TS High Court: పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరును తూర్పారబట్టిన హైకోర్టు
ABN, First Publish Date - 2023-09-28T11:58:27+05:30
టీఎస్‌పీఎస్సీ గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2.83 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారి బయోమెట్రిక్‌ను సేకరించారు. ఈ ఏడాది జూన్‌లో రెండోసారి 2.33 లక్షల మందే హాజరయ్యారు. 50 వేలు చిన్న సంఖ్య కాదు. ఆ 50 వేల మందికి టీఎస్‌పీఎస్సీపై విశ్వాసం
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు సబబే
సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్
నోటిఫికేషన్ ప్రకారం మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందే..
మొదటిసారి ప్రిలిమ్స్‌కు రెండోసారికి 50 వేల మంది తగ్గారు
అంటే 50 వేల మంది అభ్యర్థుల విశ్వాసాన్ని టీఎస్‌పీఎస్సీ కోల్పోయింది..
వారంతా భవిష్యత్తును కోల్పోయినట్లేగా?
తొలుత 2.83 లక్షల మందికి బయోమెట్రిక్ తీసుకున్నారు..
రెండోసారి 2.33 లక్షల మందికి ఎందుకు తీసుకోలేదు?
రాజ్యాంగబద్ధ సంస్థ వైఖరి ఎందుకు మారింది?..
అభ్యర్థులతో సమానంగా కమిషన్‌కూ నోటిఫికేషన్ వర్తిస్తుంది
ఇంపర్సనేషన్‌కు అవకాశం ఉంది..
పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరును తూర్పారబట్టిన హైకోర్టు
లాజిస్టిక్స్, మానవ వనరుల కొరత వల్లే: టీఎస్‌పీఎస్సీ
టీఎస్‌పీఎస్సీ గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2.83 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారి బయోమెట్రిక్‌ను సేకరించారు. ఈ ఏడాది జూన్‌లో రెండోసారి 2.33 లక్షల మందే హాజరయ్యారు. 50 వేలు చిన్న సంఖ్య కాదు. ఆ 50 వేల మందికి టీఎస్‌పీఎస్సీపై విశ్వాసం కోల్పోవడం వల్లే రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్‌కు హాజరవ్వలేదు. ఎనిమిది నెలల వ్యవధిలోనే రాజ్యాంగబద్ధ సంస్థ బయోమెట్రిక్ విషయంలో వైఖరిని ఎందుకు మార్చుకుంది? టీఎస్‌పీఎస్సీ వల్ల నిర్వహణ సాధ్యం కాదనే భావనతో ఆ 50 వేల మంది పరీక్షకు హాజరుకాలేదు. వారి భవిష్యత్‌తో టీఎస్‌పీఎస్సీ చెలగాటమాడింది. ఇలాంటి చర్యలతో ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
- హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, టీఎ్‌సపీఎస్సీకి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 11న జరిగిన ప్రిలిమ్స్‌ను రద్దుచేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా నిర్వహించిన పరీక్షను రద్దు చేయడం సబబేనని వ్యాఖ్యానించింది. నిబంధనల ప్రకారం మరోసారి ప్రిలిమ్స్‌ను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి రద్దయిన పరీక్షను రెండోసారి నిర్వహించేప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన టీఎ్‌సపీఎస్సీ.. తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీఎ్‌సపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ టీఎ్‌సపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్ పిటిషన్‌పై జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీఎ్‌సపీఎస్సీ నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టింది. ముఖ్యంగా.. గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2.83 లక్షల మంది అభ్యర్థులు హాజరైతే..
ఈ ఏడాది జూన్ 11న రెండోసారి నిర్వహించిన పరీక్షను 2.33 లక్షల మందే రాశారని, అంటే.. కమిషన్ 50 వేల మంది విశ్వాసాన్ని కోల్పోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘మొదటి సారి పరీక్షలో బయోమెట్రిక్ తీసుకున్న రాజ్యాంగబద్ధ సంస్థ(టీఎ్‌సపీఎస్సీ).. కేవలం 8 నెలల్లోనే తన వైఖరిని ఎందుకు మార్చుకుంది? ఇందుకు కారణాలేంటి?’’ అని నిలదీసింది. ‘హేమలత వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు’ కేసులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని.. వాటిని మార్చడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. నిబంధనలు అభ్యర్థులతో సమానంగా కమిషన్‌కు సైతం వర్తిస్థాయని స్పష్టం చేసింది. 258 మంది ఓఎంఆర్ షీట్‌లు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఇంపర్సనేషన్ అవకాశం ఉందని.. ఈ మేరకు అభ్యర్థుల మదిలో అనుమానం ఉండిపోయిందని పేర్కొంది. మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో ఎంపిక జరగనున్న నేపథ్యంలో అధికంగా వచ్చిన 258 మంది వల్ల మెరిట్ కలిగిన అభ్యర్థులు అనర్హులైతే.. అన్యాయం జరిగిన అభ్యర్థుల పరిస్థితి ఏంటన్న పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. టీఎ్‌సపీఎస్సీ అప్పీల్‌ను కొట్టివేసింది.
