Telangana: ఎంత పని చేశావమ్మా? నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్న.. !
ABN, First Publish Date - 2023-03-14T11:29:52+05:30
టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగం పోస్టుల పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకయ్యాయని (Question papers leaked) అనుమానించి విచారణ జరిపితే..
లీకైంది.. ఏఈ ప్రశ్నపత్రం
టౌన్‌ప్లానింగ్‌దిగా అనుమానించిన అధికారులు
పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడి
ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష
సుమారు 55 వేల మంది రాసిన పరీక్ష రద్దు!
నేడు టీఎస్‌పీఎస్సీ భేటీలో నిర్ణయం
లీక్ సూత్రధారులు ఉపాధ్యాయురాలు, ఆమె భర్త
టీఎస్‌పీఎస్సీలోని ఉద్యోగులు పాత్రధారులు
తమ్ముడికి ఉద్యోగం కోసం టీచర్ నిర్వాకం
ప్రవీణ్‌కు రూ.10 లక్షలు ఇచ్చిన టీచర్ రేణుక
ఏఈ ప్రశ్నపత్రాలను లీక్ చేసి ఇచ్చిన ప్రవీణ్
ఆపై మరో నలుగురికి టీచర్ అమ్మినట్లు నిర్ధారణ
9 మంది అరెస్టు.. ఐదుగురు ఉద్యోగులపై వేటు
గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రమూ లీకైందా?
హైదరాబాద్ సిటీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగం పోస్టుల పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకయ్యాయని (Question papers leaked) అనుమానించి విచారణ జరిపితే.. మరో దిగ్ర్భాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైనట్లు తేలింది. మునిసిపల్ పరిపాలన విభాగంలో ఖాళీగా ఉన్న 837 అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 5న పరీక్ష నిర్వహించారు. సుమారు 55 వేల మంది రాసిన ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలే లీకైనట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. మంగళవారం కమిషన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (Govt teacher) తన తమ్ముడికి ఏఈ ఉద్యోగం తెప్పించేందుకు భర్తతో కలిసి టీఎస్‌పీఎస్సీ లో పనిచేసే ఉద్యోగులను మచ్చిక చేసుకొని ప్రశ్నపత్రాల లీకేజీ (AE Question Paper Leak) వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
సూత్రధారులు ఉపాధ్యాయురాలు, ఆమె భర్త కాగా.. లీకేజీకి పాల్పడిన పాత్రధారులు మాత్రం టీఎస్‌పీఎస్సీ లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులుగా తేల్చారు. వీరు నలుగురు సహా 9 మందిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్, బేగం బజార్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ పీసీ, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ కారా, టాస్క్‌ఫోర్స్ డీసీపీ (ఓఎస్‌డీ) రాధాకిషన్‌తో కలిసి సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. దాని ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పంచన్‌గల్ తండాకు చెందిన రేణుక.. మహబూబ్‌నగర్‌లో ఓ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె తమ్ముడు రాజేశ్వర్ నాయక్ ఏఈ సివిల్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఎలాగైనా తన తమ్ముడు ఉద్యోగం పొందాలని భావించిన రేణుక ఈ విషయాన్ని వికారాబాద్ ఆర్‌డీఏ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన భర్త ఢాక్యాకు చెప్పింది. ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. రేణుకకు టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌తో ఉన్న పరిచయాన్ని వాడుకోవాలని పథకం వేశారు. ప్రవీణ్‌ను సంప్రదించిన రేణుక ఈనెల 5న జరిగే ఏఈ (సివిల్) ఎగ్జామ్ పేపర్‌ను తనకు అందించాలని కోరింది. రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుంది.
పేపర్ లీక్ కోసం ప్రవీణ్ టీఎస్‌పీఎస్సీ లో ఔట్‌సోర్సింగ్‌లో నెట్‌వర్క్ అడ్మిన్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజు సహకారం తీసుకున్నాడు. పబ్లిక్ పరీక్షల సమాచారం, ప్రశ్నపత్రాలు టీఎ్‌సపీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో ఉంటాయి. అక్కడికి ఎవరికీ యాక్సెస్ ఉండదు. కానీ, ప్రవీణ్ టీఎ్‌సపీఎస్సీ కార్యదర్శి పీఏ కావడంతో అన్ని సెక్షన్‌లకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే అవకాశంగా భావించిన ప్రవీణ్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్‌లక్ష్మి నోట్‌బుక్‌లో నుంచి ప్రశ్నపత్రాలు భద్రపరిచిన సిస్టమ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చోరీ చేసి రాజశేఖర్‌కు ఇచ్చాడు. అతడు శంకర్‌లక్ష్మి సిస్టమ్ నుంచి ఏఈ (సివిల్) పరీక్షలకు సంబంధించిన రెండు ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకున్నాడు. ఈ నెల 2న ప్రవీణ్ వాటిని రేణుకుకు అందించాడు. ఆమె రూ.5 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని ఒకటి రెండు రోజుల్లో ఇస్తానని చెప్పింది. ప్రవీణ్ ద్వారా ప్రశ్నపత్రాలను తీసుకున్న రేణుక ఒకరోజంతా తమ్ముడితో కలిసి సమాధానాలు రాసుకుంది. ఆ తర్వాత ప్రశ్నపత్రాలను ఆశావహ అభ్యర్థులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించింది. అందుకు తన భర్తతోపాటు.. తమ్ముడి సహకారం తీసుకుంది. వారు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కజిన్ శ్రీనివా్‌సకు లీకేజీ ప్రశ్నపత్రాల గురించి చెప్పారు. ఎవరైనా అభ్యర్థులు ఉంటే చెప్పాలని అడిగారు. దాంతో తాను ఎస్సై ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నానని, మరో ఇద్దరు స్నేహితులు నీలేశ్‌నాయక్, గోపాల్ నాయక్ ఏఈ సివిల్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారని చెప్పాడు. దాంతో రేణుక ఆమె భర్తతో కలిసి వారికి పేపర్‌ను విక్రయించింది. వారితో పాటు వారి మరో స్నేహితుడికి ప్రశ్నపత్రాన్ని విక్రయించి మొత్తం రూ.13.50 లక్షలు సొమ్ము చేసుకున్నారు.
అనుకున్నది ఒకటి లీకేజీ మరొకటి..
ఏఈ పరీక్ష ఈ నెల 5న పూర్తికాగా, ఈ నెల 12, 15, 16న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీస్, వెటర్నరీ అసిస్టెంట్ పబ్లిక్ పరీక్షా పత్రాలు లీకైనట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులకు సమాచారం అందింది. దీంతో టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనట్లు ఆధారాలు లభించడంతో కంగుతిన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పనితీరు, ప్రశ్నపత్రాల లీకేజీపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారులతో పాటు ఇతర ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో ప్రశ్నపత్రాలు దాచి ఉంచిన సిస్టమ్ యూసర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నోట్‌బుక్‌లో ఎందుకు రాయాల్సి వచ్చింది? దాన్ని ప్రవీణ్ ఎలా గుర్తించాడు? చోరీ చేసినట్లు ఎవరూ ఎందుకు గుర్తించలేకపోయారు? సీసీటీవీ కెమెరాలు, కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో జరిగే విషయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎందుకు లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టుల పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని విధుల నుంచి తొలగించారు. వీరితోపాటు ఉపాధ్యాయురాలు, ఆమె భర్త, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
గ్రూప్-1 పేపర్ కూడా లీకైందా?
అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనట్లు తేలడంతో.. టీఎస్‌పీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో కూడా గోల్‌మాల్ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రూప్-1 పరీక్ష పత్రాలు లీకై ఉండొచ్చని పలువురు అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం టీఎస్‌పీఎస్సీని కుదిపేస్తుండడంతో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
Updated Date - 2023-03-14T11:30:41+05:30 IST