Education: ఇదేం కానుక! 2 నెలలకే తుస్!
ABN, First Publish Date - 2023-01-05T12:19:34+05:30
విద్యార్థుల (students)కు ఇచ్చిన బ్యాగులు (bags) రెండు నెలలకే చిరిగిపోయాయి. వాటిలో పుస్తకాలు పట్టట్లేదు. చాలామంది పిల్లలు సొంత బ్యాగులే
2 నెలలకే చిరిగిపోయిన బ్యాగులు
సైజ్‌లు సరిపోని బూట్లు, సాక్సులు
చాలీచాలని యూనిఫాం క్లాత్
గిట్టుబాటు కాని కుట్టు కూలి
లోపాలను బయటపెట్టిన విజిలెన్స్
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘విద్యార్థుల (students)కు ఇచ్చిన బ్యాగులు (bags) రెండు నెలలకే చిరిగిపోయాయి. వాటిలో పుస్తకాలు పట్టట్లేదు. చాలామంది పిల్లలు సొంత బ్యాగులే వాడుకుంటున్నారు. ఇక బూట్లు (shoes), సాక్సులు కూడా పరమ నాసిరకంగా ఉన్నాయి. యూనిఫాం (Uniform) కోసం ఇచ్చే క్లాత్ మూడు జతలకు ఏమాత్రం చాలడం లేదు’... జగనన్న విద్యాకానుక (Jagannana Vidyakanuka) అమలులో లోపాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ (Vigilance and Enforcement Department) బయటపెట్టింది. ఒకరకంగా జేవీకే-3ని తీవ్రంగా తప్పుబట్టింది. కొద్దిరోజుల కిందట ఆ శాఖ రాష్ట్రవ్యాప్తం (ap)గా పలు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రధానంగా విద్యాకానుక కిట్లు, మధ్యాహ్న భోజనంలో అనేకచోట్ల లోపాలు బయటపడ్డాయి.
బ్యాగుల భాగోతం
విద్యాకానుకలో పంపిణీ చేసిన బ్యాగులు చాలా చిన్నవిగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా పిల్లలకు ఇచ్చిన బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉన్నాయని విజిలెన్స్ విభాగం తేల్చేసింది. కొన్నిచోట్ల బ్యాగులు రెండు నెలల్లో చిరిగిపోతే, మరికొన్ని చోట్ల మూడు నెలలు పట్టింది. అనకాపల్లి జిల్లాలోని ఓ పాఠశాలలో 544 మంది విద్యార్థుల్లో 30 మంది మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన బ్యాగును వినియోగిస్తు న్నారు. ఓ పాఠశాలలో 617 మంది పిల్లలకు బ్యాగులిస్తే ప్రస్తుతం 305 మంది వాటిని వినియోగిస్తున్నారు. మరో పాఠశాలలో కేవలం 5శాతం మందే జగనన్న బ్యాగులను బడికి తీసుకొస్తున్నారు. ఇక పిల్లలకు ఇచ్చిన బూట్లు, సాక్సులు కూడా నాసిరకంగానే ఉన్నాయి. ఒక్క పాఠశాలలోనే 55 జతల బూట్లు నాణ్యత లేవని, సైజు సరిపోలేదని వెనక్కి పంపారు.
ఇదేం భోజనం!
