India vs Canada వివాదంలో మరో కీలక పరిణామం.. వీసాల జారీ నిలిపివేత!
ABN, First Publish Date - 2023-09-21T13:50:51+05:30
భారత్, కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు దెబ్బ తింటున్నాయే తప్ప మెరుగుపడడం లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
భారత్, కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు దెబ్బ తింటున్నాయే తప్ప మెరుగుపడడం లేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మన దేశానికి వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విషయంపై విదేశాంగ శాఖ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ నిర్వహణ కారణాలతో కెనడాలో వీసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పలు ప్రైవేటు ఏజెన్సీలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వానికి వీసా, పాస్ట్ పోర్టు ధృవీకరణ సేవలను అందించే బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ వెబ్‌సైట్ ‘‘నిర్వహణ కారణాల రీత్యా 21 సెప్టెంబర్ 2023 నుంచి తుదుపరి నోటీసులు వచ్చే వరకు వీసా సేవలు నిలిపివేయబడ్డాయి’’ అని పేర్కొంది. తదుపరి అప్‌డేట్స్ కోసం వీసా దరఖాస్తు దారులు తమ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండాలని సూచించింది.
మరోవైపు కెనడా(Canada)లో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింసాకాండను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని భారత(India) ప్రభుత్వం బుధవారం అక్కడి భారతీయ పౌరులు, విద్యార్థులను హెచ్చరించింది. ఖలీస్థాన్ (Khalisthan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudo) చేసిన ఆరోపణల నుంచి ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. కెనడా ప్రధాని భారత్ గురించి ఆ దేశ పార్లమెంటులో చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత రాయబారి(Ambassador of India)పై కెనడా నిషేధం విధించగా.. దానికి బదులుగా కెనడా రాయబారిని భారత్ బహిష్కరించింది. 5 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. తాజాగా కెనడా పౌరులకు భారత్ వీసాలను కూడా నిలిపివేసింది. దీనికి తోడు నేడు కెనడాలో మరో ఖలీస్థాన్ ఉగ్రవాది హత్యకు గురయ్యాడు. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకేను చంపేశారు. అయితే ఈ వివాదంపై ప్రపంచ దేశాలు మాత్రం భారత్‌కే మద్దతుగా నిలుస్తున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన సంఘటనల దృష్యా భారత్, కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం ఎటు దారి తీస్తుందనేది వేచి చూడాలి.
Updated Date - 2023-09-21T13:53:03+05:30 IST