Teachers transfers ఎప్పుడయ్యేను? ఇప్పట్లో కష్టమేనా..!?
ABN, First Publish Date - 2023-02-22T12:44:10+05:30
ఓవైపు కోర్టులో కేసులుండడం, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC elections), పరీక్షలు, వేసవి సెలవులు వరుసగా వస్తుండడంతో ఉపాధ్యాయుల బదిలీలపై (Teachers transfers) సందిగ్ధం
ప్రభుత్వంపై ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి..
కోర్టులో స్టేను ఎత్తేయాలని డిమాండ్
ఎమ్మెల్సీ ఎన్నికలు.. పరీక్షలు.. వేసవి సెలవులు
మార్చి 14 దాకా స్టే విధించిన హైకోర్టు
ఏం చేయాలని తల పట్టుకుంటున్న అధికారులు
బదిలీ కోసం ఇప్పటికే 72 వేల మంది దరఖాస్తు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఓవైపు కోర్టులో కేసులుండడం, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC elections), పరీక్షలు, వేసవి సెలవులు వరుసగా వస్తుండడంతో ఉపాధ్యాయుల బదిలీలపై (Teachers transfers) సందిగ్ధం నెలకొంది. బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేస్తుండడం, అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలియని పరిస్థితులు నెలకొనడంతో ఏ నిర్ణయమూ తీసుకోలేక అధికారులు తల పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం ప్రభుత్వం గత నెలలో షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. మొదటి దశలో సుమారు 59 వేల దరఖాస్తులు వచ్చాయి. అనంతరం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పించారు. వారికి ఈ నెల 12 నుంచి 14వ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువిచ్చారు. ఈ గడువులో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,904 ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా రెండు దశల్లో కలిపి మొత్తం 72 వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నాన్ స్పౌజ్ టీచర్లు కోర్టుకు వెళ్లి బదిలీల ప్రక్రియపై స్టే తీసుకొచ్చారు. మార్చి 14 వరకు కోర్టు స్టే ఇవ్వగా.. స్టేను ఎత్తివేయించి బదిలీ ప్రక్రియను కొనసాగించాలని ఉపాధ్యాయల సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాన ఉపాధ్యాయ సంఘాల తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ మార్చి 13న జరుగనుంది. ఈ పోలింగ్ లోపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పూర్తి చేయగలిగితే.. తాము ఎక్కువ ఓట్లు సాధించడానికి అవకాశం ఉంటుందని ఆయా సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే కోర్టులో స్టేను ఎత్తివేయించేలా చర్యలు తీసుకోవాలని, బదిలీలు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.
పరీక్షల సమయంలో బదిలీలు కష్టమే..
ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పదో తరగతి (10th class) వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ సమయంలో బదిలీల ప్రక్రియ చేపట్టే అవకాశం తక్కువ. అనంతరం ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు (Summer holidays) అమల్లోకి రానున్నాయి. ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే.. వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పటికీ కోర్టులో కేసు తేలకపోతే బదిలీలు, పదోన్నతుల పరిస్థితేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టారు. తర్వాత 2018లో కేవలం బదిలీలు మాత్రమే చేశారు. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు ఖాళీలను బట్టి ఎప్పటికప్పుడు పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో ఏడేళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులు లేవు. నాలుగేళ్లుగా బదిలీలు కూడా చేయడం లేదు. రాష్ట్రంలో బదిలీల ద్వారా సుమారు 40 వేల మంది ఉపాధ్యాయులు స్థానచలనానికి గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏక కాలంలో బదిలీలు, పదోన్నతులు చేపడుతుండడంతో బదిలీలకు గురయ్యే ఉపాధ్యాయుల సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: బైక్పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!
బదిలీలకు 75 శాతం మంది అర్హులు..
రాష్ట్రం (Telangana) లో ప్రస్తుతం 1,05,164 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 75 శాతం మంది ఉపాధ్యాయులు బదిలీలకు అర్హులవుతారని భావిస్తున్నారు. 2018లో నిర్వహించిన బదిలీల సమయంలో మొత్తం 72 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సుమారు 45 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలకు గురయ్యారు. ఈసారి కూడా అదే స్థాయిలో అంటే.. 72 వేల మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం 2వేల హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే.. ఒకే స్కూల్లో 8 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న హెచ్ఎంలు 800 మంది వరకు ఉన్నారు. దాంతో ఖాళీ పోస్టులతోపాటు ఈ 800 మందిని పరిగణనలోకి తీసుకుంటే... మొత్తం 2,800 హెచ్ఎం పోస్టులు బదిలీ కోసం ఖాళీగా ఉంటాయి. ఇక 7,111 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70 శాతం పోస్టులను ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి భర్తీ చేయనున్నారు. అలాగే.. ఎనిమిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు సుమారు 3 వేల మంది వరకు ఉన్నారు. దాంతో బదిలీల కోసం సుమారు 7 వేల ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఇవే కాకుండా మరో 9 వేల ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల్లోకి బదిలీపై రావడానికి ఉపాధ్యాయులకు అవకాశం ఉంది.
Updated Date - 2023-02-22T12:44:11+05:30 IST