Modi: యుద్ధంలో ప్రాణ నష్టం బాధాకరం.. ఇజ్రాయెల్ - హమాస్ చర్చలు జరపాలన్న మోదీ
ABN , First Publish Date - 2023-11-17T12:00:06+05:30 IST
Global Summit: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంలో పౌరుల మరణం బాధాకరమని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు.
ఢిల్లి: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంలో పౌరుల మరణం బాధాకరమని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఢిల్లీలో జరిగిన పశ్చిమాసియా గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభ సెషన్ లో ప్రధాని మాట్లాడుతూ.. "ఉగ్రవాదానికి(Terrorism) వ్యతిరేకంగా భారత్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. యుద్ధంలో వేల సంఖ్యలో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మంచిపరిణామం కాదు. ఇప్పటికైనా ఇరు వర్గాలు శాంతి చర్చలు చేపట్టాలి. సంయమనం పాటిస్తూ చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిని భారత్(India) ఖండించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ పై చేస్తున్న దాడినీ ఖండిస్తోంది.
మేం ఇన్నాళ్లు సంయమనం పాటించాం. చర్చలతో పరిష్కారం చేసుకుంటారని భావించాం. రెండు వర్గాలు యుద్ధ విరమణ చేయకపోవడంతో ప్రజలు బలవుతున్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడిన తర్వాత, భారత్ అక్కడి ప్రజలకు మానవతా సహాయాన్ని పంపింది. ప్రపంచ ప్రయోజనాల కోసం అన్ని దేశాలు ఏకం కావాల్సిన సమయం ఇది" అని అన్నారు.
గత నెలలో ప్రారంభమైన ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 12 వేలకుపైగా ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇజ్రాయెల్ సేనలు గాజాపై భీకర దాడులు చేస్తున్నాయి. గాజా(Gaza)లోని అనేక ఆసుపత్రుల్లో తగిన వైద్యం అందక కునారిల్లుతున్నాయి. వందల సంఖ్యలో క్షతగాత్రులు వైద్యం అందక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఆసుపత్రులే టార్గెట్ గా ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి.