Volcano in Philippines: జనావాసాలను కమ్మేసిన విష వాయువులు.. ఏ క్షణమైన అగ్నిపర్వతం పేలే ఛాన్స్
ABN , First Publish Date - 2023-09-22T14:40:26+05:30 IST
ఫిలిప్పీన్స్(Philippines) దేశంలో ఓ అగ్నిపర్వతం(Volcano) ప్రజలను భయపెడుతోంది. అది రగులుతూ.. విష వాయువులు వెదజల్లుతోంది. దీంతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు.
ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్(Philippines) దేశంలో ఓ అగ్నిపర్వతం(Volcano) ప్రజలను భయపెడుతోంది. అది రగులుతూ.. విష వాయువులు వెదజల్లుతోంది. దీంతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఆ దేశ రాజధాని మనీలాకు సమీపంలో ఉన్న తాల్ అనే అగ్నిపర్వతం ఉంది. ఇటీవలి కాలంలో లావా ఉప్పొగుతోంది. దీనికి తోడు సల్ఫర్ డై ఆక్సైడ్ (Sulphur di Oxide)వాయువు వెదజల్లుతూ జనావాసాలను పొగతో కమ్మేస్తోంది. ఈ పొగతో 5 నగరాలు, చాలా పట్టణాల్లో బడులను మూసేశారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
మనీలా(Manila) సమీపంలోని బటాంగాస్ ప్రావిన్స్‌లోని ఒక సుందరమైన సరస్సులో తాల్ అగ్ని పర్వతం 311 మీటర్ల పొడవుతో ఉంది. 2020 జనవరిలో, ఇది 15 కిమీ ఎత్తు వరకు బూడిద, ఆవిరి వెదజల్లింది. ఆ టైంలో లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మనీలా వరకు బూడిద పడటంతో పదుల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. ఈ బూడిదతో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయని అధికారులు చెప్పారు. అగ్నిపర్వతం ద్వారా వెలువడే వాయువుతో కళ్ళు, గొంతు, శ్వాసనాళ సమస్యలు వస్తాయి. అయితే ఫిలిప్పీన్స్ భూకంపాలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవడం సాధారణమే అంటున్నారు నిపుణులు.