చాలాచోట్ల పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని ఇష్టపడట్లేదని విజిలెన్స్ గుర్తించింది. ఓ పాఠశాలలో 790 మందికి గాను 340 మంది విద్యార్థులే పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. భోజనం రుచిగా లేదని విద్యార్థులు సమాధానమిస్తున్నారని విజిలెన్స్ తెలిపింది. బాపట్ల జిల్లాలోని ఓ పాఠశాలలో భోజనానికి ప్లేట్లు, గ్లాసులు లేవని గుర్తించింది. రేపల్లె జిల్లా పరిధిలో ఓ ప్రాథమిక పాఠశాల నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలో 3 నుంచి 5 తరగతులను విలీనం చేశారు. అలా మారిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టట్లేదని తెలిపింది. పైగా 2కిలోమీటర్ల దూరంలో ఆహారం వండి పాఠశాలకు తరలిస్తున్నారని, ఫోర్టిఫైడ్ బియ్యం ఇవ్వట్లేదని తనిఖీల్లో వెల్లడైంది. కొన్నిచోట్ల వంట చేసేందుకు పాఠశాలల్లో గదులు లేవన్న విషయం తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్న భోజనానికి ఇస్తున్న బియ్యం సంచులపై ఎండీఎం అనే స్టాపింగ్ లేకుండానే పంపిస్తున్నారని తెలిపింది. శ్రీకాకుళం ప్రాంతంలో వంటకు బోరు నీరు వాడుతున్నారని అధికారులు గుర్తించారు.
3 జతలకు రూ.120
బాలికలకు 6 మీటర్లు, బాలురకు చొక్కాకు 6 మీటర్లు, ప్యాంటుకు 4.5 మీటర్లు ఇస్తున్నప్పటికీ... అవి మూడు జతల యూనిఫాంకు సరిపోవట్లేదు. ఇప్పటివరకూ తల్లిదండ్రులకు కుట్టుకూలీ ఇవ్వలేదు. అసలు కొంతమందికి కుట్టుకూలీ ఇస్తున్నారన్న విషయమే తెలియదు. ఇక మూడు జతలకు ఇస్తున్న రూ.120 కుట్టు కూలీ ఏ మూలకూ సరిపోవడం లేదు.
చిక్కీలపై తేదీల తకరారు
తాజా తనిఖీల్లో చిక్కీల పంపిణీలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అనకాపల్లి పరిధిలోని ఓ పాఠశాలకు డిసెంబరు 28న చిక్కీలు సరఫరా చేశారు. 30న విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ చిక్కీలను పరిశీలించగా డిసెంబరు 30న ఉత్పత్తి చేసినట్లు వాటిపై ముద్రించి ఉంది. వాటిని 28న ఎలా సరఫరా చేశారంటూ అధికారులు విస్తుపోయారు. గడువు ముగిసిపోయిన చిక్కీలు ఇస్తున్నారన్న విమర్శలను తప్పించుకునేందుకు కాంట్రాక్టర్లు ఉత్పత్తి చేసిన రోజున కాకుండా తర్వాత తేదీలను ముద్రిస్తున్నారు. ఇప్పటికే చిక్కీల కాంట్రాక్టు పొడిగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు లేకుండానే ప్రస్తుత కాంట్రాక్టర్లకు చిక్కీల సరఫరా గడువును అప్పనంగా పొడిగించారు.
ఓ అధికారి తీరుతో చెడ్డపేరు
జగనన్న విద్యాకానుక(Cm jagan)లో ఈ ఏడాది పంపిణీ చేసిన కిట్లపై ఎన్నడూ లేనన్ని ఆరోపణలు వచ్చాయి. 6 లక్షలకు పైగా బ్యాగులు చిరిగిపోయాయని ప్రధానోపాధ్యాయులే(Teacher) ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే గతేడాది టెండర్ల సమయంలో ఓ అధికారి అత్యుత్సాహమే చెడ్డపేరు తీసుకొచ్చిందని విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ఒక్కో బ్యాగును గరిష్ఠంగా రూ.250కు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. విద్యాకానుకలో స్మాల్, మీడియం, లార్జ్ మూడు రకాల బ్యాగులు పంపిణీ చేశారు. వాటిని సగటున ఒక్కొక్కటి రూ.180కే కొనుగోలు చేశారు. అంత తక్కువకు ఇచ్చే బ్యాగుల్లో నాణ్యత ఉంటుందా అని ఆలోచించకుండా ఓ అధికారి ఏకపక్షంగా వ్యవహరించిన తీరుతో బ్యాగులు పనికిరాకుండా పోయాయనే వాదన వినిపిస్తోంది.
Updated Date - 2023-01-05T12:57:33+05:30 IST