Canada: ఇండియన్స్ జస్టిన్ ట్రూడోను కమెడియన్‌గా భావిస్తారు: పియర్ పోయిలివ్రే
ABN , First Publish Date - 2023-10-22T13:46:22+05:30 IST
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo)ని ఇండియాలో ఓ కమెడియన్ గా భావిస్తారని కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడా నేత పియర్ పోయిలివ్రే(Pierre Poilievre) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo)ని ఇండియాలో ఓ కమెడియన్ గా భావిస్తారని కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడా నేత పియర్ పోయిలివ్రే(Pierre Poilievre) ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ - కెనడా(India - Canada)ల మధ్య ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వివాదానికి దారి తీయడంతో.. ఈ విషయంలో కెనడా ప్రతిపక్ష నేత పియర్ స్పందించారు. కెనెడియన్ దౌత్యవేత్తలను ఇండియా విడిచి వెళ్లాలని ఆదేశించినప్పుడు.. జస్టిన్ ట్రూడో స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అసమర్థుడని, ప్రపంచంలోని చాలా దేశాలతో వివాదాలు పెట్టుకోవడమే ఆయన పని అని విమర్శించారు.
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోని భారత్‌లో "లాఫింగ్ స్టాక్"గా పరిగణిస్తారని పోయిలీవ్రే విమర్శించారు. కెనడాకు భారత ప్రభుత్వంతో "ప్రొఫెషనల్" బంధం అవసరమని, తాను ప్రధాని అయితే అందుకోసం కృషి చేస్తామని పొయిలీవ్రే చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంతో ఇలాంటి వివాదాలకు వెళ్లడం మంచిది కాదని.. ఏదైనా చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. "హిందూ మందిరాలపై జరుగుతున్న దాడులను నేను ఖండిస్తున్నా. హిందూ నాయకులపై బెదిరింపులు, బహిరంగ కార్యక్రమాల్లో భారతీయ దౌత్యవేత్తలపై చూపే వివక్ష మంచిది కాదు. దాడులు చేస్తే నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు" అని పియరీ పేర్కొన్నారు. కెనడాలో అనేక హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఆయన పై విధంగా స్పందించారు.