Kerala varsity: కేరళ వర్సిటీలో విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి, 64 మందికి గాయాలు
ABN, First Publish Date - 2023-11-26T07:23:07+05:30
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీ సందర్భంగా భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు చనిపోగా.. 64 మంది గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కొచ్చి: కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీ సందర్భంగా భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు చనిపోగా.. 64 మంది గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. చనిపోయిన విద్యార్థులను ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అతుల్ థంపి, ఆన్ రిప్తా, జితేంద్ర దాము, సారా థామస్‌గా గుర్తించారు. గాయపడిన వారిని కలమస్సేరీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి, ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఈ విషాదకర ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వర్సిటీలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరికి ప్రఖ్యాత నేపథ్య గాయని నికితా గాంధీ హాజరయ్యారు. దీంతో ఈ కార్యక్రమానికి 2 వేలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. అయితే కచేరి ఊపులో ఉన్న సమయంలో ఒక్కసారిగా వర్షం వచ్చింది.
దీంతో వెనుక వైపు ఉన్న వాళ్లంత వర్షానికి తడవకుండా ఉండేందుకు ముందుకు తోసుకొచ్చారు. దీంతో వేదిక ముందు భాగం కిక్కిరిసిపోయింది. ఆ తాకిడికి తాళలేక వాళ్లంతా బయటికి పరుగులు తీశారు. అదే సమయంలో బయట వర్షంలో తడుస్తున్న వారంతా లోపలికి వచ్చారు. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారి తీసింది. ఆడిటోరియం నుంచి బయటికి వెళ్లేందుకు, లోపలికి వచ్చేందుకు ఒకటే ద్వారం ఉండడం కూడా ఈ ప్రమదానికి కారణమైంది. పలువురు విద్యార్థులు మెట్లపై నుంచి కిందపడిపోయారు. కిందపడిన విద్యార్థులను మిగతా వారు తొక్కుకుంటూ పరుగులు తీశారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. “మరణించిన వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో గాయపడిన 64 మందిని కలమస్సేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రి, మరికొన్ని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్ర పరిశ్రమల మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి.రాజీవ్.. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు సంఘటనా స్థలానికి బయలుదేరారు” అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కోజికోడ్‌లో తెలిపారు.
కుసాట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీజీ శంకరన్ మాట్లాడుతూ ‘‘సంగీత కార్యక్రమానికి భారీగా జనం హాజరయ్యారు. మా కార్యక్రమాలకు బయటి నుంచి కూడా జనాలు వస్తుంటారు. ఈ కార్యక్రమానికి 2,000 మందికిపైగా హాజరయ్యారు. దురదృష్టవశాత్తూ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో వర్షం కురిసింది. దీంతో తొక్కిసలాట జరిగి విద్యార్థులు కింద పడిపోయారు. మృతులు ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు. యూనివర్సిటీ పోగ్రాం గురించి పోలీసులకు సమాచారం అందించాం. నాకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆడిటోరియం మెట్ల మీద బయట నిలబడి ఉన్నవారు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది ” అని ఆయన అన్నారు. మృతులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. “కుసాట్ క్యాంపస్‌లో జరిగిన విషాదం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతి చెందిన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటాం. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించాను. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాం’’ అని తెలిపారు.
Updated Date - 2023-11-26T07:23:09+05:30 IST