Most Polluted Cities: వాయు కాలుష్యంలో ఢిల్లీ సరసన చేరిన మరో రెండు నగరాలు
ABN, First Publish Date - 2023-11-13T11:52:41+05:30
ఇప్పటికే తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీని దీపావళి వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. తీవ్ర స్థాయిలో ఉన్న వాయు కాలుష్యం శనివారం నాటికి కాస్త మెరుగుపడింది. కానీ ఆదివారం దీపావళి కావడం నగరవాసులు భారీగా టపాసులు పేల్చడంతో రాజధాని ప్రాంతంలో మరోసారి పొగ అలుముకుంది.
ఢిల్లీ: ఇప్పటికే తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీలో దీపావళి టపాసుల కారణంగా తీవ్రత మరింత పెరిగింది. శనివారం నాటికి కాస్త మెరుగుపడిన వాయు కాలుష్యం ఆదివారం నగరవాసులు భారీగా టపాసులు పేల్చడంతో రాజధాని ప్రాంతంలో మరోసారి పొగ అలుముకుంది. పండుగ కావడంతో ఈ టపాసుల మోత దేశం మొత్తం కొనసాగింది. దీంతో కాలుష్యం బారిన నగరాల జాబితాలో దేశంలోని మరో రెండు ప్రాంతాలు చేరాయి. ఈ కారణంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యవంతమైన టాప్ 10 నగరాల్లో ఢిల్లీ సరసన దేశంలోని మరో రెండు నగరాలు చేరాయి. దీపావళి టపాసుల కారణంగా కోల్‌కతా, ముంబై నగరాల్లో కూడా సోమవారం ఉదయం నాటికి తీవ్ర వాయుల కాలుష్యం అలుముకుంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ ప్రకారం సోమవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ సూచిక 420కి చేరుకుంది. ఇది ప్రమాదకర కేటగిరీ కిందికి వస్తోంది.
కాగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యవంతమైన నగరాల జాబితాలో ఢిల్లీ అగ్ర స్థానంలో ఉంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత అయితే ఢిల్లీలో దట్టమైన పొగ వ్యాంపించింది. ఆ సమయంలో ఏక్యూఐ అత్యంత ప్రమాదకర స్థాయిలో ఏకంగా 680కి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక 196గా నమోదైన కోల్‌కతా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ క్వాలిటీ సూచిక 163గా నమోదైన ముంబై ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఏక్యూఐ సూచిక 400 నుంచి 500 మధ్య నమోదైతే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు. ఈ స్థాయిలో ఉండే వాయు కాలుష్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ సూచిక 150 నుంచి 200 మధ్య నమోదైతే అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశాలుంటాయి. ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే మాత్రమే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
పరిస్థితులను అదుపులో ఉంచడానికి ప్రతి ఏటా ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై అధికారులు నిషేధం విస్తుంటారు. కానీ ఆ నిషేధం చాలా అరుదుగా మాత్రమే అమలు అవుతుంటుంది. కాగా వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణాల నుంచి వచ్చే ధూళి పొగల కారణంగా ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. అదే సమయంలో దీపావళి పండుగ కూడా రావడంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. వారం రోజులుగా ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కాలుష్యాన్ని అదుపు చేయడానికి ఢిల్లీలో అధికారులు వాహనాల వినియోగాన్ని నియంత్రించాలని భావించారు. కానీ శుక్రవారం వర్షం కురవడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో తమ నిర్ణయాన్ని అధికారులు వాయిదా వేశారు. దీపావళి తర్వాత వాహనాల వినియోగంపై ఆంక్షలు విధించే అంశంపై ఢిల్లీ ప్రభుత్వం సమీక్షించనుంది.
Updated Date - 2023-11-13T17:18:25+05:30 IST