ఆ 258 మంది ఎవరు?
పరీక్ష నిర్వహించిన 17 రోజుల తర్వాత మొత్తం అభ్యర్థుల సంఖ్యలో 258 పెరిగిందని.. వెబ్‌నోట్‌లో 258 ఓఎంఆర్ షీట్‌లు ఎలా పెరుగుతాయని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది గిరిధర్ రావు, న్యాయవాది బొమ్మగాని నర్సింగ్ నిలదీశారు. ఆ 258 మంది ఎవరని ప్రశ్నించారు. గ్రూప్-1లో తప్పు జరిగిందని తెలుసుకున్న టీఎ్‌సపీఎస్సీ.. గ్రూప్-4 పరీక్షకు అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసిందని.. సవరణ జారీచేసినా ఆ పరీక్షను సమర్థంగా నిర్వహించలేకపోయిందని.. అందులో కూడా లెక్కల్లో తేడాలున్నాయని ఆరోపించారు. ఇంపర్సనేషన్‌కు అవకాశం ఉన్నప్పుడు.. ఆ పరీక్ష(గ్రూ్‌ప-4)ను కొనసాగించడం అక్రమమని పేర్కొన్నారు. పేపర్-1, పేపర్-2కు సంబంధించిన ఓఎంఆర్ షీట్లలో ఇద్దరు ఇన్విజిలేటర్లు సంతకాలు చేయాల్సి ఉండగా.. కొన్ని చోట్ల ఒకరి సంతకాలే ఉన్నాయని గుర్తుచేశారు. దీనివల్ల నామినల్ రోల్స్ చెకింగ్, ఫొటో, సంతకాల గుర్తింపు సరిగా జరగలేదని పేర్కొన్నారు. సంతకాల్లో తేడాలను ఎక్కడా గుర్తించలేకపోయారని చెప్పారు.
లాజిస్టిక్స్, మానవ వనరుల కొరత: టీఎ్‌సపీఎస్సీ
రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ సందర్భంగా లాజిస్టిక్స్, సాంకేతిక సమస్యలు, మానవ వనరుల కొరత వల్లే బయోమెట్రిక్ తీసుకోలేదని.. తమ విచక్షణ మేరకు ఫొటో ఐడెంటిటీ కార్డు చెకింగ్‌తో పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు టీఎ్‌సపీఎస్సీ పేర్కొంది. కమిషన్ తరఫున ఏజీ బి.ఎ్‌స.ప్రసాద్ వాదనలను వినిపిస్తూ.. 258 మంది ఇంపర్సనేషన్ జరిగిందనే వాదన సరికాదని.. పరీక్ష ముగిసిన వెంటనే టెలిఫోన్ ద్వారా మొదటిరోజు వివరాలు సేకరించామని చెప్పారు. ఆ తర్వాత అన్ని ఓఎంఆర్ షీట్లు వచ్చిన తర్వాత మొత్తం సంఖ్యను వెబ్‌నోట్ ద్వారా వెల్లడించామని పేర్కొన్నారు. 258 ఓఎంఆర్ షీట్లు అదనంగా వచ్చాయన్నదని సరికాదని.. ఇంపర్సనేషన్ అనేది కేవలం ఊహాజనితమేనని.. కేవలం ముగ్గురు అభ్యర్థుల ఆరోపణల ఆధారంగా మొత్తం పరీక్షను రద్దుచేస్తే లక్షల మందికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ‘సచిన్‌కుమార్’ కేసులో ఆరోపణల ఆధారంగా పరీక్ష రద్దు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. బయోమెట్రిక్ తీసుకోవడం లేదని హాల్‌టికెట్‌లో స్పష్టంగా చెప్పామని.. చివరి నిమిషంలో వచ్చే అభ్యర్థులను గేటు వద్దే ఆపి, బయోమెట్రిక్ తీసుకోవడం సాధ్యం కాదనే.. ప్రత్యామ్నాయ విధానాలను ఎంచుకున్నట్లు తెలిపారు. ఏ దశలోనైనా ఏ నిబంధనలనైనా మార్చే అధికారం తమకుందని.. ఆ విషయాన్ని నోటిఫికేషన్‌లోనే చెప్పామని పేర్కొన్నారు. కాగా డివిజన్ బెంచ్ తీర్పు ప్రతులు అందిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలా? లేదా? అనే అంశాన్ని టీఎ్‌సపీఎస్సీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గ్రూప్- 1పై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకం: మధుయాష్కీ
హైదరాబాద్: గ్రూప్ - 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువత జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి పరీక్ష రాయడానికి విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాల ని, వయో పరిమితిని సడలించాలని కోరారు. కోర్టు తీర్పుకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బల్మూరి వెంకట్ మాట్లాడుతూ టీఎ్‌సపీఎస్సీలో అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందన్నారు. టీఎ్‌సపీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని చెబుతున్న ప్రభుత్వం.. సీబీఐ దర్యాప్తుకు ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నించారు.
Updated Date - 2023-09-28T11:58:27+05:30 IST