతినిధులు భాగస్వామ్యం కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. ఫలితాల వెల్లడి సమయంలో, విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఆయా కళాశాలలు భారీగా ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ర్యాంకుల పేరిట ప్రకటనలు ఇవ్వకూడదు. కళాశాలల పేరిట కూడా నేరుగా ప్రకటనలు ఇవ్వడానికి అవకాశం లేదు. ఇవేమీ పట్టించుకోకుండా కళాశాలలు ప్రతీసారి భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేస్తున్నాయి. దీన్ని నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడే కమిటీ అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రకటనలు జారీ చేసేలా చర్యల్ని తీసుకుంటున్నారు. ఇంటర్ బోర్డు జారీ చేసే అడ్మిషన్ల షెడ్యూల్‌తో సంబంధం లేకుండానే పీఆర్‌వో వ్యవస్థ ద్వారా ఆయా కళాశాలలు తమ అడ్మిషన్లను ముందుగానే పూర్తి చేసుకుంటున్నాయి. దీన్ని కూడా నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cheetah: రైలు ఇంజిన్‌పై చిరుత.. పడుకుందేమో అని అనుకున్నారు.. భయంభయంగానే వెళ్లి చూస్తే..
Updated Date - 2023-03-11T12:33:15+05:30 IST