Israel vs Hamas: టీవీ హోస్ట్ సోదరిపై హమాస్ ఉగ్రవాదుల దారుణం.. చనిపోయినట్లు నటించినా..
ABN , First Publish Date - 2023-10-10T15:56:38+05:30 IST
ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగిన హమాస్ ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దొరికిన చోటే ఇజ్రాయెల్ పౌరుల్ని చంపడం, మహిళలపై అత్యాచాలకు పాల్పడటం, పిల్లల్ని ఎత్తుకెళ్లడం...
ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగిన హమాస్ ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దొరికిన చోటే ఇజ్రాయెల్ పౌరుల్ని చంపడం, మహిళలపై అత్యాచాలకు పాల్పడటం, పిల్లల్ని ఎత్తుకెళ్లడం వంటి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కొంచెం కూడా కనికరం చూపకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా వీళ్లు ఒక టీవీ హోస్ట్ సోదరిని చంపిన తీరు గురించి తెలిస్తే.. ప్రతిఒక్కరి గుండె చలించిపోతుంది. హమాస్ ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడం కోసం ఆమె చనిపోయినట్టు నటించినా.. శ్వాస ఉందని గుర్తించి మరీ ఆమెను కిరాతకంగా హతమార్చారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. శనివారం హమాస్ ఉగ్రవాదులు నోమా మ్యూజిక్ ఫెస్టివల్‌లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా వాళ్లు ఈ వేడుకపై కాల్పులు జరిపి, వందలాది మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఇంకా చాలామంది గాయాలపాలయ్యారు. ఈ వేడుకకు ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ టీవీ హోస్ట్ మాయన్ ఆడమ్ సోదరి మాపల్ ఆడమ్ (27) తన ప్రియుడితో కలిసి వెళ్లింది. ఆ వేడుకలో వీళ్లు సరదాగా ఎంజాయ్ చేస్తుండగా.. హమాస్ ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేశారు. అప్పుడు వీళ్లిద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే.. హమాస్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు చేయడంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. వీళ్లు ఒక ట్రక్కు కింద దాక్కుని, చనిపోయినట్లుగా నటించారు.
అయితే.. హమాస్ ఉగ్రవాదులు మాపల్ ఆడమ్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ట్రక్కు కింద దాక్కున్నారన్న విషయాన్ని గుర్తించారు. వాళ్లు చనిపోయారా? లేదా? అని నిర్ధారించుకోవడం కోసం దగ్గరకు వెళ్లి చూశారు. అప్పుడు వాళ్లు శ్వాస తీసుకోవడాన్ని గుర్తించి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మాపల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె బాయ్‌ఫ్రెండ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. తాను చనిపోవడానికి ముందు మాపల్ ట్రక్కు కింద దాక్కుని ఉన్న ఫోటోని తన సోదరికి పంపించింది. అక్కడ పరిస్థితుల్ని సైతం వివరించింది. ఆ ఫోటోని మాయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన సోదరి మాపల్ పట్ల హమాస్ ఉగ్రవాదులు పాల్పడిన దారుణం గురించి వివరించింది. ఆ కిరాతకులు దారుణంగా తన సోదరిని చంపారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘ఇది నా సోదరి మాపల్ తీసిన చివరి ఫొటో. నోమా మ్యూజిక్ ఫెస్టివల్‌ని హమాస్ ఉగ్రవాదులు చుట్టుముట్టిన సమయంలో, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం మాపల్ ఒక ట్రక్కు కింద దాక్కుంది. కొన్ని గంటల పాటు కదకుండా, చనిపోయినట్లు నటించింది. కానీ.. ఆ ఉగ్రవాదులు దగ్గరకొచ్చి, శ్వాస తీసుకుంటోందని గుర్తించి, ఆమెను దారుణంగా చంపేశారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ గాయాలతో పక్కన పడిపోయాడు’’ అంటూ మాయన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా.. మాపల్ కొంతకాలం పాటు ఇజ్రాయెల్ మిలిటరీలో పని చేసింది. అటు.. ఆ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు.